పింప్రి, న్యూస్‌లైన్ : సీటే ముఖ్యం.. పార్టీ కాదు.. అన్నట్టుగా అభ్యర్థులు ఉన్నారు. ఇన్నాళ్లు పార్టీల జెండాలను మోయడానికే పరిమితమైన రెండవ తరగతి నాయకులకు తమ పార్టీ టెక్కెట్ ఇవ్వక పోవడంతో గుర్తింపు పొందిన పార్టీలో చేరి ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బీజేపీ-రిపబ్లికన్ మధ్య పొత్తు ఉండేనా..
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తోనే ఉండాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అధ్యక్షుడు రాందాస్ అఠావలే ప్రకటించినా ఆ పార్టీ అభ్యర్థులు అనేక మంది పలు నియోజక వర్గాల్లో నామినేషన్లు వేశారు.
పుణే లోని వడగావ్ శేరి నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దిలీప్ కాంబ్లే నామినేషన్ వేయగా ఆర్పీఐ నుంచి నవనాథ్ కాంబ్లే పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీ తుదివరకు పోటీకి నిలబడుతుందో వేచి చూడాలి. ఆయా పార్టీ నాయకుల మాటలను అభ్యర్థులు ఎంత వరకు పాటిస్తారో? అధినాయకత్వం వీరిపై ఏ చర్యలు తీసుకోనుందో తేలాల్సి ఉంది.?
మూడు పార్టీలు మారిన జగతాప్...
ఐదేళ్ల కిందట చించ్‌వడ్ నుంచి కాంగ్రెస్‌కు సీటు లభించలేదు. పొత్తులో భాగంగా ఎన్సీపీకి సీట్ కేటాయించారు. దీంతో లక్ష్మణ్ జగతాప్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా మావల్ నుంచి శేత్‌గారి కామ్‌గార్ పార్టీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. తిరిగి ఎన్సీపీ గూటికి చేరుతాడన్న ఊహాగానాలు ఉండగా, చివరికి బీజేపీ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ అభ్యర్థిగా చించ్‌వడ్ అసెంబ్లీ నుంచి నామినేషన్ వేశారు.
పార్టీలు మారిన నాయకులు...
పుణే మాజీ ఉప మేయర్ దీపక్ మానకర్ కాంగ్రెస్‌ను వీడి ఎన్సీపీ నుంచి నామినేషన్ వేయగా, గతంలో ఎన్సీపీ నుంచి పోటీ చేసిన సచిన్ తావరే శివసేన పార్టీ అభ్యర్థిగా ఈసారి పోటీ చేస్తున్నారు. శివసేన మాజీ ఎమ్మెల్యే శరద్ డమాలే ఈసారి భోర్ బీజేపీ అభ్యర్థిగా నిలిచారు. బీజేపీకి చెందిన కార్పొరేటర్ మిలింద్ ఏక్‌బోటే శివాజీనగర్ నుంచి శివసేన తరఫున పోటీ చేస్తున్నారు.
ఆంబేగావ్‌లో శివసేన ఎంపీ శివాజీరావు ఆడల్‌రావుకు కుడి భుజంగా ఉన్న జైసింగ్ ఎరండే బీజేపీలోకి వెళ్లి పోటీ చేస్తున్నారు. జున్నర్‌లో శివసేన మాజీ పంచాయతీ సమితి సభ్యుడు నేతాజీ డోకే బీజేపీ అభ్యర్థిగా అవతారమెత్తారు. శివాజీ నగర్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ దత్తా బహరట్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించడం, ఓటర్ల మనస్సు గెలుచుకోవడం, అభ్యర్థులకు ఈసారి కత్తిమీద సాముగా మారనుంది.
సీటే ముఖ్యం.. పార్టీ కాదు
Published Mon, Sep 29 2014 11:17 PM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM
Advertisement
Advertisement