లక్నో, ఉత్తరప్రదేశ్ : ఉనావో అత్యాచార బాధితురాలికి దేశవ్యాప్తంగా మద్ధతు లభిస్తోంది. 2011లో బీఎస్పీ ఎమ్మెల్యే పురుషోత్తం ద్వివేది చేతిలో అత్యాచారానికి గురైన శీలు నిషాద్ తాజాగా ఉనావో బాధితురాలికి బాసటగా నిలిచారు. యువతికి మద్దతుగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బహిరంగ లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా షాబాజ్‌నగర్‌కు చెందిన శీలు నిషాద్ 17 ఏళ్ల వయసులో తనకు జరిగిన అన్యాయం గురించి ఈ లేఖలో వెల్లడించారు. ప్రభుత్వ పెద్దలు తన న్యాయపోరాటాన్ని ఎలా అడ్డుకున్నారో తెలిపారు. ఎమ్మెల్యేపై కేసు వేయడంతో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితులను ఇందులో వెల్లడించారు.
అయినా ధైర్యంగా వాటన్నింటినీ ఎదుర్కొని పురుషోత్తం ద్వివేదీకి పదేళ్ల జైలు శిక్ష పడేలా చేశానని చెప్పుకొచ్చారు. ఆ విధంగా 2015లో జర్నలిస్టుల, ఇతర నేతల సహకారంతో ద్వివేదిని కటకటాల్లోకి నెట్టానని తెలిపారు. తన కేసుపై పోరాడే సమయంలోనే ఢిల్లీలో నిర్భయ ఘటన చోటు చేసుకుందన్నారు. నిర్భయ దోషులకు మరణ శిక్ష విధించాలని పోరాడిన వారిలో తానూ భాగం కావడం గర్వంగా ఉందన్నారు. పురుషోత్తం ద్వివేదీపై కేసు విజయంలో ‘గులాబీ గ్యాంగ్’ మహిళా సంక్షేమ స్వచ్చంద సంస్థ స్థాపకురాలు సాత్పాల్ దేవీ, జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు తనకు మద్ధతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఉనావో అత్యాచార బాధితురాలికి మేమంతా ఉన్నామనే ధైర్యాన్నివ్వడానికే ఈ లేఖ రాశానని శీలు నిషాద్ అన్నారు.
యోగీ, మోదీలతోనే సాధ్యం..
ఉనావో కేసులో బాధితురాలికి ప్రభుత్వం ఎందుకు మద్ధతుగా నిలవడం లేదని ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి మీకు సీట్లు అవసరం. అందుకనే సాధారణ ప్రజానీకాన్ని లెక్కచేయరని విమర్శించారు. బాధిత యువతికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాధికారుల తీరు చూస్తుంటే ఆమెకు న్యాయం జరిగేలా లేదని అభిప్రాయపడ్డారు. అయినా ప్రభుత్వాల అజమాయిషీలో పనిచేసే అధికారులని నిందించలేమని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరుగుతుందనీ, ఈ కేసుని సీబీఐతో విచారణ చేయించి దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment