
అవమానాలు ఇంకెంత కాలం!
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో.. బీజేపీ, శివసేన అనుబంధానికి సంబంధించి ఆదివారం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
బీజేపీపై శివసేన ఆగ్రహం
మహారాష్ట్రలో ఎన్సీపీ మద్దతు స్వీకరిస్తే.. ప్రతిపక్షంలో కూర్చుంటామని వెల్లడి
2 రోజుల్లో స్పష్టతనివ్వాలి
సురేశ్‌ప్రభును బీజేపీలో చేర్చుకోవడంపై ఆగ్రహం
న్యూఢిల్లీ/ముంబై: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో.. బీజేపీ, శివసేన అనుబంధానికి సంబంధించి ఆదివారం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, తదనంతర పరిణామాలతో ఇప్పటికే ఈ రెండు సైద్ధాంతిక సారూప్య పార్టీల మధ్య విభేదాలు ప్రస్ఫుటమయ్యాయి. తాజాగా కేంద్ర మంత్రివర్గంలో మరో రెండు కేబినెట్ స్థానాలు కావాలన్న సేన అభ్యర్థనను పట్టించుకోకుండా.. ఒక సహాయ మంత్రిపదవి మాత్రమే ఇస్తామనడం, దాంతోపాటు, తమ పార్టీకి చెందిన సురేశ్‌ప్రభును బీజేపీలో చేర్చుకుని, కేబినెట్ మంత్రి పదవి ఇవ్వడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. మరోవైపు, మహారాష్ట్రలో విశ్వాసపరీక్ష సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ఎన్సీపీ మద్దతును తీసుకోనుందనే వార్తలు శివసేనకు పుండు మీద కారంలా మారాయి. ‘ఇంకెంతకాలం ఈ అవమానాలను భరించాలి?’ అని శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే మండిపడ్డారు. మంత్రిగా ప్రమాణం చేయాల్సి ఉన్న సేన ఎంపీ అనిల్ దేశాయ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనకుండానే ఖైరేతో కలిసి ఢిల్లీ నుంచి ముంబైకి వెనుతిరిగారు. ప్రస్తుతం మోదీ కేబినెట్లో ఉన్న ఏకైక మంత్రి అనంత్ గీతే కూడా మంత్రిపదవికి రాజీనామా చేస్తారని, ఎన్‌డీఏ సంకీర్ణం నుంచి శివసేన వైదొలగనుందని వార్తలొవచ్చాయి. ప్రమాణ కార్యక్రమంలో శివసేన పాల్గొనకపోవడంపై బీజేపీ స్పందిస్తూ.. కార్యక్రమానికి శివసేనను ఆహ్వానించామని, ఎందుకు హాజరు కావొద్దనుకున్నారో వారే చెప్పాలని పేర్కొంది.
ఇప్పుడే కాదు..
అయితే, బీజేపీతో పొత్తు విషయంలో ఇంకా తమ ద్వారాలు తెరిచే ఉన్నాయని, ఎన్సీపీ మద్దతు స్వీకరణపై రెండు రోజుల్లోగా బీజేపీ స్పష్టతనివ్వాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అల్టిమేటం ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీలో సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండేను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం ముంబైలో విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా ఎన్సీపీ మద్దతును బీజేపీ అంగీకరిస్తే.. ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘హిందూత్వ శక్తుల్లో చీలిక రాకూడదని మా ఉద్దేశం. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తామంటున్నారు. కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించినవాడాయన. వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే కూలిపోవడానికి కారణం ఎన్సీపీ. అలాంటి ఎన్సీపీ మద్ధతును బీజేపీ అంగీకరిస్తే.. మా దారులు వేరవుతాయి’ అని చెప్పారు. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి అధికారం కోసం అర్రులు చాచబోమన్నారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేయకుండానే సేన ఎంపీ అనిల్ ముంబై తిరిగిరావడంపై స్పందిస్తూ.. ‘కేంద్రంలో ఒక పద్దతి, రాష్ట్రంలో మరో పద్దతి ఉండకూడదు. కేంద్రంలో మేం కావాలంటున్నారు. కానీ రాష్ట్రంలో పొత్తుపై స్పష్టతనివ్వడం లేదు. దీన్నే వారికి చెప్పాం’ అన్నారు. అనంత్ గీతే విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
హిందూ వ్యతిరేక శక్తులు తలెత్తాయి
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకున్న ఎంఐఎంను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. హిందువులకు ప్రమాదకరమైన కొన్ని శక్తులు మహారాష్ట్రలో తలలెత్తాయని ఠాక్రే అన్నారు. ఈ పరిస్థితుల్లో కాషాయ ఉగ్రవాదం గురించి మాట్లాడిన పవార్ మద్దతు తీసుకోవాలనిబీజేపీ కోరుకుంటోందన్నారు. దీనిపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పందించారు. సేన అంగీకారంతోనే అనిల్ పేరును కొత్త మంత్రుల జాబితాలో చేర్చామన్నారు. ‘పొత్తు విలువల ప్రాతిపదికన ఉండాలే కానీ మంత్రిత్వ శాఖల ప్రాతిపదికన కాదు’ అని వ్యాఖ్యానించారు.
నేటినుంచి ‘మహా’ అసెంబ్లీ
నేటినుంచి 3 రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. నవంబర్ 12న సీఎం ఫడ్నవిస్ విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. మెజారిటీకి 24 స్థానాల దూరంలో ఉన్న ప్రభుత్వానికి.. శివసేన మద్దతివ్వకపోయినా ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్యేం లేదు. బీజేపీ ప్రభుత్వానికి బయటనుంచి మద్ధతిస్తామని 41 మంది సభ్యులున్న ఎన్సీపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
బీజేపీలోకి సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ: శివసేన నేత, వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో కీలక శాఖలను సమర్థంగా నిర్వహించిన సురేశ్ ప్రభు ఆదివారం బీజేపీలో చేరారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న కాసేపటికే.. ఆయనను మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో త్వరలో జరగనున్న జీ 20 సదస్సులో పాల్గొంటున్న మోదీకి సహకరించే బాధ్యతలను ప్రభుకు అప్పగించారు. 1998-2004 మధ్య కేంద్ర భారీ పరిశ్రమలు, అటవీ, ఎరువులు, విద్యుత్ శాఖలను ఆయన నిర్వహించారు. 2013లో వార్టన్ ఇండియా ఎకనమిక్ ఫోరమ్‌లో మోదీ కీలక ప్రసంగాన్ని నిర్వాహకులు రద్దు చేసినందుకు నిరసనగా, తన వార్టన్ స్కూల్ పర్యటనను సురేశ్ ప్రభు రద్దు చేసుకోవడాన్ని అప్పట్లో బీజేపీ వర్గాలు ప్రశంసించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ కుమారుడు అజాతశత్రు సింగ్, నాటి జమ్మూ మహారాజు హరిసింగ్ మనవడు కూడా ఆదివారం బీజేపీలో చేరారు.