నా కారుకే అడ్డొస్తావా.. | Shooting champion Rahoul Rai fires at man for blocking his way | Sakshi
Sakshi News home page

నా కారుకే అడ్డొస్తావా..

Published Tue, Sep 19 2017 9:57 AM | Last Updated on Tue, Sep 19 2017 4:46 PM

నా కారుకే అడ్డొస్తావా..

నా కారుకే అడ్డొస్తావా..

ఢిల్లీ :
ఇష్టానుసారంగా హారన్‌ కొట్టడమే కాకుండా, ముందు కారులో వెళుతున్న వ్యక్తులను నా కారుకే అడ్డొస్తావా అంటూ నోటికొచ్చినట్టు తిట్టాడో జాతీయ స్థాయి షూటర్‌. అంతేకాకుండా ఇదేంటని ప్రశ్నించినందుకు, ఏకంగా బాధితుడిపై కాల్పులు కూడా జరిపాడు. దక్షిణ ఢిల్లీలో సాకేత్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.​ వివరాలు.. అమిత్‌ బాల్యన్(38)‌ దక్షిణ ఢిల్లీలోని కాన్‌పూర్‌ వాసి. ఫోరెక్స్‌ కంపెనీలో పని చేనిచేస్తున్నారు. తన స్నేహితుడు జితేందర్‌తో కలిసి సాకేత్‌లోని కోకా మర్కెట్‌లోని రోడ్డు పక్కన టిఫిన్‌ సెంటర్‌లో దోశ తినడానికి వెళ్లారు.

'అనంతరం మా స్విఫ్ట్‌ కారులో తిరిగి వెళుతుండగా, వెనకవైపు కారు నడుపుతున్న వ్యక్తి ఇష్టానుసారంగా హారన్‌ కొట్టాడు. మేము ఆ కారుకు దారి కూడా ఇచ్చాము. అయినా ఆ డ్రైవర్‌​ పక్కనున్న వ్యక్తి కారులోంచి దిగి, మా కారు అద్దాన్ని గట్టిగా కొట్టాడు. అంతే కాకుండా తిట్టడం ప్రారంభించాడు. తన దగ్గరున్న తుపాకీని చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయాడు. కొద్ది దూరంలో సిగ్నల్‌ దగ్గర వారి కారు ఆగడంతో వారి దగ్గరికి వెళ్లి మీ పద్దతి సరిగా లేదని చెప్పా. దీంతో రాయ్‌ గన్‌ తీసి కాలుస్తానని బెదిరించాడు' అని పోలీసులకు బాల్యన్‌ తెలిపారు. మాటామాటా పెరగడంతో రాయ్‌ బాల్యన్‌పై కాల్పులు ప్రారంభించాడు. అయితే బాల్యన్‌ తల భాగానికి గన్‌ ఎక్కు పెట్టినా, అతను తప్పించుకోవడంతో చేతిలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది.

బాల్యన్‌ను వెంటనే స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్న బాల్యన్‌ ప్రస్తుతం ఎయిమ్స్‌ ట్రామా కేర్‌ సెంటర్‌లో చికిత్స పోందుతున్నారు. కాగా, రాహుల్‌ రాయ్‌ని స్థానికులు పట్టుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. రాయ్‌ వాడిన తుపాకీని పోలీసులు సీజ్‌ చేశారు. 'నిందితుడు రాహుల్‌ రాయ్‌ ఓ ప్రొఫెషనల్‌ షూటర్‌ అని చెప్పాడు. అతని బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తున్నాం. అతనిపై ఇంతకు ముందు ఎలాంటి క్రిమినల్‌ కేసులు నమోదు కాలేదని తెలిసింది' అని అడిషనల్‌ డీసీపీ చిన్మయి బిస్వాల్‌ తెలిపారు.

రాయ్‌ టాప్‌ షూటర్‌. జాతీయ స్థాయిలో చాలా మెడల్స్‌ సాధించాడు. 2001 మోహాలీలో జరిగిన నేషనల్‌ గేమ్స్‌లో రెండు నేషనల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ సాధించాడు. 2000 నుంచి 2005 వరకు జాతీయ షూటర్‌గా పలు అంతర్జాతీయ చాంపియన్‌షిప్స్‌లలో పాల్గొన్నాడు. బ్యాంకాక్‌, బుసాన్‌లలో 1998, 2002లలో జరిగిన ఏషియన్స్‌ గేమ్స్‌లలో పాల్గొన్నాడు. 1997 ఢిల్లీ, 2002 సిడ్నీ, 1999 లొనాటో, 2000 లొనాటో ప్రపంచకప్‌లలో కూడా భారత్‌ తరఫును షూటింగ్‌ విభాగంలో పాల్గొన్నాడు. 1999 టాంపెర్‌లో జరిగిన చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement