
ప్రధానిని ఫాలోఅవుతున్న ముఖ్యమంత్రి
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టయిల్ను ఫాలో అవుతున్నారు. ప్రధాని నిర్వహించే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ తరహాలో ఆయన కూడా ఆకాశవాణి ద్వారా రైతులను కలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వ అధికారిక ప్రసారమాధ్యమం ఆకాశవాణిని ఎంచుకున్నారు. 20 నిమిషాలు పాటు ప్రత్యక్షంగా రేడియో ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గత రెండు నెలలుగా ధరల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతులను పలకరించారు. తన రేడియో సందేశం ద్వారా రైతు సోదరులలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. త పంట నష్టపోతున్న రైతుల కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే హెల్ప్లైన్ను వాడుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. పంటల రకాలు, పంట విధానాలు తదితర విషయాలపై వ్యవసాయ శాఖ అధికారుల సహాయం తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దీంతోపాటు ఈ కార్యక్రమం ద్వారా రైతులకు చెల్లించాల్సిన బాకీలను జూన్ చివరికల్లా చెల్లిస్తామని హామీ వచ్చారు.
కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పంపిణీ పథకం 'అన్నభాగ్య' కు రేడియో ద్వారా విస్తృతప్రచారాన్ని కల్పిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేడియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిత్వ వర్గాలు ధృవీకరించాయి. అవసరం ఏర్పడినపుడల్లా రేడియో కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను కలవనున్నారని వెల్లడించాయి.