
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గం తోడ్పాటుతో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ ఇంకా షాక్‌లోనే ఉంది. ఇది ఫేక్‌న్యూస్‌గా తాను భావించానని, ఏమైనా తమ పార్టీ, ఎన్సీపీ, శివసేనల మధ్య చర్చలు సుదీర్ఘంగా కొనసాగడమే దీనికి కారణమని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై తమ త్రైపాక్షిక (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) చర్చలు మూడు రోజులకు పైగా జరిగి ఉండాల్సింది కాదని..ఈలోగా ప్రత్యర్ధులు పావులు కదిపారని పవార్జీ మీరు చాలా గొప్పవారు అంటూ సింఘ్వీ ట్వీట్ చేశారు.
చర్చలను ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభించారని శరద్ పవార్‌పై సింఘ్వీ సెటైర్లు వేశారు. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా స్పందిస్తూ ఇది ప్రజా తీర్పును వంచించడమేనని, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. రాత్రికి రాత్రి వేగంగా చోటుచేసుకున్న పరిణామాలతో ఎన్సీపీ చీలిక వర్గం మద్దతుతో శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.