
సాక్షి,న్యూఢిల్లీ: చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తతున్నవేళ కేంద్ర మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఘటనలను అడ్డుకోలేమని, ప్రభుత్వాలు తమ వంతుగా పనిచేస్తున్నా ఇలాంటివి జరుగుతుండటం దురదృష్టకరమని అన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇంతపెద్ద దేశంలో ఒకటి రెండు జరిగితే!: భారత్ చాలా పెద్ద దేశమని, ఏదో ఒక మూలన ఒకటో, రెండో రేప్‌లు జరిగితే, వాటికి విపరీతమైన ప్రచారం కల్పించి, రాద్ధాంతం చేయాల్సిన అవసరంలేదని కేంద్ర మంత్రి గంగ్వార్ అన్నారు. ‘‘అత్యాచారాలు జరగడం దుదృష్టకరమే. అయితే కొన్ని సార్లు రేప్‌లను ఆపలేం. అవసరమైన మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇంత పెద్ద దేశంలో ఒకటో రెండో, రేప్‌లు జరిగితే, ఆ విషయాన్ని రచ్చ చేయాల్సిన అవసరంలేదు’’ అని గంగ్వార్ అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పెనుదుమారం రేగుతున్నది.