
సాక్షి, న్యూఢిల్లీ: సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ లింకేజ్‌ను అనివార్యం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఓ రాష్ట్రం కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎలా అప్పీల్‌ను నమోదు చేస్తుందని సర్వోన్నత న్యాయస్ధానం ప్రశ్నించింది. సమాఖ్య వ్యవస్థలో పార్లమెంట్ అధికారాన్ని సవాల్ చేస్తూ ఓ రాష్ట్రం ప్రభుత్వం న్యాయస్ధానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని నిలదీసింది. ప్రభుత్వ పథకాల సబ్సిడీలు కార్మిక శాఖ నుంచి లబ్ధిదారులకు చేరుతున్న క్రమంలో ఆ శాఖ పిటిషన్‌ను దాఖలు చేసిందని మమతా సర్కార్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకు నివేదించారు.
కేంద్రం నిర్ణయాన్ని వ్యక్తులు సవాల్ చేయవచ్చని, రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించలేవని దీనిపై తమకు స్పష్టత ఇవ్వాలని జస్టిస్ ఏకే సిక్రీ, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం బెంగాల్ సర్కార్‌ను వివరణ కోరింది. మమతా బెనర్జీ ఓ వ్యక్తిగా ముందుకు వచ్చి దీనిపై పిటిషన్ వేస్తే స్వాగతిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు వేయవచ్చని, అందుకు అనుగుణమైన మార్పులను పిటిషన్‌లో సవరిస్తామని కపిల్ సిబల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం ఆధార్‌తో మొబైల్ ఫోన్ నెంబర్ల అనుసంధానం వంటి నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
దీనిపై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని నోటీసుల్లో పేర్కొంది. తాను మొబైల్ ఫోన్ నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేయనని, అధికారులు దమ్ముంటే తన ఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేయవచ్చని దీదీ సవాల్ విసిరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రూలింగ్ తృణమూల్ చీఫ్‌కు ఇబ్బందికరమేనని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment