ముంబై: సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. షిండే 2003-2004 మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదర్శ్ వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొంది. ఈ మేరకు గురువారం బాంబే హైకోర్టుకు అఫిడవిట్ అందజేసింది. కార్గిల్ యుద్ధ అమరవీరుల కుటుంబాలకు కేటాయించిన ముంబైలోని 32 అంతస్తుల ఆదర్శ్ సొసైటీ భవంతిలో షిండేకు రెండు బినామీ ఫ్లాట్లు ఉన్నాయని, ఆయనను నిందితుడిగా చేర్చాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్ వతేగావ్‌కర్ గతంలో పిటిషన్ వేశారు. దివంగత మేజర్ ఎన్.డబ్ల్యూ ఖాంకోజీని సొసైటీ సభ్యుడిగా చేర్చుకోవాలని షిండే సిఫార్సు చేశారని తెలిపారు. షిండేకు, ఖాంకోజీ కుటుంబంతో సంబంధమున్నట్లు తమ దర్యాప్తులో తేలలేదని చెప్పింది. కేసు విచారణను కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది.