‘స్వచ్ఛ భారత్’కు నేడే శ్రీకారం
ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఐదేళ్లలో దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రాజ్‌పథ్ మార్గంలో రిపబ్లిక్ డే తరహా భద్రతా ఏర్పాట్లు
‘స్వచ్ఛతా ప్రతిజ్ఞ’ చేయనున్న 31 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే భద్రతా ఏర్పాట్లను పోలిన అసాధారణ భద్రత నడుమ ప్రధాని నరేంద్ర మోదీ తన మదిలో మెదిలిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని ఇండియా గేట్/రాజ్‌పథ్ మార్గం లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని వచ్చే ఐదేళ్లలో సాధించడమే లక్ష్యంగా చేపట్టనున్న ఈ కార్యక్రమంలో మోదీ స్వయంగా చీపురుపట్టనున్నారు. పరిశుభ్రతను జాతీయ ఉద్యమంగా చేపట్టాలని ప్రజలకు పిలుపునివ్వనున్నారు. ఈ సందర్భంగా నడక పోటీని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి భద్రతాపరంగా ఎటువంటి అవరోధాలు ఎదురుకారాదన్న ఉద్దేశంతో భద్రతా దళాలు ఉపరితలం నుంచి గగనతలం వరకూ పహారా కాయనున్నాయి. ఢిల్లీ నగరాన్ని బుధవారమే తమ అధీనంలోకి తీసుకున్నాయి. రాజ్‌పథ్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మధ్యాహ్నం 1 గంటకల్లా ఖాళీ చేయించి మూసేశాయి. కార్యక్రమం జరిగేంత సేపూ జాతీయ భద్రతా దళానికి చెందిన స్నైపర్లు (షార్ప్ షూటర్లు) ప్రభుత్వ భవనాలపై గస్తీ కాస్తారు. ఎన్‌ఎస్‌జీకితోడు పారామిలిటరీ, ఢిల్లీ పోలీసు కమాండోలు యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ తుపాకులు, మొబైల్ బృందాలతో అనుక్షణం కాపలా కాస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మంది స్కూలు విద్యార్థులతోపాటు ప్రభుత్వాధికారులు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, కాలేజీల విద్యార్థులు పాల్గొంటారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మోదీ రాజ్‌ఘాట్‌లోని గాంధీజీ సమాధి వద్ద నివాళులర్పించి ఆ తర్వాత దళిత కాలనీని సందర్శిస్తారు. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రులంతా చీపుర్లు పట్టారు.
31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రతిజ్ఞ
‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో భాగంగా దాదాపు 31 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పరిశుభ్ర భారతావని లక్ష్యం కోసం పాటుపడతామని ప్రమాణం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఉద్యోగుల చేత అధికారులు ‘స్వచ్ఛతా శపథ్’ (పరిశుభ్రత ప్రతిజ్ఞ) చేయించ నున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఉద్యోగుల చేత ‘నార్త్ బ్లాక్’ ఆవరణలో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులను కేంద్రం కోరింది. మరోవైపు ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమాన్ని జాతీయ ఆకాంక్షగా చేపట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
స్వచ్ఛ విద్యాలయ ప్రచార పుస్తకం విడుదల
స్కూలు ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు విద్యార్థులు పాటించాల్సిన పద్ధతులను వివరించే స్వచ్ఛ భారత్-స్వచ్ఛ విద్యాలయ ప్రచార పుస్తకాన్ని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. స్వచ్ఛమైన మంచినీరు, పరిశుభ్రమైన టాయ్‌లెట్ల కోసం ఆచరించాల్సిన విషయాలను ఇందులో పొందుపరిచారు. మరోవైపు స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ ఏడాది వ్యవధిలో 50 వేల టాయ్‌లెట్లను నిర్మించనున్నాయి.
ఇది ప్రజా ఉద్యమం: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చేపట్టనున్న స్వచ్ఛ్ భారత్ అభియాన్ కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఓ ప్రజా ఉద్యమంగా చేయడమే తమ ఉద్దేశమని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ మన ఇళ్లలో, పరిసరాల్లో, కార్యాలయాల్లో పరిశుభ్రత కోసం వారానికి2 గంటలు కేటాయిద్దామన్న ప్రతిజ్ఞను ప్రధాని మోదీ ప్రజలతో చేయిస్తారన్నారు.
పరిశుభ్రతతోనే అభివృద్ధి: అశోక్ గజపతి
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంద ని పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నా రు. దేశం, రాష్ట్రం, పురపాలక సంఘాలు, గ్రామాలను శుభ్రం చేసుకుంటుంటే దేశమంతా శుభ్రంగా ఉంటుందన్నారు.