పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చిన సమయంలో సవరణలు, ఓటింగ్‌కు పట్టుబట్టాలని తమ పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్టు బీజేపీ సీమాంధ్ర నేత హరిబాబు చెప్పారు. ఒక వేళ ఇప్పుడు సీమాంధ్రులకు న్యాయం జరగకుంటే తాము అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటూనే, విభజన వల్ల సీమాంధ్రకు కలిగే నష్టం విషయంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తమ నాయకులతో మాట్లాడామన్నారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి బిల్లులో మార్పులు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌కు ఉందన్నారు.
టీడీపీతో పొత్తుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారనే వార్తలు వస్తున్నాయని అడగ్గా.. ‘‘బీజేపీ ఒక జాతీయ పార్టీగా రాష్ట్ర శాఖ అభిప్రాయాన్ని తీసుకుంటుంది. అంతిమంగా జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర పార్టీ అమలు చేస్తుంది. విభేదాలకు తావులేదు’’ అని బదులిచ్చారు. సీమాంధ్ర ప్రజల పీకమీద కత్తి పెట్టి విభజన చేస్తున్నారని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా ‘ మేము అలా అనుకోవడంలేదు. సీఎం కిరణ్ అనుకుంటున్నారు’’ అని బదులిచ్చారు.