సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం తరచూ ఇంటర్నెట్‌ను నిలిపివేయడం వల్ల నెట్‌వర్క్ కంపెనీలు భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోతున్నాయి. గంటకు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు నష్టపోతున్నట్టు సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ శుక్రవారం వెల్లడించారు. సీవోఏఐలో ఎయర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియోలు సభ్యులుగా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోనలు మరింత పెరగకుండా ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని 18 జిల్లాల్లో 24 గంటల పాటు ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో టిక్‌టాక్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా వదంతులు వ్యాప్తిచెందడాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వ వర్గాల విశ్లేషణ.
ఓ అధ్యయనం ప్రకారం ఇండియాలో సగటు ఇంటర్నెట్ వినియోగం నెలకు 10 జీబీ. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అంతేకాకుండా వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్‌మీడియా యాప్‌లకు భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగిన డేటా వినియోగం ప్రకారం టెల్కోలకు జరుగుతున్న నష్టాన్ని లెక్కిస్తే ఇంచుమించుగా గంటకు రెండున్నర కోట్లుగా తేలిందని రాజన్ వివరించారు. మరోవైపు సీఏఏపై వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తరచూ నెట్ సేవలను నిలిపివేయడంపై నెట్ ప్రియులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ కూడా ప్రాథమిక హక్కేనన్న కేరళ హైకోర్టు తీర్పును వారు ఉటంకిస్తున్నారు.
చదవండి: ఇంటర్నెట్ షట్‌డౌన్ @ 100
Comments
Please login to add a commentAdd a comment