తెలుగు విద్యార్థుల నరకయాతన
ఇంకా తేరుకోని శ్రీనగర్
► జమ్మూకాశ్మీర్‌లో జలదిగ్బంధం..
► సురక్షితంగా 45 మంది విద్యార్థుల ఢిల్లీకి తరలింపు
►11 మంది హైదరాబాద్‌కు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో జలదిగ్బంధంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన వారిలో 47 మంది తెలుగువారిని గురువారం సురక్షితంగా ఢిల్లీలోని ఏపీభవన్‌కు తరలించారు. వీరిలో 45 మంది శ్రీనగర్‌లోని నిట్స్ విద్యార్థులతో పాటు అక్కడే ముత్యాల వ్యాపారం నిర్వహిస్తున్న నాయుడు దంపతులున్నారు. బాధితులకు ఏపీభవన్‌లో భోజన వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 6, 8, 9 గంటలకు మూడు విమానాల్లో బాధితులను ఏపీ, తెలంగాణకు పంపారు. తొలుత లడఖ్ నుంచి ఢిల్లీకి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న బాధిత విద్యార్థుల యోగక్షేమాలను ఏపీభవన్‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.రామ్మోహనరావు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగువారందరినీ సురక్షితంగా తరలిస్తామన్నారు.
సురక్షితంగా సొంత రాష్ట్రాలకు..
తొలి బ్యాచ్‌లో ఏపీభవన్‌కు చేరుకున్న విద్యార్ధుల్లో.. కె.నరేశ్ (శ్రీకాకుళం), ఎ.శ్యామ్‌కుమార్ (వైజాగ్), నానావతి కుమార్ (నల్లగొండ), బోదల రాజశేఖర్ (విజయనగరం), ఎన్.సృజన్‌కుమార్ (వరంగల్), బి.రాజ్‌కుమార్ (ఆదిలాబాద్), కె.శివకుమార్ (వరంగల్), రాహుల్ (కర్నులు), గూడ రాహుల్ (కరీంనగర్), జె.సాయిచరణ్ (నిర్మల్), బూర్గుల శ్యామ్ (వరంగల్), బీవీఆర్ రోహిత్ (వైజాగ్), మనోజ్‌కుమార్ రెడ్డి (కడప), వనం ప్రేమ్ ప్రసన్న (సికింద్రాబాద్), కొండపల్లి గిరీశ్ (భీమవరం), యు.అఖిల్ సాగర్ (ఆదిలాబాద్), వొట్టి శ్యామ్ సాయి (వైజాగ్), టి.సాయివెంకట నాగ (విజయవాడ), ఎన్.హరికృష్ణ (పశ్చిమగోదావరి), పి.తేజ (రాజమండ్రి), జైకిషన్ శర్మ (విశాఖపట్నం), యైఅన్వేష్ సాయి (విశాఖపట్నం), వంగర వంశీకృష్ణ (వరంగల్), కె.వెంకటసాయి ప్రకాశ్ (పశ్చిమ గోదావరి), చౌహాన్ మానిక్‌రావు (ఆదిలాబాద్), కోరుకొండ కేశవరావు (విశాఖపట్నం), కె.మూర్తి శ్రీచరణ్ (పశ్చిమ గోదావరి), జి.విపిన్‌కర్ (హైదరాబాదు), బి.దేవంత్ (విజయవాడ), ఎస్.ఆనంద్‌జీ( పశ్చిమ గోదావరి), బి.శ్రవణ్‌కుమార్ (ఖమ్మం), ఎన్.అమర్‌నాథ్ రెడ్డి (విశాఖపట్నం), బి.వంశీ (నల్లగొండ), ఎ.మంజేశ్ కుమార్ (ఆదిలాబాద్), బి.విష్ణు వర్మ (వరంగల్)తో పాటు నాయుడు దంపతులు ఉన్నారు. రెండో బ్యాచ్‌లో లేహ్ నుంచి అనిల్‌రెడ్డి, కె.లిఖిత్ రెడ్డి, పి.ప్రశాంత్‌కుమార్, ఎం.నాగార్జున, పి.దినేశ్, కాళీబాబు, ఎస్.మురళీ మనోహర్, అఖిల్ ఉన్నారు. వీరిలో 11 మంది గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఎవరూ పట్టించుకోలేదు..
జమ్ముకాశ్మీర్‌లో తెలుగు విద్యార్ధులు నరకయాతన అనుభవించారు. ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహాయం అందలేదని మండిపడ్డారు. ‘‘ శ్రీనగర్‌లోని నిట్స్‌లో 74 మంది తెలుగు విద్యార్ధులు ఉన్నారు. నిట్స్ హాస్టల్‌ల మొదటి అంతస్థులోకి ఆదివారం ఉదయం వరద నీరు చేరింది. మమ్మల్ని సోమవారం ఉదయం దగ్గర్లోని ఎత్తై ప్రదేశంలో ఉన్న కాశ్మీరు యూనివర్శిటీ క్యాంపస్‌కు తరలించారు. తినడానికి ఒక పూట బిస్కట్లు తప్ప మరేమీ దొరకలేదు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. బలవంతంగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. మా హాస్టల్ నుంచి శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు 18 కిలోమీటర్లు. బోటు ద్వారా ప్రయాణం చేయాలంటే.. ఒక్కొక్కరి నుంచి రూ.5,000 డిమాండ్ చేశాడు. దీంతో బోటును వదిలి.. అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మీదుగా లడఖ్‌కు క్యాబ్‌లో వెళ్లాం. లడఖ్ నుంచి ఢిల్లీకి విమానచార్జీలు అప్పటి వరకు ఐదారు వేలు ఉండగా.. రూ.20 నుంచి 22 వేలకు పెంచేశారు. సహచర విద్యార్ధి రోహిత్.. వాళ్ల నాన్న (లాయర్)కు ఫోను చేసి విషయాన్ని చెప్పాడు. ఆయన ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఢిల్లీకి విమానం ఏర్పాటు చేశారు. రోహిత్ లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేదో..’’అంటూ బాధిత విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వరద బాధితులకు ప్రధాని కార్యాలయ సిబ్బంది, అధికారులు తమ ఒక రోజు వేతనాన్ని గురువారం విరాళంగా ప్రకటించారు.
శ్రీనగర్: వరద బీభత్సం నుంచి జమ్మూకాశ్మీర్ ఇప్పట్లో తేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరద సహాయ కార్యక్రమాలు ప్రారంభమై 10 రోజులైనా.. గురువారం నాటికి శ్రీనగర్‌లోనే ఇంకా 4 లక్షలకు పైగా ప్రజలు జల దిగ్బంధంలోనే ఉన్నారు. అయితే, జీలం నది, దాని ఉపనదుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో సహాయ చర్యలకు మరింత అవకాశం లభిస్తోంది. మరోవైపు దాల్ సరస్సు నీటిమట్టం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూ, కాశ్మీర్‌లలోని వరద పీడిత ప్రాంతాల నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 లక్షల మందిని సహాయ దళాలు రక్షించగలిగాయి. త్రివిధదళాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్, అధికారులు కలసికట్టుగా సహాయచర్యలు కొనసాగిస్తున్నారు.
నా ప్రభుత్వాన్నీ ముంచేశాయి: ఒమర్
భీకర వరదల్లో తన ప్రభుత్వం కూడా మునిగిపోయిందని జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. వందేళ్లలో కనీవినీ ఎరగనటువంటి ఈ వరదలు తన రాజధానిని తీసుకెళ్లిపోయాయన్నారు. అసెంబ్లీ భవనం, హైకోర్టు, పోలీస్ ప్రధాన కార్యాలయం, ఆసుపత్రులు.. అన్నీ నీటమునిగాయని చెప్పారు. కాగా, గురువారం సైన్యం చేపట్టిన సహాయ కార్యక్రమాల్లో ఒమర్ సైతం పాలుపంచుకున్నారు.