నాన్న తోసేశాడు.. చెట్లు రక్షించాయ్! | Thane: 6-Year-Old Clings To Life For 11 Hours After Dad Throws Her In River | Sakshi
Sakshi News home page

నాన్న తోసేశాడు.. చెట్లు రక్షించాయ్!

Published Fri, Jul 1 2016 5:07 PM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM

నాన్న తోసేశాడు.. చెట్లు రక్షించాయ్! - Sakshi

నాన్న తోసేశాడు.. చెట్లు రక్షించాయ్!

థానేః ఆరేళ్ళ ఆ చిన్నారి పట్ల తండ్రే కాసాయి వాడిలా ప్రవర్తించాడు. పసిప్రాణం అని చూడకండా నిర్దాక్షిణ్యంగా నదిలో విసిరేశాడు. అయితే తండ్రి రాక్షసుడిలా ప్రవర్తించినా... నదీమతల్లి మాత్రం ఆమె గర్భంలో అల్లారుముద్దుగా పెరుగుతున్న పచ్చని చెట్లను ఆమె ప్రాణాలకు అడ్డువేసింది. దాంతో పదకొండు గంటలపాటు చెట్లను పట్టుకొని ప్రాణాలు కాపాడుకొన్న ఆమెను... అదృష్టవశాత్తూ అటుగా వచ్చిన ఓ సెక్యూరిటీ గార్డు  రక్షించాడు.  

థానే, బద్లాపూర్ లోని వాలివ్లీ బ్రిడ్జి ప్రాంతంలో జరిగిన ఘటన కన్నతండ్రి కర్కశత్వానికి నిదర్శనంగా నిలిచింది.  బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని చెట్లను పట్టుకొని ఏడుస్తున్నఆరేళ్ళ చిన్నారిని అక్కడి కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు చూసి రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. కొత్త బూట్లు కొనిస్తానని నమ్మించి, ఉత్సాహంగా తనతో వచ్చిన ఆరేళ్ళ కూతుర్ని ఆమె తండ్రితోపాటు, అతడి స్నేహితుడు బలవంతంగా అల్హాస్ నదిలోకి తోసేసిన ఘటన స్థానికులను విస్మయ పరచింది. స్థానిక మోహన్ గ్రూప్ కనస్ట్రక్షన్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 35 ఏళ్ళ రమేష్ భైర్ సదరు చిన్నారి నదిలో ప్రాణాలతో ఉన్నట్లుగా గమనించాడు. తాను నదివైపునుంచీ వెడుతుండగా ఎక్కడో పాప అరుపులు, ఏడుపు వినిపించాయని, కానీ నదిలోకి చూస్తే ఎవ్వరూ కనిపించలేదని చెప్పాడు.  తర్వాత కాసేపు నిశితంగా బ్రిడ్జిమీద నిలబడి చూస్తే బ్రిడ్జి కందిభాగంలోని చెట్లను పట్టుకొని ఓ పాప కనిపించడంతో నిర్ఘాంతపోయిన తాను వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించినట్లు తెలిపాడు. 15 నిమిషాల్లో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది పాపను రక్షించినట్లు రమేష్  వెల్లడించాడు.

పాపను నదినుంచీ బయటకు తీసిన అనంతరం ఆమె చెప్పిన వివరాలను బట్టి వర్తక్ నగర్ కు చెందిన ఏక్తా తులసిరామ్ సియానిగా పాపను గుర్తించామని రమేష్ భైర్ తెలిపాడు. నదిలో ఎలా పడిపోయావ్ అని అడిగితే.. తన తండ్రి, అతడి స్నేహితుడు కలసి తనను నదిలోకి విసిరేసినట్లు తెలిపిందని చెప్పాడు. తనకు షూ కొనిస్తానని చెప్పి... బయటకు తీసుకెళ్ళి నిదిలో విసిరేశారని పాప చెప్పిన వివరాలను బట్టి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తమకు ఫోన్ కాల్ రాగానే ఘటనా ప్రాంతానికి చేరుకొని, ఓ తాడుకు ఎయిర్ ట్యూబ్ ను కట్టి నదిలోకి దిగి, పాపను ట్యూబ్ పై కూర్చోపెట్టుకొని 20 నిమిషాల్లోపలే ప్రాణాలతో రక్షించినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉంటే పాప తల్లి వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ లో అంతకు ముందురోజే మిస్సింగ్ కేసు నమోదు చేసిందని, మైనర్ బాలిక కావడంతో కడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు సీనియర్ పోలీస్ ఇనస్పెక్టర్ కెజి గవిట్ తెలిపారు. అనంతరం బద్లాపూర్ నది ప్రాంతంలో పాప దొరికి నట్లుగా సమాచారం అందడంతో ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, తమ సిబ్బంది తండ్రి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement