రాష్ట్రాల హక్కులు హరించవద్దు
జీఎస్టీ సాధికారత కమిటీ సమావేశంలో ఈటల
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీని అమలు చేసే నేపథ్యంలో రాష్ట్రాల హక్కులు హరించరాదని కేంద్రానికి సూచించినట్టు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ సాధికారత కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మద్యం, పెట్రోల్, వ్యవసాయ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావద్దని కేంద్రాన్ని కోరినట్టు వివరించారు. రూ. 700 కోట్ల సీఎస్టీ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని సడలించాలని కేంద్రాన్ని కోరగా, వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని వెల్లడించారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొంది తప్పకుండా అమలవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని సడలించాలని కోరినట్లు తెలిపారు.
ఆర్థికమంత్రులతో కూడిన జీఎస్టీ కమిటీ చైర్మన్‌గా అమిత్ మిత్రా
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)పై ఏర్పాటైన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ నూతన చైర్మన్‌గా పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా శుక్రవారం ఎంపికయ్యారు. దీని చైర్మన్‌గా ఉన్న కేరళ ఆర్థిక మంత్రి కేఎం మణి అవినీతి ఆరోపణల నేపథ్యంలో గత నవంబర్‌లో పదవి నుంచి తప్పుకోవడం తెలిసిందే. మిత్రా ఆర్థికవేత్తగా సుపరిచితులు. ఫిక్కీ సెక్రటరీ జనరల్‌గా కూడా పనిచేశారు. 2011లో రాజకీయాల్లో చేరిన ఆయన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. శుక్రవారం జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన జీఎస్టీ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. దీనికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా హాజరయ్యారు. దేశంలో జీఎస్టీ వ్యవస్థ అమలుకోసం నిబంధనలను రూపొందించడం లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుంది.