ఆ ముగ్గురూ బాంబులు తయారుచేసేవారే!
బెంగళూరు: ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు బాంబులు తయారు చేసేవారని నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వారు తయారు చేసిన బాంబులను వివిధ ఉగ్రవాద సంస్థలకు సరఫరా చేసే వారని కూడా ఆయన తెలిపారు. వారికి హవాలా ధనం అందుతుందన్న అనుమానాలున్నాయన్నారు.
నగరంలోని పులకేశినగరతో పాటు భట్కళ్‌లో ఉగ్రవాద ఆరోపణలపై సయ్యద్ ఇస్మయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని కోర్టుకు హాజరుపరచగా ఈనెల 21వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది పోలీసుల విచారణలో వారు పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం .. హైదరాబాద్‌లో 2013 ఫిబ్రవరిలో జరిగిన బాంబుపేలుళ్లు, పూనెలోని జర్మన్‌బేకరి పేలుళ్ల వెనుక ఈ ముగ్గురి హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సోదాల్లో వీరి వద్ద దొరికిన వస్తువులు, పేలుళ్ల సమయంలో అక్కడ దొరికొని వస్తులవులతో పోల్చి చూసిన పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. బాంబుల తయారీ, రవాణాలో అఫక్ ఆదేశాలను అనుసరించి మిగిలిన ఇద్దరూ పనిచేసేవారని తెలుస్తోంది. అఫక్ బాంబుల తయారీకి సంబంధించి పాకిస్తాన్‌లో శిక్షణ పొందినట్లు తెలుస్తోంది.
ఈ ముగ్గురు కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ(కేఎఫ్‌డీ) సంస్థ తరఫున పనిచేస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరు ముగ్గురూ బాంబుల తయారీ, వాటిని రిమోట్ ద్వారా పేల్చడంలో నిష్ణాతులని తెలుస్తోంది. సయ్యద్ ఇస్మాయిల్ అఫక్ భార్య పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమెను కలవడానికే అఫక్ పాకిస్థాన్ వెళ్లేవాడని, అదే సందర్భంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం అతను బెంగళూరు చేరుకొని ఇంజనీర్లు, విద్యార్థులు, వైద్యులను తన సంస్థ(కేఎఫ్‌డీ)లో చేర్చుకునేందుకు పావులు కదిపాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.