నన్ను హత్యచేయాలనే వచ్చారు
మహారాష్ట్ర ఆలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడి విజయం సాధించిన భూమాత రణరాగిణి బ్రిగేడ్ నాయకురాలు తృప్తిదేశాయ్ తనపై కొందరు శివసేన, ఇతర సంస్థల కార్యకర్తలు దాడిచేయడంపై నిరసన వ్యక్తంచేశారు. కొల్హాపురీ మహాలక్ష్మి ఊరేగింపు సందర్భంగా తనపై దాడిచేసిన వారు తనను హత్యచేయాలనే పథకంతో వచ్చారని ఆరోపించారు. ఆమె గుడిలోంచి సజీవంగా బయటకు రావడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించారని మీడియాకు తెలిపారు. మహిళల్ని జుట్టుపట్టుకొని లాగి, దుస్తులను చించి అవమానించారని తృప్తి విమర్శించారు. చివరికి పూజారులు సైతం తమను దుర్భాషలాడారని వాపోయారు. తనకు పక్షవాతం సోకే అవకాశాలున్నాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిపారు.
బుధవారం నాటి ఆందోళనలో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తృప్తి దేశాయ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు మీడియాకు వివరించారు. ఆమె డీహైడ్రేట్ అయ్యారని, లో షుగర్, లో బీపీతో బాధపడుతున్నారని ఆమెకు చికిత్స అందిస్తున్న డా.అర్జున్ అద్నాయ్ తెలిపారు.
దేవాలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతున్న తృప్తిదేశాయ్, బుధవారం కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో వస్త్రధారణ నియమాలను ఉల్లంఘించి మరో సంచలనం సృష్టించారు. ఇతర కార్యకర్తలతో కలిసి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళలు సల్వార్ కమీజ్ ధరించి ఆలయంలోకి ప్రవేశించడంపై శివసేన, ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. తరాని చౌక్‌లో వారిని అడ్డుకోవడంతో దేవాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రస్ కోడ్‌ను పాటించాలని పోలీసులు, పురోహితులు కూడా పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. చీరకట్టులో మాత్రమే గర్భగుడిలోకి రావాలని పోలీసులు, ఆలయ అధికారులు పెట్టిన ఆంక్షలను ధిక్కరించి ఆమె సల్వార్ కమీజ్ లో దర్శనం చేసుకున్నారు. భక్తులు, పూజారులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆమె వారిని తోసేసి గుడిలోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. ఈ క్రమంలో డిప్యూటీ ఎస్పీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో తృప్తి సహా, పలువురు మహిళలను ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలోకి తీసుకున్నారు.