బడికొస్తే బహుమానాలు
భారత గ్రామీణ బాలికలు విద్యావంతులు కావాలన్నదే ఆయన ఆశయం.. అందుకే వారిని సరికొత్త పద్ధతిలో ప్రోత్సహిస్తున్నాడు. పాఠశాలకు రప్పించేందుకు అనేక ఆకర్షణీయమైన బహుమానాలను అందిస్తన్నాడు. ప్రతిరోజూ స్కూలుకు వచ్చిన వారికి పది రూపాయలతో పాటు... హాజరు విషయంలో ముందున్న వారికి ఇంట్లో టాయిలెట్ ఉండేట్లు ఏర్పాట్లు చేస్తున్నాడు. ముఖ్యంగా యువతులు స్వతంత్రంగా బతికేందుకు... వారి కాళ్ళపై వారు నిలబడేందుకు... ఆ ఎన్ ఆర్ ఐ ప్రోత్సహిస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు, యువతుల విద్యకు ఆయా కుటుంబాల్లోని పెద్దలు అంగీకరించకపోవడం, బాధ్యతను తీర్చుకునేందుకు మైనర్లకే పెళ్ళిళ్ళు కూడ చేసేయడాన్ని వీరేంద్ర శామ్ గమనించాడు. అటువంటి వారిని విద్యాకుసుమాలుగా తీర్చి దిద్దేందుకు తన వంతు కృష్టి ప్రారంభించాడు. అందులో భాగంగానే పధ్నాలుగేళ్ళకే పెళ్ళికి తలవంచిన నీతూ తోమర్, ఇంటినుంచీ అడుగు కూడ బయటపెట్టలేని స్థితిలో ఉన్న రీతా, కోరిక ఉన్నా చదువుకు అంగీకరించని తల్లిదండ్రులు కలిగిన రాధారాణి వంటి అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు వీరంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరే కాదు ఇటువంటి ఎందరో విద్యాధికులైన బాలికల జీవితాల వెనుక వీరేంద్ర శామ్ సింగ్ కృషి ఎంతగానో ఉంది. పర్దాడా పర్దాడి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఉత్తర ప్రదేశ్ లోని అనుప్షహర్, బులంద్షహర్ లోని వేలమంది బాలికల విద్యాభివృద్ధికి ఆయన చేయూతనిస్తున్నాడు.
2000 సంవత్సరంలో ఆమెరికాలోని డుపాంట్ లో పనిచేసే వీరేంద్ర.. స్వదేశంలో సమస్యలపై దృష్టి సారించాలకున్నాడు. అనుకున్నదే తడవుగా ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా విరమించి భారత్ కు తిరిగి వచ్చేశాడు. బాలికలకు ఆర్థికంగా, సామాజికంగా స్వతంత్రాన్ని కల్పించేందుకు పరిష్కారాన్ని ఆలోచించాడు. వారి పేరుతో బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసి చదువుకునేందుకు ప్రోత్సహించాడు. అయితే ఆ డబ్బు పై వారికి 18 సంవత్సరాలు దాటే వరకూ ఎటువంటి అనుమతి కల్పించలేదు. విద్య పూర్తయిన తర్వాత వివాహ సమయానికి ఆ డబ్బు వారి చేతికందేలా వీరేంద్ర ప్లాన్ చేశాడు. దీంతో బాలికలను విద్యకు ప్రోత్సహించడంతోపాటు, వారి కుటుంబాలకు ఆర్థికంగా సాయపడ్డాడు.
మరోవైపు బాలికలు ఆరోగ్యంగా లేకపోతే విద్యపై దృష్టి సారించలేరన్న ఉద్దేశ్యంతో ఆ దిశగా చర్యలు చేపట్టిన వీరేంద్ర... వారికి పాఠశాలలో పీపీఈఎస్ ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడ ప్రారంభించాడు. మొదట్లో ఎన్ని ప్రోత్సాహకాలు అందించినా బాలికలను పాఠశాలకు రప్పించలేని సంస్థ సభ్యులు... ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించి ప్రోత్సహించారు. అప్పట్లో అనుప్షహర్ లో 35 మంది బాలికలతో ప్రారంభమైన పాఠశాల నేడు చుట్టుపక్కలి అరవై రెండు గ్రామాలనుంచి వచ్చే 14 వందల మంది విద్యార్థులతో కొనసాగుతోంది. ముఖ్యంగా నెలకు మూడువేలకన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లోని బాలికలపై పీపీఈఎస్ దృష్టి సారిస్తోంది. పాఠశాల విద్య పూర్తయిన అమ్మాయిలకు వృత్తి శిక్షణా, నైపుణ్యం కలిగించే అనేక కోర్సులను కూడ అందిస్తోంది. దీనిలో ఇప్పటికే 150 మంది వరకూ విద్యార్థినులు శిక్షణ పొంది వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కూడ సంపాదించారు.
పీపీఈఎస్ సంస్థ బాలికల విద్యతో పాటు గ్రామీణ మహిళల్లో ఆరోగ్యంపట్ల అవగాహన కల్పించడం, వారికి తిరిగి చెల్లించేట్లుగా చిన్నతరహా రుణాలు అందించడంతో పాటు అనేక వస్తువులు సబ్సిడీలో కూడ ఇస్తున్నట్లు సంస్థ సభ్యులు రేణుక చెప్తున్నారు. ఈ పీపీఈఎస్ కు వివిధ సంస్థలు, వ్యక్తులు నిధులు సమకూరుస్తుంటారు. దీనికి హెచ్ సీ ఎల్ గ్రాంట్ కూడ వర్తిస్తుంది. దీంతో వచ్చే మూడేళ్ళలో 44 గ్రామాల్లో, 4 వేలమంది బాలికలకు మొబైల్ లెర్నింగ్ ట్రక్ ద్వారా ఇంటివద్దే నాణ్యమైన విద్యతో పాటు, స్కిల్ ట్రైనింగ్ అందించనుంది. పీపీఈఎస్ లో 2 వందలమంది పూర్తి సమయం ఉద్యోగులతో పాటు అనేక మంది వాలంటీర్లుగా కూడ పనిచేస్తున్నారు.