దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి.
కోలకతా: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి. సీబీఐ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంటే.. మరోవైపు ఇది మమత- బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అని సీపీఎం ఆరోపిస్తోంది. అటు ఇది బీజేపీ- సీపీఎం కలిసి పన్నిన పన్నాగమని తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరింత ఇరకాటంలో పడ్డారు.
టీఎంసీ మంత్రులు, ఎంపీల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ బుధవారం పిల్ దాఖలు చేసింది. సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ కోలకత్తా హైకోర్టులో పిటిషన్ వేసింది. తృణమూల్ పార్టీ అవినీతి నేతలను ఎన్నికల్లో పోటీ చేయనీయకూడదని ఆ పిటిషన్ లో కోరారు.
తమ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. ఇది బిజెపి, సిపిఐ (ఎం) కలిసి చేస్తున్న కుట్ర అని ఆరోపించింది. అటు ఈ అంశంపై పార్లమెంట్ లో దుమారం రేగింది. చానెల్స్ వీడియో టేపుల ప్రామాణికతపై టిఎంసి సభ్యుడు రాజ్యసభలో ప్రశ్నించారు.