
నేడు కేంద్ర కేబినెట్ తొలి విస్తరణ
మరో 20 మందికి చోటు
మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణ స్వీకారం
తెలంగాణ నుంచి దత్తాత్రేయ, ఏపీ నుంచి సుజనా చౌదరిలకు చోటు
శివసేన సభ్యులు చేరే అవకాశం లేనట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ తొలి విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. దాదాపు మరో 20 మందికి చోటు దక్కనుంది. వీరు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ నుంచి బీజేపీకి చెందిన సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిలకు చోటు ఖాయమైంది. గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ ఖరారైంది. అయితే, ఇప్పటికే సంక్షోభంలో ఉన్న బీజేపీ-శివసేన సంబంధాలు విస్తరణ నేపథ్యంలో శనివారం రాత్రి మరింత దిగజారాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో అపరిష్కృత సమస్యల కారణంగా కేంద్ర కేబినెట్‌లో శివసేన సభ్యుల చేరికకు చివరి నిమిషంలో ఆటంకాలు తలెత్తాయి. సేన నుంచి ఎవరూ కేబినెట్‌లో చేరే అవకాశం లేనట్లు సంకేతాలు వెలువడ్డాయి. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత జరుగుతున్న కేబినెట్ తొలి విస్తరణలో కొంతమంది మంత్రులకు కేబినెట్ హోదా కల్పించే అవకాశముంది. ఇద్దరు ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆరుగురికి పైగా మంత్రులు ఒకటికంటే ఎక్కువ శాఖలు నిర్వహిస్తున్నారు.
ప్రమాణానికి ముందు విందు..
దత్తాత్రేయ, సుజనా చౌదరి, బాబుల్ సుప్రియో (పశ్చిమ బెంగాల్) తదితరులను కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు మోదీ స్వయంగా వారికి ఫోన్లు చేశారని సమాచారం. మిగతా వారికి ప్రధానమంత్రి కార్యాలయం ఫోన్లు చేసింది. కొత్త మంత్రులకు, కేబినెట్ హోదా పొందనున్న వారికి ప్రమాణ స్వీకారానికి ముందు మోదీ తన అధికార నివాసంలో తేనీటి, అల్పాహార విందు ఇవ్వనున్నారు. విందులోనే మంత్రుల శాఖలను ఆయన వెల్లడి స్తారని సమాచారం. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో 45 మంది ఉన్నారు. వీరిలో ప్రధాని సహా 23 మంది మంత్రి కేబినెట్ మంత్రులు కాగా, 22 మంది సహాయ మంత్రులు. సహాయ మంత్రుల్లో 10 మంది స్వతంత్ర హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్తమంత్రులను కలుపుకుంటే మంత్రుల సంఖ్య దాదాపు 65కు చేరుతుంది.
రాష్ట్రాలకు విస్తృత ప్రాతినిధ్యం..
ప్రతిభావంతులకు స్థానం, రాష్ట్రాలకు విస్తృత ప్రాధాన్యం, ప్రస్తుత మంత్రులకు అదనపు శాఖల భారాన్ని తప్పించడం లక్ష్యంగా మోదీ కేబినెట్‌లో మార్పుచేర్పులు చేపట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల వారికి విస్తరణలో చోటు దక్కనుంది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అదనంగా నిర్వహిస్తున్న రక్షణ శాఖను చేపట్టనున్న పారికర్ గోవా నుంచి తొలి కేబినెట్ మంత్రి కానున్నారు. ఆయనను యూపీ నుంచి రాజ్యసభకు పంపే అవకాశముంది. బీజేపీ ముస్లిం ముఖంగా పేరున్న ముక్తార్ అబ్బాస్ నక్వీ 15 ఏళ్ల తర్వాత, రాజీవ్ ప్రతాప్ రూడీ పదేళ్ల తర్వాత తిరిగి కేబినెట్‌లోకి రానున్నారు. బొగ్గు కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చిన బీజేపీ ఎంపీ హంస్‌రాజ్ అహిర్(మహారాష్ట్ర)కు బొగ్గు శాఖ దక్కే అవకాశముంది.
గీతేతో భేటీకి మోదీ నిరాకరణ!
బీజేపీ-శివసేన మధ్య పొరపొచ్చాలు తీవ్రమయ్యాయి. శివసేన రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్, ఆ పార్టీ సీనియర్ నేత సురేశ్ ప్రభుకు చోటు దక్కే అవకాశముందని వార్తలు రావడం తెలిసిందే. అయితే కేంద్ర కేబినెట్ విస్తరణపై సేన ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్ గీతే శనివారం రాత్రి మోదీని కలసి మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆయనను కలవడానికి మోదీ నిరాకరిచారని సమాచారం. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంప్రదింపుల కోసం గీతేను ముంబైకి పిలిపించుకున్నారు. దీంతో శివసేన నుంచి ఎవరూ కొత్తగా మంత్రి పదవి చేపట్టే అవకాశం కాని, ప్రమాణ కార్యాక్రానికి హాజరయ్యే అవకాశం కానీ కనిపించడం లేదు. తాను మోదీని కలవలేకపోయానని గీతే విలేకర్లకు చెప్పారు. తమ పార్టీ నుంచి కొత్త ప్రాతినిధ్యంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఈ నెల 12 అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కొనేలోపు ఆ ప్రభుత్వలో తమను చేర్చుకోవాలని ఉద్ధవ్ డిమాండ్ చేయడం, దీనిపై ఇంకా చర్చలు సాగుతుండడం తెలిసిందే.