
టమాటో@100: కేంద్రం ఉక్కిరిబిక్కిరి
ప్రజల కడుపు మండిస్తూ కొండెక్కిన టమాటో, ఇతర నిత్యావసరాల ధరల వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది..
న్యూఢిల్లీ: ప్రజల కడుపు మండిస్తూ కొండెక్కిన టమాటో, ఇతర నిత్యావసరాల ధరల వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సెన్సెక్స్ బుల్ తో పోటీపడుతూ కిలో రూ. 100 రూపాయలకు చేరుకున్న టమాటో ధరను ఉన్నపళంగా నేలకు దించడానికి చేపట్టవలసిన చర్యలపై బుధవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి ఇతర ముఖ్య శాఖల మంత్రులు వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, రాంవిలాస్ పాశ్వాన్, రాధా మోహన్ సింగ్, నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ సహా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. (చదవండి: ఇంటింటా చిటపట)
ధరల స్థిరీకరణకు చేపట్టవలసిన చర్యలపై పారిశ్రామిక సమాఖ్య ఫిక్కీ ఇదివరకే సూచించిన అంశాలను మంతృల బృందం పరిశీలించనుంది. నిత్యావసరాల రవాణాను సులభతరం చేయడంద్వారా టొమాటో ధరలను అదుపు చయవచ్చని, రాష్ట్రాల వద్ద ఉన్న నిల్వల వివరాలను సేకరించి, సమీక్షించడం ద్వారా నిత్యావసరాల ధరలకు కళ్లెం వెయ్యవచ్చని ఫిక్కీ సూచించింది. ధరల స్థిరీకరణకు తాత్కాలిక, శాశ్వత విధానాలను మంత్రులు ప్రకటించే అవకాశం ఉంది. దేశంలో చక్కెర, మంచినూనె ఇతర వస్తువుల నిల్వలపైనా మంత్రులు చర్చిస్తారని తెలిసింది. దేశవ్యాప్తంగా కిలో టమాటో ధర సరాసరి రూ.80 పలుకుతుండగా, హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రూ.100గా ఉంది. పప్పుదినుసుల ధరలు సరాసరి రూ. 170 (కిలో)కి అమ్ముతుండగా కొన్ని ప్రాంతాల్లోని వ్యాపారులు రూ. 200 వసూలు చేస్తున్నారు.