
అయోథ్యలో మందిర నిర్మాణంపై పార్టీలన్నీ ఏకం కావాలని ఉమా భారతి పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ : రామ మందిరంపై బీజేపీకి పేటెంట్ లేదని కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఉమా భారతి అన్నారు. అయోథ్యలో ఆలయ నిర్మాణం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోథ్య సందర్శించి మందిర నిర్మాణం కోసం పట్టుబట్టడాన్ని ఆమె సమర్ధించారు. ఉద్ధవ్ థాకరే ప్రయత్నాలను తాను సమర్ధిస్తానని, రాముడు అందరివాడనీ, అయోథ్యలో మందిర నిర్మాణం కోసం ఎస్పీ, బీఎస్పీ, అకలీదళ్ సహా అసదుద్దీన్ ఓవైసీ, ఆజం ఖాన్‌తో పాటు ప్రతిఒక్కరూ బాసటగా నిలవాలని కోరారు.
కాగా,ఈ వారాంతంలో అయోథ్యను సందర్శించిన ఉద్దవ్ థాకరే రామాలయ నిర్మాణం తక్షణమే చేపట్టాలని ఆదివారం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలతో చెలగాటం వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌కు హితవు పలికారు. మరోవైపు మందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని సంఘ్ పరివార్ నేతలు మోదీ సర్కార్‌పై ఒత్తిడి పెంచుతున్నారు.