పార్లమెంటుకు ‘ప్రిలిమ్స్’ సెగ!
పరీక్ష విధానంపై పార్లమెంటులో ఆందోళన
సివిల్స్ అభ్యర్థులకు అన్యాయం జరగనివ్వబోమని ప్రభుత్వం హామీ
న్యూఢిల్లీ: కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై తలెత్తిన వివాదం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. హిందీతోపాటు ప్రాంతీయ భాషల అభ్యర్థులకు నష్టం చేకూర్చేలా ఉన్న సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీఎస్‌ఏటీ) పేపర్-2ను మార్చాలన్న విపక్షాల డిమాండ్‌తో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడగా లోక్‌సభలో ఈ అంశాన్ని తక్షణమే చర్చకు చేపట్టాలంటూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం అభ్యర్థులకు భాషాపరంగా అన్యాయం జరగబోనివ్వమని హామీ ఇచ్చింది. వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని వారంలోగా నివేదిక అందించాల్సిందిగా కోరినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ అభ్యర్థులు నిరసనల వంటి భౌతిక చర్యలకు దిగరాదని కోరారు.
ప్రాంతీయ అభ్యర్థులపై వివక్ష: శరద్ యాదవ్
ప్రభుత్వ ప్రకటనపై విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ మాట్లాడుతూ యూపీఎస్‌సీ పరీక్షలో ప్రాంతీయ భాషల అభ్యర్థులపై వివక్ష ఉంటోందన్నారు. ఈ పరీక్షలో పాసయ్యే తమిళం, తెలుగు, హిందీ, ఇతర భాషల అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోతుంటే అదే సమయంలో ఆంగ్ల మాధ్యమం అభ్యర్థుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ పరీక్ష ప్రశ్నపత్రాలను ప్రాంతీయ భాషల్లోనూ రూపొందించాలని కోరారు. యూపీఎస్‌సీ పరీక్ష నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఐ ఎంపీ డి. రాజా డిమాండ్ చేశారు. దేశంలో 500 భాషల్లో పరీక్షను నిర్వహించాలా? అంటూ ఇంగ్లిష్ భాషకు అనుకూలంగా కాంగ్రెస్ ఎంపీ గిల్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు మండిపడ్డారు.
లోక్‌సభలోనూ నిరసనలు...
లోక్‌సభలోనూ ఈ అంశంపై విపక్షాలు నిరసనలకు దిగాయి. సభ ప్రారంభం కాగానే ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఈ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ కోరగా అందుకు ఆమె నిరాకరించారు.
మాతృభాషలోనే రాసేందుకు అనుమతించాలి: కేశవరావు
సాక్షి, న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలను మాతృభాషలో రాసేందుకు అనుమతించాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘‘ఒక సమస్యను పార్లమెంటు చర్చించిందంటే ఆ సమస్య దేశ సమస్యగా కేంద్రం అర్థం చేసుకోవాలి. సమస్య లేకుండా చేయాలనే మేమంతా కోరుతున్నాం. మీ వద్ద ఉన్న నిగ్వేకర్ కమిటీ నివేదికను పక్కన పెట్టేశారు. ముందుగా హాల్‌టిక్కెట్ల పంపిణీని ఆపండి. ఇది ఆందోళన తీవ్రతను తగ్గిస్తుంది. 2012 నుంచి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ పరీక్ష(సీశాట్)లో రెండు సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించాల్సిన చోట ఆంగ్లాన్ని ప్రవేశపెట్టారు. ఆ పరీక్షను తమ భాషలో నిర్వహించాలని హిందీతోపాటు ఇతర మాతృ భాషల అభ్యర్థులు కోరుతున్నారు.’’ అని కేంద్రాన్ని అన్నారు.గ
ఏమిటీ వివాదం...
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీఎస్‌ఏటీ) పేపర్-2లో కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ వంటి విభాగాల్లో ప్రశ్నలను ఆంగ్లంలోనే అడగడం వల్ల హిందీ, ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే ప్రశ్నలు కఠినంగా ఉండటంతోపాటు సైన్స్ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగించేలానే ఉంటున్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.