భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు..
లక్నో: లేనిపోని అనుమానాలతో, అపోహలతో నిష్కారణంగా భార్యలను వేధించుకు తినే భర్తలని చూశాం. అన్యోన్యంగా కలకాలం ఆదిదంపతుల్లా జీవించిన జంటల్నీ చూశాం. కానీ, భార్య మనసు తెలుసుకుని ఆమెకు తగిన న్యాయం చేసే భర్తలు కూడా ఉన్నారని నిరూపించాడు
ఉత్తరప్రదేశ్ కు చెందిన పూల్చాంద్. వినడానికి సినిమా స్టోరీలా అనిపించినా ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో నిజంగానే జరిగిన సంఘటన ఇది.
మూడేళ్ల తరువాత భార్యను కలుసుకోవాలని ఎంతో ఆతృతగా సొంత ఊరుకు వచ్చిన పూల్ చంద్కు అతని భార్య చందా పెద్ద షాకిచ్చింది. దీంతో అతనికి ఆవేశం పొంగుకొచ్చింది. అయితే ఆవేశాన్ని అణచుకొని స్థిమితంగా ఆలోచించాడు... తమ మధ్య నెలకొన్న సంక్షోభానికి చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నాడు.... అంతేనా..... కుటుంబ సభ్యుల్ని, గ్రామ పెద్దల్ని ఒప్పించాడు. .. ఇంతకీ భార్య ఇచ్చిన షాక్ ఏంటి? ఏమిటా పరిష్కారం.... అందర్నీ ఎలా ఒప్పించాడంటే...
వివరాల్లోకి వెడితే ఫైజాబాద్కు చెందిన పూల్ చంద్ పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా భార్య చందాను కాపురానికి తీసుకు వచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా జలంధర్కు వెళ్ళిపోయాడు. ఫోన్లో మాత్రమే భార్యాభర్తలిద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. అయితే కొన్నాళ్ల తరువాత ఇంటికి వచ్చిన అతనికి భార్య చందా షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నానంటూ బాంబు పేల్చింది. కేవలం పెద్దల కోసమే పెళ్లి చేసుకున్నానని... ఇక తన వల్ల కాదని తేల్చిచెప్పింది. దీంతోపాటూ పెళ్లి సమయంలో తనకు పెట్టిన నగలు, బట్టలు అన్నీ అతనికి తిరిగి ఇచ్చేసింది. పూల్చంద్తో కలిసి కాపురం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీంతో పూల్ చంద్ హతాశుడయ్యాడు. అందరిలాగానే అతడు కూడా చాలా ఆవేశానికి లోనయ్యాడు.
అయితే... భార్య నిజాయితీగా వ్యవహరించిన తీరు తనని ఆకట్టుకుందని పూల్చంద్ తెలిపాడు. పెళ్లికి ముందే చందా, సూరజ్ ప్రేమించుకున్నారని, అందుకే ఎలాగైనా వారికి న్యాయం చేయాలని భావించానని చెప్పాడు. తమ పెళ్లి మూలంగా విడిపోయిన ప్రేమికుల్ని తిరిగి కలపాలనే ఉద్దేశంతోనే కష్టపడి తమ కుటుంబసభ్యులను, గ్రామ పెద్దలను ఒప్పించినట్లు పూల్చంద్ వెల్లడించాడు. దీంతో గ్రామపెద్దల సమక్షంలో చందాకు కోరుకున్న ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించడమే కాకుండా, కానుకలతో అత్తారింటికి సాగనంపాడు.