లక్నో: చిరు వ్యాపారులు, దుకాణదార్లు, ఫంక్షన్ హాల్ యజమానులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో తిరిగి కార్యకలాపాలు సాగించుకోవచ్చని తెలిపింది. అయితే సామాజిక ఎడబాటు, మాస్కు ధరించడం తదితర నిబంధనలు తప్పక పాటించాలని సూచించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు లాక్‌డౌన్ 4.0 నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేస్తూ.. పలు అంశాల్లో రాష్ట్రాలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసలుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు సోమవారం సాయంత్రం లాక్‌డౌన్ నిబంధనల సడలింపు విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.(నిబంధనల సడలింపు సాధ్యం కాదు: సీఎం)
లాక్‌డౌన్ 4.0: యూపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు
- కంటైన్మెంట్ జోన్లు మినహా... ఇతర ప్రాంతాల్లో వీధి వ్యాపారులు కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. రెస్టారెంట్లు, స్వీటు షాపులు హోం డెలివరీ చేసుకోవచ్చు.
- నిబంధనలకు అనుగుణంగా ఇండస్ట్రీలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు.
- రాష్ట్రవ్యాప్తంగా షాపులు తెరిచేందుకు అనుమతించినందున ఓనర్లు, కస్టమర్లు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. గ్లోవ్స్ ధరించి అమ్మకాలు జరపాలి. షాపుల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఈ నిబంధనలు పాటించనట్లయితే దుకాణదార్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- రోజు విడిచి రోజు ఒక్కో మార్కెట్ తెరవాలి. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల యంత్రాంగం వ్యాపార మండళ్లకు మార్గదర్శకాలు జారీ చేస్తుంది.
- మ్యారేజీ హాళ్లు తెరచుకోవచ్చు. అయితే 20 కంటే ఎక్కువ మందిని అనుమతించబోము.
- డ్రైక్లీనింగ్ షాపులు, ప్రింటింగ్ ప్రెస్‌లు తెరుచుకునేందుకు అనుమతి
- కూరగాయల మార్కెట్లు ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తెరచి ఉంచాలి. రిటైల్ వెజిటబుల్ మండీలు ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు తెరవాలి. వ్యాపారులు ఉదయం 8 నుంచి సాయంత్రం ఆరు వరకు కూరగాయలు అమ్ముకోవచ్చు.
- వాహనాలకు అనుమతి ఉంటుంది. అయితే కార్లు తదితర వాహనాల్లో డ్రైవర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి. టూ వీలర్లపై ఒక్కరికి మాత్రమే అనుమతి. మహిళలు అయితే ఇద్దరికి అనుమతి. అయితే తప్పక హెల్మెట్, మాస్కు ధరించాలి. త్రీ వీలర్‌లో డ్రైవర్ కాకుండా ఇద్దరికి మాత్రమే అనుమతి.
- ఢిల్లీ నుంచి వచ్చే వాళ్లను నోయిడా, ఘజియాబాద్‌లో ప్రవేశించేందుకు అనుమతినిస్తాం. అయితే పాసులు ఉన్న వారికే ఈ అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment