
గోవధ వదంతులతో యూపీలో హింస
లక్నో : యూపీలోని బులంద్‌షహర్‌లో అక్రమ కబేళాలు నడుస్తున్నాయనే వదంతులతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గోరక్షకుల పేరుతో గుమికూడిన ఆందోళనకారులు, పోలీసుల నడుమ జరిగిన ఘర్షణలో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరణించారు. చట్టవిరుద్ధంగా ఏర్పాటైన కబేళాల్లో గోవధ జరుగుతుందంటూ స్ధానికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. బులంద్‌షహర్-సైనా రహదారిపై ఆందోళనకు దిగిన పలు హిందూ సంస్థల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు.
హిందూ యువవాహని, బజరంగ్ దళ్ కార్యకర్తలు వాహనాలను దగ్ధం చేసి, పోలీస్ అధికారులపై దాడులకు తెగబడ్డారు. పోలీసుల వాహనాలకు నిప్పంటించారు. హింసాకాండలో సైనా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుబోధ్ సింగ్ మరణించగా, నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
బులంద్‌షహర్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోలీసు బలగాలు రప్పించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సీనియర్ పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా పోలీసు కాల్పుల్లో ఓ యువకుడు తీవ్ర గాయాలపాలై మరణించాడని వార్తలు రాగా, ఈ ఘటనను అధికారులు ధ్రువీకరించలేదు.