
‘చదువుకు వయసుతో పనేమిటి’ అనేది పాత డైలాగే కావచ్చు గానీ 92 సంవత్సరాల సలీమాఖాన్‌కు మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ ఇష్టమే బామ్మను 92 ఏళ్ల వయసులోనూ బడి బాట పట్టించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షహర్‌కు చెందిన సలీమాకు బడి సౌకర్యం లేకపోవడం, రకరకాల పరిస్థితుల వల్ల చదువుకునే అవకాశం దొరకలేదు.
ఆరు నెలల క్రితం బడిలో చేరిన సలీమా పిల్లలతో పాటు క్లాస్‌రూమ్‌లో కూర్చునేది. చదవడం, రాయడం నేర్చుకుంది. ‘నేను కూడా చదవగలుగుతున్నాను. రాయగలుగుతున్నాను అనే సంతోషాన్ని చెప్పడానికి మాటలు లేవు’ అంటుంది సలీమాఖాన్. ‘మొదట్లో ఆమెకు చదువు చెప్పడానికి టీచర్‌లు తటపటాయించారు. అయితే ఆమెను వద్దనడానికి మా దగ్గర ఏ కారణం కనిపించలేదు. ఆమె పట్టుదల చూసి టీచర్‌లకు ఉత్సాహం వచ్చింది. అక్షరాస్యురాలిని కావాలి అనే ఆమె పట్టుదల టీచర్‌లకు నచ్చింది’ అంటుంది స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రతిభ శర్మ.