స్వచ్ఛ విద్యాలయ.. అచ్ఛా మెదక్!
♦ జాతీయ స్థాయిలో జిల్లా ఎంపిక
♦ టాప్ టెన్‌లో నిలవడమే తరువాయి..
♦ ఎంపికైతే ప్రధాని చేతుల మీదుగా పురస్కారం
♦ టార్గెట్ కోసం కలెక్టర్ కార్యాచరణ ప్రణాళిక
పాపన్నపేట: ‘స్వచ్ఛ విద్యాలయ’ రేసులో మెదక్ జిల్లా మెరిసింది. దేశంలో ఎంపికైన 74 జిల్లాల్లో మెదక్ ఒకటిగా నిలిచింది. తిరిగి వీటి నుంచి దేశవ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేస్తారు. ఈ టాప్‌టెన్ జిల్లాలకు ప్రధాని చేతుల మీదుగా పురస్కారం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ‘టాప్ టెన్’లో మెదక్ నిలిచేలా జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు 18 రోజుల్లో సర్కార్ బడులను స్వచ్ఛ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. సర్కార్ బడులు సమస్యలకు నిలయాలుగా ఉన్నాయని, కనీసం బాల బాలికలు టాయిలెట్‌కు వెళ్లేందుకు వీలుగా లేవని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ మేరకు స్పందించిన కోర్టు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలను పరిశీలించి నివేదిక పంపాలని ఆదేశిస్తూ, ఒక బృందాన్ని సైతం ఏర్పాటు చేసింది.
స్వచ్ఛ విద్యాలయ నేపథ్యమిదీ..
దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో గతేడాది డిసెంబర్ 3వ వారంలో బృందం ప్రత్యేక పరిశీలన జరిపింది. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న స్థితిగతులతో నివేదికకు రూపొం దించి కోర్టుకు సమర్పించింది. దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు దేశంలోని 74 జిల్లాల్లో స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం అత్యుత్తమంగా ఉందని గుర్తించింది. అందులో జిల్లా కూడా ఒకటి కావడం విశేషం.
టాప్-10లో చేరితే పండగే..
దేశవ్యాప్తంగా ఎంపికైన 74 జిల్లాల నుంచి మరింత అత్యుత్తమ జిల్లాలను పది ఎంపిక చేయనున్నారు. చోటు దక్కిన జిల్లాలకు ఏప్రిల్‌లో ప్రధాని చేతుల మీదుగా పురస్కారం అందజేయనున్నారు. ప్రభుత్వ బడుల్లోని స్వచ్ఛ పరిస్థితులను, తాగునీరు, పచ్చదనం, టాయిలెట్ల నిర్వహణ, వాష్ ప్రోగ్రాంలను పరిశీలించేందుకు మార్చి మొదటి వారంలో కేంద్ర బృందం రానున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించి పరిస్థితులను అంచనా వేయనున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి 8 ప్రశ్నలను అడిగే అవ కాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కలెక్టర్ యాక్షన్‌ప్లాన్
జాతీయ స్థాయిలో ఈ పురస్కారం మెదక్ జిల్లాకు దక్కాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. మండల స్థాయిలో స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల విద్యాధికారితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. వారిని ఈ దిశగా చైతన్యపరిచేందుకు ఈనెల 24 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలల్లో స్వచ్ఛ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 15 వరకు రోజూ కనీసం ఐదు స్కూళ్లు పర్యవేక్షించి, అక్కడి స్వచ్ఛ పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచిం చారు. వివరాలను రోజూ టెలిగ్రాం యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ యత్నాలన్నీ సాకారమైతే మెతుకుసీమలోని ప్రభుత్వ బడులు పచ్చని వనాలను తలపించనున్నాయి.