అరుణాచల్ మాజీ సీఎం పుల్ ఆత్మహత్య? | Violence in Itanagar After Kalikho's Death; CM's House Attacked | Sakshi
Sakshi News home page

అరుణాచల్ మాజీ సీఎం పుల్ ఆత్మహత్య?

Published Wed, Aug 10 2016 4:02 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

అరుణాచల్ మాజీ సీఎం పుల్ ఆత్మహత్య?

అరుణాచల్ మాజీ సీఎం పుల్ ఆత్మహత్య?

* తీవ్ర మనోవేదన వల్లే..
* రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత
* సీఎం, మంత్రుల నివాసాలపై దాడులు
* మెజిస్టీరియల్ విచారణ చేయిస్తాం: రాష్ట్ర ప్రభుత్వం
* రాష్ట్రపతి, ప్రధాని  సంతాపం

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. మంగళవారం ఉదయం ఇటానగర్‌లోని తన అధికారిక నివాసంలో ఉరి వేసుకుని కనిపించారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్  రాష్ర్ట రాజకీయాల్లో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో.. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా కలిఖో సీఎం పదవి నుంచి వైదొలిగారు.

నాలుగు నెలలకే పదవిని కోల్పోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పలువురు ఆందోళనకారులు సీఎం పెమా ఖండు, మంత్రుల నివాసాలపై దాడి చేశారు. ఉద్రిక్త పరిస్థితులపై చర్చించడానికి కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. వీవీఐపీ జోన్‌లో భద్రత పెంచారు. పుల్ మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్విహంచనున్నట్లు తెలిపింది. కాగా పుల్ మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. పుల్ మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటుగా వారు అభివర్ణించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు మరపురానివని పేర్కొన్నారు. 41 ఏళ్ల కలిఖో పుల్ ఇటానగర్‌లోని సీఎం అధికారిక నివాసంలో తన బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతుండగా ఉదయం ఆయన ముగ్గురి భార్యల్లో ఒకరు గుర్తించారు. పుల్ స్వగృహానికి మర మ్మతులు చేయిస్తున్నందున ఆయన ఇంకా అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు.

ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. కాగా గత వారం రోజులుగా పుల్ బయటి వారెవరినీ కలవలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో రాజకీయ పర ఒత్తిడి  వల్లే ఆయన బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని హోం శాఖ అధికారులు తెలిపారు.
 
పుల్ మద్దతుదారుల ఆందోళన .. పుల్ అకాల మరణంపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. పుల్ మద్దతుదారులు పలువురు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. కొత్త ముఖ్యమంత్రి పెమా ఖండు నివాసంపై దాడులకు దిగారు. పుల్ అసహజ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ నివాసానికి వెళ్లి ప్రహరీతోపాటు అక్కడ నిలిపి ఉంచిన10 వాహనాలను ధ్వంసం చే శారు. కొన్నింటికి నిప్పుపెట్టారు. సమీపంలోని మంత్రుల ఇళ్లపైనా దాడి చేశారు. దీంతో ప్రభుత్వం పుల్ మృతిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రం 500మంది పారామిలిటరీ జవాన్లను  పంపింది.
 
తిరుగుబాటు చేసి.. మళ్లీ కలసి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పుల్ కిందటేడాది చివర్లో అప్పటి ముఖ్యమంత్రి నబం టుకీపై పలువురు ఎమ్మెల్యేలతో కలసి తిరుగుబాటు చేశారు. దీంతో నబమ్ టుకీ ప్రభుత్వం రద్దయింది. 2015 డిసెంబర్ 9న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో  20 మంది కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో అరుణాచల్ సీఎంగా పుల్ ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రాష్ట్రంలో తిరిగి టుకీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో పుల్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే బలపరీక్షకు ముందే టుకీ రాజీనామా చేశారు. తర్వాతి నాటకీయ పరిణామాలతో తిరుగుబాటు నేతలు తిరిగి కాంగ్రెస్ చెంతకు రావడం.. పెమా ఖండు సీఎం కావడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement