
గుజరాత్ అధికారులతో చర్చిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణం ముమ్మాటికీ సాధ్యమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పునరుద్ఘాటించారు. దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలో వాటర్ గ్రిడ్‌ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. గుజరాత్‌లో విజయవంతమైన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు అక్కడి పంచాయతీరాజ్ వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు రాష్ట్ర అధికారుల బృందంతో కలసి శనివారం ఆయున గుజరాత్ రాష్ట్రానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా.. తొలి రోజు శనివారం మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు గాంధీనగర్‌లో పర్యటించారు. ఆ రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి, వాటర్ బోర్డు చైర్మన్ రాజీవ్ కే గుప్తాతో సమావేశమై ప్రాజెక్టు డిజైన్, నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంపై వివరంగా చర్చించారు. వాటర్ గ్రిడ్ ఆలోచన మొదలుకుని ఆచరణ దాకా ఆ రాష్ట్ర అధికారులు రూపొందించిన ప్రణాళికను పరిశీలించారు. నర్మదా డ్యామ్ నుంచి వివిధ ప్రాంతాలకు మంచినీటిని తరలించిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీకి ముందు గాంధీనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో నీటిని సరఫరా చేసే ‘పానీ సమితి’ సభ్యులతో సవూవేశవుయ్యూరు. ప్రాజెక్టు ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యత, పరిమాణం, సౌకర్యాలపై జనం స్పందనను తెలుసుకున్నారు. గాంధీనగర్‌జిల్లా మానస తాలుకాలోని అమర్‌పూర్ గ్రామంలో ఈ-పంచాయతీ వ్యవస్థను మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారు. గతంలో ఉన్న విధానంతో పోల్చితే ప్రస్తుత ఈ-పంచాయతీ వ్యవస్థ వచ్చిన తర్వాత చోటు చేసుకున్న మార్పులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి వాకబు చేశారు. దేశంలోనే అత్యుత్తమ, అత్యాధునిక సాఫ్ట్‌వేర్, సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలో ‘ఈ-పంచాయతీ’లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ తోపాటు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఉమాకాంత్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మంత్రి కేటీఆర్ ఆదివారం మరోసారి గుజరాత్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పరిశీలన కోసం మరో రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.