ఆ బాబా సీక్రెట్ ఏంటి?
బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ డేరా సచ్చా సౌదా అనే సిక్కు మత సంస్ధ చీఫ్. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో లక్షలాది మంది నిమ్నజాతీయులు ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తారు. నడిచే దేవుడిగా భావిస్తారు. 2002లో ఆయనపై హత్య, అత్యాచార కేసు నమోదైంది. అయినా, బాబాను పూజించే వారి సంఖ్య తగ్గలేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.
ఎవరీ డేరాలు..
సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలు గుర్మీత్ ప్రారంభించిన డేరా సచ్చా సౌధాలో చేరారు. ఈ గ్రూపులో చేరిన వారందరినీ డేరాలు అంటారు. ఈ గ్రూపులో చేరిన అత్యధికులు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే. సమాజం తమపై చూపుతున్న వివక్షను భరించలేక డేరాల్లో చేరుతుంటారు. డేరాల సంస్కృతి ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. మధ్యయుగ కాలం నుంచి ఉత్తర భారతదేశంలో డేరాలు ఉన్నాయి.
డేరా సచ్చాసౌధాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు నెలకొల్పాడు. ఆయన బోధనలకు లక్షలాది మంది ఆకర్షితులయ్యారు. ఈ సంప్రదాయంలో కులాల వంటి అడ్డుగోడలుండవు. దీంతో ఎంతో మంది నిమ్నజాతీయులు డేరా సచ్చాసౌధా చేరడానికి ఆసక్తిని కనబరుస్తారు. ప్రార్థనల కోసం నామ్ చర్చాఘర్‌లను నిర్మించుకున్నారు. డేరాల్లో శ్రీమంతుడినైనా, బీదవాడినైనా ఒకే రకంగా పరిగణిస్తారు. పంజాబ్, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది దళితులు గుర్మీత్ బోధనల పట్ల ఆకర్షితులై అందులో చేరారు.
డేరా సచ్చాసౌదాను యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌కు భంగీదాస్ అనే వ్యక్తి బాధ్యత వహిస్తారు. సభ్యుల ఇబ్బందులను తెలుసుకుని కేంద్ర కార్యాలయమైన సిర్సాకు తెలియచేయడం వీరి ప్రధాన విధి. అనారోగ్యంగా ఉన్న వారి గురించి తెలియజేయడంతో పాటు వారిని చికిత్స కోసం కూడా సిర్సాకు తరలిస్తారు. ఇక్కడ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఆసుపత్రి ఉంది. ఇందులో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తారు.
పేదల పాలిట పెన్నిధి..
డేరాల్లో సభ్యులకు సబ్సిడితో కూడిన ఆహారధాన్యాలను సరఫరా చేస్తారు. ప్రభుత్వం రేషన్ ద్వారా అందించే వాటి కన్నా ఇవి ఎంతో నాణ్యంగా ఉంటాయి. ఎలాంటి అవినీతి కనిపించదు. ఇది డేరాల్లోని పేదలకు ఎంతగానో లాభిస్తుంది. పంజాబ్‌లోని సంగ్రూర్, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్ కోట్, ఫిరోజ్‌పూర్ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేయడం విశేషం. ఇన్ని ప్రజాపయోగమైన కార్యక్రమాలు చేపడుతుండటంతో డేరా సచ్చాసౌధాలో లక్షలాది మంది సభ్యులుగా చేరారు.