
కార్మిక, ఉపాధికి 45% ఎక్కువ
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్‌లో కార్మిక, ఉపాధి శాఖకు కేటాయింపులు భారీగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 45 శాతం అధికంగా నిధులు దక్కాయి. ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈసారి రూ. 2,496 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే ఉపాధి కల్పనా(ఎంప్లాయింట్ ఎక్స్ఛేంజ్) కేంద్రాలను కెరీర్ సెంటర్లుగా ఆధునీకరించడానికి మరో రూ. 50 కోట్లను కేటాయించారు. తమ పేర్ల నమోదుకు వచ్చే నిరుద్యోగులకు ఈ కేంద్రాల్లో తగిన కౌన్సెలింగ్, శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.యువతకు ఉపాధి కల్పన, కార్మికులకు నైపుణ్య శిక్షణ, అసంఘటిత రంగంలోకి కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, పని సంస్కృతిని మెరుగుపరచడంతో పాటు మహిళా కార్మికులకు రక్షణ వంటి అంశాలకు పెద్దపీట వేయనున్నట్లు జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు