‘డెయిటీ’గా హాలీవుడ్‌కు ‘కహానీ’
న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో విజయవంతమైన ‘కహానీ’ సినిమాను ‘డెయిటీ’ పేరుతో ఇంగ్లిష్‌లో రీమేక్ చేయనున్నట్లు సుప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్‌రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. కహానీ సినిమాలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించగా, సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. కాగా, దీన్ని ఇంగ్లిష్‌లో నీల్స్ ఆర్డెన్ ఓప్లెవ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు వైఆర్‌ఎఫ్ సన్నాహాలు చేస్తోంది.
నీల్స్ ఇంతకుముందు‘ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కాగా, ‘డైటీ’సినిమాలో ఒక అమెరికన్ యువతి తన భర్త కోసం ఇండియా వచ్చి కోల్‌కతాలో అన్వేషిస్తుంది. ఆమె నిజం తెలుసుకునేసరికి, తాను అపాయంలో చిక్కుకున్నట్లు అర్థమవుతుంది. ఆ పరిస్థితులనుంచి ఆమె ఎలా బయటపడింది.. అసలు ఆమె భర్త దొరికాడా.. లేదా అనే కథాంశంతో ఉత్కంఠభరితంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వైఆర్‌ఎఫ్ వర్గాలు తెలిపాయి. 2015 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. సినిమా మొత్తం కోల్‌కతాలోనే షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఒప్లేవ్ మాట్లాడుతూ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపారు. ఇందులోని ప్రతిపాత్రకు ప్రాధాన్యముంటుందన్నారు. దీనిలో భిన్న ధృవాలవంటి అమెరికన్ -ఇండియన్ సంస్కృతుల మధ్య వ్యత్యాసాన్ని, దాని వల్ల హీరోయిన్ ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు తనదైన శైలిలో చూపించనున్నట్లు ఒప్లేవ్ వివరించారు. ఈ సినిమాలో కోల్‌కతా నగరాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో ఉదయ్ చోప్రా మాట్లాడుతూ..‘కహానీ’ చిత్రాన్ని ‘డెయిటీ’గా రీమేక్ చేయడానికి నీల్స్ మాత్రమే సమర్థుడని పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రపంచ వ్యాప్తంగా కోల్‌కతా నగరానికి ఈ సినిమాతో ఒక కొత్త గుర్తింపు తీసుకువచ్చేలా ఇప్పటివరకు ఎవరూ స్పృశించని ప్రాంతాల్లో నీల్స్ షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాడని చోప్రా తెలిపారు. తన సినిమా రీమేక్‌పై ఘోష్ మాట్లాడుతూ..‘కొంత కాలం కిందట ‘కహానీ’ని ఇంగ్లిష్‌లో రీమేక్ చేస్తానని ఉదయ్ చెబితే సరదాగా అంటున్నాడనుకున్నా కాని వాళ్లు ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నారని తెలిసి చాలా ఆనందించా.. నీల్స్ మంచి డెరైక్టర్. ప్రపంచ ప్రేక్షకులకు నచ్చేవిధంగా ‘కహానీ’ని మలిచే సామర్థ్యం అతడికి ఉంద..’ని కితాబు ఇచ్చాడు.