
మరో కొత్త పార్టీ?
న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు శరవేగంగా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తమ మద్దతుదారులతో కలిసి అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 4న సమావేశమవుతున్నట్టు సమాచారం. ఆప్ మాజీ నేత, లోకపాల్ అడ్మిరల్ రామదాస్ సహా, ఇతర సన్నిహిత వర్గాలు కొన్ని ప్రజా సంఘాలు సమావేశంలో పాల్గొననున్నాయి. అలాగే ప్రశాంత్, యోగేంద్ర యాదవ్ ను పార్టీనుంచి తొలగించినందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసిన నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్ ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
అనూహ్య మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీలో రగిలిన విభేదాలు తారా స్తాయికి చేరాయి. ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ , పార్టీలో కీలక నేతలుగా ఉన్న యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి ఇరువురి నేతలను జాతీయ మండలి పదవులనుంచి తొలగించడంతో చీలిక అనివార్యమైంది.