
ప్రధాని మోదీ, నటుడు అమితాబ్ బచ్చన్ (పాత చిత్రం)
ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడే వ్యక్తుల లిస్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ చోటు సంపాదించుకున్నారు. యూకేకు చెందిన ‘యూగవ్’ సంస్థ 2018 ఏడాదికి గానూ విడుదల చేసిన జాబితాలో వీళ్లకు చోటు దక్కింది. సర్వేలో భాగంగా మొత్తం 35 దేశాలకు చెందిన 37,500 మంది నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా... వివిధ దేశాలకు మళ్లీ విడివిడిగా జాబితాలను రూపొందించారు.
పురుషుల విభాగంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రథమ స్థానం దక్కించుకోగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, నటుడు జాకీ చాన్, చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్‌లు తర్వాతి స్థానంలో నిలిచారు. భారత్ తరపున మోదీ, అమితాబ్‌లు వరుసగా 8వ, 9వ స్థానాల్లో నిలిచారు. మహిళ విభాగంలో హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ ప్రథమ స్థానం దక్కింది. ఈ విభాగంలో భారత్ నుంచి టాప్ టెన్‌లో ఎవరికి చోటు లభించలేదు. బాలీవుడ్ బ్యూటీస్ ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె వరుసగా 11,12, 13 స్థానాల్లో నిలిచారు. ఒబామా భార్య మిషెల్లీ మహిళల విభాగంలో రెండో స్థానంలో నిలవటం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 17వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
భారత లిస్ట్‌లో సింధుకు చోటు..
యూగవ్ భారత్‌లో ఎక్కువగా ఆరాధించబడే వ్యక్తుల జాబితాలో పురుషుల జాబితాలో మోదీ, మహిళల విభాగంలో పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ప్రథమ స్థానంలో నిలిచారు. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు 3వ స్థానం దక్కించుకున్నారు. విదేశీయులు బరాక్ ఒబామా, బిల్‌గేట్స్, దలైలామా.. మలాలా యూసఫ్‌జాయ్, ఏంజెలినా జోలీ, మిషెల్లీ ఒబామా టాప్ టెన్‌లో నిలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment