సీమాంధ్రను నట్టేట ముంచారు: వైఎస్ జగన్ | ys jagan mohan reddy fires on telangana bill | Sakshi
Sakshi News home page

సీమాంధ్రను నట్టేట ముంచారు: వైఎస్ జగన్

Published Sat, Feb 22 2014 1:37 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

ys jagan mohan reddy fires on telangana bill

* ఓట్లు, సీట్లే ముఖ్యమనుకున్నారు  
* అడ్డగోలు విభజనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన
* ప్రధాని చెప్పిన ప్యాకేజీలో స్పష్టత ఏదీ? సీమాంధ్ర ప్రజలు ఎలా బతకాలి?
* లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి చీకట్లో బిల్లును ఆమోదించారు
* రాజ్యసభలో డివిజన్‌కు పట్టుపట్టినా వినిపించుకోకుండా ఆమోదించారు
* మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది
* సీమాంధ్రకు ప్యాకేజీ అన్న ప్రకటనలో ఏ ఒక్కదానిపైనా స్పష్టత లేదు
* హైదరాబాద్‌ను తీసేసుకున్నారు.. వేరే చోటుకు వెళ్లిపొమ్మని చెప్పారు
* మరి కొత్త రాజధానికి ఎంత డబ్బిస్తున్నారు? ఎన్ని రోజుల్లో ఇస్తారు?
* సీమాంధ్రలో ప్రతి ఏటా రూ. 15 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటుంది
* తొలి ఏడాది మాత్రమే ఇస్తారట.. ఆ తర్వాత ప్రతి ఏడాదీ భర్తీ ఎలా?
* ప్రతి ఏటా జీతాల కోసం మేము ఎక్కడికెళ్లాలి? ఎవరిని అడగాలి?
* సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీతో ఎవరికి ప్రయోజనం?
* నదీ జలాల కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు నిధులపై స్పష్టత ఏది?
* పోలవరం ప్రాజెక్టుకు ఇన్ని నిధులు ఇస్తున్నామన్న మాటే లేదు
* దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టు కనీసం ప్రస్తావన లేదు
* ఢిల్లీలో మీడియాతో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్
 
సాక్షి, న్యూఢిల్లీ:
మరో పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసీ.. కేవలం ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా, దారుణంగా విభజించటం ద్వారా.. సీమాంధ్ర ప్రాంత ప్రజలను నట్టేట ముంచి తెలంగాణ ప్రాంతంలో పొత్తుల కోసం కాంగ్రెస్ పాకులాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ తీసేసుకుని.. కొత్త చోటుకు వెళ్లిపొమ్మంటున్నారని.. కానీ కొత్త రాజధానికి ఎన్ని నిధులు ఇస్తారు? ఆ నిధులు ఎప్పుడు ఇస్తారు? అన్న ఊసే ఎత్తటం లేదని తప్పుపట్టారు. హైదరాబాద్ తీసేసుకుంటే.. సీమాంధ్రకు ఏటా రూ. 15 వేల కోట్ల లోటు ఏర్పడుతుందని.. కేంద్రం తొలి ఏడాది మాత్రమే భర్తీ చేస్తానని చెప్తే.. ఆ తర్వాత ప్రతి ఏడాదీ ఆ లోటు ఎలా తీరుతుందని సూటిగా ప్రశ్నించారు.
 
 జనం ఎలా బతకాలని.. జీతాలు ఎలా చెల్లించాలని జగన్ నిలదీశారు. శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జగన్‌మోహన్‌రెడ్డి.. పార్లమెంటు ఉభయసభల్లో విభజన బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.. సీమాంధ్రకు న్యాయం చేసే ఏ ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని ఎండగట్టారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులు, ప్రాజెక్టు నిర్మాణం, కొత్త రాజధానికి నిధులు, కృష్ణా జలాల పంపిణీ తదితర అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసి.. సీమాంధ్ర ప్రజలను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. సీమాంధ్రను అన్నివిధాలా ఆదుకుంటామంటూ రాజ్యసభలో ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన ప్రకటనలోని అంశాలేవీ బిల్లులో పొందుపరుచకపోవటాన్ని ఆయన ప్రశ్నించారు. అధికారపక్షం, ప్రతిపక్షం కలసిపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని ఈ విభజనతో రుజువు చేశారని ఆయన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల వైఖరిని తూర్పారబట్టారు. అసెంబ్లీ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును.. అన్యాయంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించిన తీరును చూస్తే.. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు.
 
  ‘‘తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేసిన సోనియాగాంధీ, కా్రంగెస్ పార్టీ రానున్న ఎన్నికలే కాదు.. మరో వందేళ్లు రాష్ట్రంలో కాలు పెట్టనివ్వకుండా వారి పార్టీ కాళ్లను నరికేయాలి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మరోమారు రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తామని, న్యాయస్థానాల్లోనూ పోరాడతామని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ విభజన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు, మీడియా, సోషల్ మీడియా తమతో కలసిరావాలని చేతులు జోడించి వేడుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి వివరించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
 
 ఇకపై నియంత అంటే సోనియా గుర్తుకు వస్తారు..
 ‘‘దేశ చరిత్రలో లేని విధంగా రాష్ట్రవిభజన చేశారు.. ఈ విషయంతో నియంత అంటే ఇకపై సోనియా గుర్తుకొస్తారు. గురువారం రాజ్యసభలో అంతకుముందు లోక్‌సభలో విభజన బిల్లును ఆమోదించిన తీరును చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. అసలు మనం భారతదేశంలో ఉన్నామా? అనిపిస్తుంది.
 
 పదే పది సెకన్లలో లోక్‌సభలో ప్రవేశపెట్టారు...
 రాష్ట్ర అసెంబ్లీ నిర్మొహమాటంగా విభజనకు వ్యతిరేకమని చెప్తూ బిల్లును తిప్పిపంపింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టరాదని అసెంబ్లీ చెప్పినా అప్రజాస్వామికంగా బిల్లును పార్లమెంటుకు తీసుకొచ్చారు. మామూలుగా స్పీకర్ బిల్లు ప్రవేశపెట్టటానికి అంగీకరించాలని ఒకమారు, వ్యతిరేకించాలని మరోమారు సభ్యులను అడుగుతారు. దేనికి ఎక్కువ మంది చేతులు ఎత్తి చెప్తే.. దానిప్రకారం బిల్లు ప్రవేశపెట్టటానికి అంగీకారం దొరికిందని, లేకపోతే లేదని చెప్తారు. కానీ అవేమీ చెప్పకుండా లోక్‌సభలో స్పీకర్ పదే పది సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది దారుణమన్నా, వాకౌట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు.
 
 ప్రసారాలు నిలిపివేసి అంధకారంలో విభజించారు...
 మొత్తం సీమాంధ్రకు చెందిన 15మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి తప్పించారు. ఇది చాలా దారుణం. సీమాంధ్ర ప్రాంత ఎంపీలే లేకుండా 23 నిమిషాల్లో చర్చ పూర్తిచేసి బిల్లును ఆమోదించారు. దీన్నిచూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని అనిపిస్తోంది. లోక్‌సభలో జరిగిన సన్నివేశాలు బయటకు రాకుండా కేబుల్ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపేసి అంధకారంలో రాష్ట్రాన్ని విభజించారు. ఇది ఏ మేరకు న్యాయం?
 
 సభ్యులు అడ్డుపడితే చర్చిస్తారు కానీ.. డివిజన్ పెట్టరా..?
 ఇక రాజ్యసభలో సభ్యులు అడ్డుపడినా బిల్లుపై చర్చ జరిపిన ప్రభుత్వం.. అదే సభ్యులు అడ్డుపడుతున్నారని చెప్తూ బిల్లుపై డివిజన్, ఓటింగ్ జరుపలేదు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు, చర్చ జరిగిన తీరు చాలా బాధ కలిగించింది. కేవలం ఆరుగురు సభ్యులు వెల్‌లోకి వచ్చి అడ్డుపడుతుంటే.. ఆ నెపం చూపించి డివిజన్, ఓటింగ్ పెట్టకుండా నెట్టుకొచ్చారు. అదే ఆరుగురు సభ్యులు అడ్డుపడుతున్నపుడు చర్చను మాత్రం కొనసాగించారు. కానీ డివిజన్, ఓటింగ్‌కు వచ్చేసరికి ఆ ఆరుగురూ అడ్డుపడుతున్నారని డివిజన్ జరుగకుండా చేశారు. దీన్ని నిరసిస్తూ సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి ఇది అన్యాయమని వాకౌట్ చేసినా పట్టించుకోలేదు.
 
 ఏ ఒక్క అంశంపైనా ప్రధాని స్పష్టత ఇవ్వలేదు...
 రాజ్యసభలో పేజీన్నర లేఖను చదివిన ప్రధానమంత్రి అనేక అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. ఆయన ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఒకటిన్నర పేజీ మాత్రమే చదివి ప్రసంగం ముగించారు. ఇది చూస్తే అసలు వీరు మనుషులేనా? అని బాధ కలుగుతోంది. రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. హైదరాబాద్ తీసేసుకుంటున్నారు. వేరే చోటికి వెళ్లిపొమ్మంటున్నారు. కొత్త రాజధాన్ని చూసుకోమంటున్నారు. కానీ కొత్త రాజధానికి ఎంత డబ్బిస్తున్నారు? అక్కడి జనం ఎలా బతుకగలుగుతారు? ఎన్ని రోజుల్లో డబ్బులు ఇస్తారు? అనే ప్రస్తావన ఏదీ లేదు. ఇది న్యాయమేనా?
 
 ప్రతి ఏటా పెరిగే లోటును ఎలా భర్తీ చేస్తారు?
 హైదరాబాద్ తీసేస్తే సీమాంధ్రలో ప్రతి ఏటా రూ. 15 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటుంది. ఇంతలోటు ఉంటే జీతభత్యాలు సైతం ఇవ్వని పరిస్థితి ఉంటుంది. ఈ విషయం తెలిసీ ప్రతి ఏటా ఇంత లోటును ఎలా భర్తీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. కేవలం తొలి ఏడాది మాత్రం లోటును భర్తీ చేస్తామని ప్రధాని లేఖలో చెప్పారు. ఒక్క ఏడాది మాత్రమే రెవెన్యూ లోటును భర్తీ చేస్తే.. ఆ తర్వాత ప్రతి ఏటా లోటును ఎలా భర్తీ చేస్తారు? ప్రతి ఏటా 14 శాతం లోటు పెరుగుతూ పోతుంది. ఒక ఏడాది రెవెన్యూ లోటును ప్రస్తావిస్తే మిగతా లోటును ఎలా భర్తీ చేస్తారో చెప్పే నాథుడే లేడు. జీతాల కోసం మేము ఎక్కడికెళ్లాలి? ఎక్కడ తిరగాలి?
 
 ఐదేళ్ల ప్రత్యేక ప్యాకేజీతో ఎవరికి మేలు?
 సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటి? పరిశ్రమలు పెట్టాలంటే కనీసం మూడు నుంచి ఐదేళ్లు పడుతుంది. అలాంటిది ప్రత్యేక ప్యాకేజీ ఐదేళ్లకు పరిమితం చేస్తే ఆ తర్వాత పరిస్థితి ఏమిటి? ఈ ప్యాకేజీతో ఎవరికి మేలు చేస్తారు? దీనిపై అడిగేవారు లేరు.. అడిగినా పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం 15 ఏళ్లు అయినా ఈ ప్యాకేజీ  ఇవ్వకుంటే ఎవరికీ ప్రయోజనం ఉండదు. అసలు సభలో ప్రస్తావించిన ప్యాకేజీ అంశాలు బిల్లులో ఎక్కడ ఉన్నాయి?
 
 నీటి కోసం రైతులు కొట్టుకుని చావండంటారా?
 నదీ జలాల కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు నిధులకు సంబంధించి కేంద్రం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఇష్టారీతిగా విభజన చేసేసి మీ చావు మీరు చావండన్న ధోరణిలో వ్యవహరించింది. నీళ్లకు సంబంధించి కృష్ణా ఆయకట్టుపై తెలంగాణలోని రెండున్నర జిల్లాల రైతులు, సీమాంధ్రలోని ఎనిమిదిన్నర జిల్లాల రైతులు ఆధారపడి ఉన్నారు. నదిపై ఎగువన ఉన్న మహారాష్ట్ర అవసరాలు తీరాక, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండితే తప్ప నీరు కిందకు రాని పరిస్థితి ఉంది. వీటిపై ట్రిబ్యునళ్లు, వాటర్ బోర్డులు ఉండగానే నీటి కోసం కొట్టుకునే పరిస్థితి ఉంటే.. మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు నీరెక్కడినుంచి ఇస్తారు? నో ట్యాంపర్ జోన్ పెట్టాలన్న ఇంగితజ్ఞానం లేదు. ఇక పోలవరానికి సంబంధించి ప్రాజెక్టుకు ఇన్ని నిధులు ఇస్తున్నామన్న మాటే లేదు. ఈ విషయంలో స్పష్టత శూన్యం. కృష్ణా ఆయకట్టు స్థిరీకరణకు దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. దీనిపై కనీసం ప్రస్తావన లేదు.
 
 నాయకుడంటే ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేవాడా?
 చంద్రబాబు సాక్షాత్తూ పార్లమెంటులో బిల్లు అన్యాయంగా ఉంది అంటారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు బిల్లు అన్యాయంగా ఉంది, వ్యతిరేకిస్తాం అంటారు. అదే పార్టీకి చెందిన నామా నాగేశ్వరరావు, రమేశ్‌రాథోడ్‌లు లోక్‌సభలో బిల్లు చాలా బాగుందని చెప్పి ఓటువేస్తారు. మొదటి ఓటు తామే వేశామని చెప్పుకుంటారు. రాజ్యసభలోనూ అంతే. ఒకవైపు బిల్లు బాగోలేదని చెప్పిస్తారు. మరోవైపు తెలంగాణ ప్రాంత ఎంపీలు దేవెందర్‌గౌడ్, గుండు సుధారాణిలు బిల్లుకు అనుకూలంగా ఓటేస్తారు. రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు పెంచడం నాయకత్వమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement