సాక్షి, నిర్మల్: 2018.. కొత్తసంవత్సరం.. సరికొత్త లక్ష్యాలు. అందరికీ ఉన్నట్లే పాలకులు, అధికారులకూ ఉంటాయి. జిల్లాను అన్ని రంగాల్లోనూ సమప్రాధాన్యతతో అభివృ ద్ధి చేయాల్సిన గురుతర బాధ్యత వాళ్లపైనే ఉంది. గతేడాది కొన్నిరంగాల్లో దూ సుకెళ్తే.. మరికొన్నింట్లో కనీసం అడుగు ముందుకు పడని పరిస్థితి. ఈనేపథ్యంలో గత లోపాలను అధిగమించి పురోభివృద్ధి వైపు పరుగులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త సంవత్సరంలో కొత్త బడ్జెట్ కూడా రానుంది. అందులో జిల్లా కు ఎక్కువ నిధులు, పథకాలు రాబట్టుకో వాల్సిన అవసరమూ ఉంది. కొత్త సంవత్సరంపై పెట్టుకున్న కోటి ఆశలు నెరవేరాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
అభివృద్ధికి అనుకూల అంశాలు..
రాష్ట్రంలోని చాలా జిల్లాలకంటే అభివృద్ధికి కావాల్సిన అనుకూల అంశాలు నిర్మల్‌కే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్–నాగ్‌పూర్ ప్రధాన మార్గమైన ఎన్‌హెచ్ 44, మరోవైపు మహారాష్ట్రలోని పలు ప్రధాన నగరాల నుంచి మంచిర్యాలవైపు వెళ్తున్న ఎన్‌హెచ్ 61 రోడ్లకు కూడలిగా ఉంది. రోడ్డు, రవాణాపరంగా ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్‌లో ఇప్పటికీ చెప్పుకోదగ్గ పరిశ్రమ లేకపోవడం లోటుగా మారిందన్న భావన ఉంది. అలాగే ఉన్నతవిద్యకు సంబంధించి మరిన్ని కోర్సులు, వివిధ కళాశాలలూ రావాల్సిన అవసరముంది. వైద్యం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జిల్లా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతిని సాధిస్తోంది. పలుశాఖల్లో పేరుకుపోయిన అవినీతిని పారదోలాల్సిన అవశ్యకత చాలా ఉంది. ఇక శాంతిభద్రతల విషయంలోనూ పోలీస్‌శాఖ మంచి పేరే సంపాదించుకుంది. కానీ.. ఇటీవల ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌ను ఆ దిలాబాద్ ఎస్పీగా బదిలీ చేశారు. జిల్లాకు పూ ర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు.
భారం.. బాధ్యత..
బాసర నుంచి మొదలుకుంటే కడెం దాకా 19మండలాలతో జిల్లా ఏర్పడింది. కొత్తజిల్లాగా ఏర్పడి పద్నాలుగు నెలలు మాత్రమే అయింది. ఈకాలంలో చెప్పుకోదగ్గ అభివృద్ధినే సాధించింది. కానీ.. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు ఇంకా చేరుకోలేదు. జిల్లా నుంచి రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉండడం నిర్మల్‌కు వరంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పలు అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే వచ్చాయి. అయితే కొన్నింట్లో ఇంకా వెనుకబడే ఉండడం లోపాలుగా మారుతున్నాయి. కొత్త ఏడాదిలో వాటినీ అధిగమించాలని జిల్లావాసులు కోరుతున్నారు. కొత్తగా కలెక్టర్‌గా వచ్చిన ఎం.ప్రశాంతిపైనా జిల్లావాసులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. మంత్రి, కలెక్టర్ సమన్వయంతో జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన భారం, బాధ్యత వారిపైనే ఉంది. 2018లో జిల్లా గణనీయమైన అభివృద్ధిని సాధించాలని జిల్లాప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
అభివృద్ధే ధ్యేయంగా..
జిల్లాగా ఏర్పాటు చేయడం మొదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషిచేస్తున్నాం. జిల్లాగా ఏర్పడిన స్వల్పకాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులను మొదలు పెట్టాం. విద్య,వైద్యం, వ్యవసాయం, అనుబంధ రంగాలు, రోడ్లు, గోదాంలు.. ఇలా అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధిస్తున్నాం. ఇప్పటికే ఎల్లపల్లిలో డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తిచేశాం. త్వరలోనే జిల్లాలో మిగతా చోట్లా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయి. అలాగే త్వరలో జిల్లాకు రానున్న సీఎం చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులను ప్రారంభింపజేస్తాం. కొత్త ఏడాదిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లాను మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతాం.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి
మష్టిగా ప్రగతి వైపు..
కొత్తగా ఏర్పడిన జిల్లాకు కొత్త కలెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. అన్నిశాఖల సమన్వయంతో అభివృద్ధి పథంలో జిల్లాను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం. కొత్త సంవత్సరంలో జిల్లాను ప్రగతి బాట పట్టించేందుకు శాయశక్తులా కృషిచేస్తాం. అన్నిరంగాలపై దృష్టి సారిస్తాం. ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుంటూ సత్వరమే పరిష్కరించేందుకు కృషిచేస్తాం. గతంలోని లోపాలను సరిదిద్దుకుంటూ అభివృద్ధి పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటవెంటనే ప్రారంభించేలా చూస్తాం. రాష్ట్రంలో జిల్లాను మంచి స్థానంలో నిలిచే లక్ష్యంతో ఈ ఏడాది కృషిచేయాలనుకుంటున్నాం. ఇందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అందరి సహకారం అవసరం.
– ఎం.ప్రశాంతి, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment