బోధన్: దీక్షను విరమింపజేయిస్తున్న కోదండరాం
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : సమస్యలు, డిమాండ్ల సాధనకై ఎర్రజొన్న, పసుపురైతులు ఏకమై ప్రభుత్వంతో పోరాడాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ , ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా నుండి ప్రారంభమయ్యే ఈ పోరాటం రాష్ట్ర స్థాయికి చేరి ఇతర రైతులకు ఆదర్శంగా నిలువాలని ఇందుకు టీజేఏసీ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తు రైతు జేఏసీ తలపెట్టిన మహాధర్నాకి హజరైన కోదండరాం మాట్లాడారు. గింజలు కొని వ్యాపారం చేసే వారు బాగుపడుతున్నారని, గింజలు ఉత్పత్తిచేసే రైతులు మాత్రం బాగుపడకుండా బట్టిలోనే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం స్పందించే వరకు రైతులు ఐక్యంగా ఉండి హైదరాబాద్ స్థాయిలో పోరాటానికి రావాలని ఇందుకు టీజేఏసీ తోడుంటుందని హామి ఇచ్చారు.
చీఫ్ సెక్రటరీని కలిసి ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలపై విన్నవించడానికి సహకారం అందిస్తామన్నారు. త్వరలోనే ఆర్మూర్, బాల్కొండ నియోజక వర్గాలో పర్యటించి రైతుల పరిస్థితులను తెలుసుకుంటామని తెలిపారు. అనంతరం రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రైతుల సమస్యలపై పట్టింపులేదని జిల్లా ఎంపీ పార్లమెంట్‌లో మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ కమిటీ చైర్మన్ దేవరాం, కన్వీనర్ రఘుపతిరెడ్డి, చంద్రమోహన్, రామకృష్ణ, గంగాధర్, భాస్కర్, లింబారెడ్డి, రాజేశ్వర్, సాయరెడ్డి, రమేష్, నరేష్, రైతులు పాల్గొన్నారు.
చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోవాలి
బోధన్ టౌన్(బోధన్): తెలంగాణ ప్రాంతానికి తలమానికంగా నిలిచి, ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన నిజాం చెక్కర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ హాయాంలో ఇచ్చిన సభాసంఘం నివేదికను అమలు చేయాలని, టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని నడిపించాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ డిమాండ్ చేశారు. ఎన్‌డీఎస్‌ఎల్ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షా శిభిరాన్ని సందర్శించిన కోదండరామ్ దీక్ష పరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ లేఆఫ్ ప్రకటించడం పద్దతి కాదని, కార్మికులకు 25 నెలలుగా వేతనాలు చెల్లించకుండా యాజామాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఫ్యాక్టరీ నడవక, వేతనాలు లేని ఆందోళనలో నలుగురు కార్మికులు అనారోగ్యంతో మృతి చెందారని, వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రక్షణ కమిటీ చేపట్టిన ఈ దీక్షలకు తమ మద్దత్తు ఉంటుదని, జిల్లా జేఏసీ సభ్యులు రక్షణ కమిటీకి అండగా నిలిచి ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా జేఏసీ కన్వీనర్ భాస్కర్, పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య, రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవయ్య, నాయకులు బి.మల్లేష్, నాయకులు షేక్ బాబు, సుల్తాన్ సాయిలు, కార్మికులు, రైతులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment