
వాషింగ్టన్ డీసీ : ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ(ఓఎఫ్) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు వాషింగ్టన్ డీసీలో ఉజ్వల్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్, పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జి.వి. ఎల్ నరసింహ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను, వాటి ఫలితాలను జి.వి. ఎల్ నరసింహ రావు వివరించారు. అదేవిధంగా ప్రవాస భారతీయులు అందరు కలిసి మెలిసి ఉంటూ, దేశ అభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించాలని కోరారు. భారత దేశ ఏకీకరణ, సగటు భారతీయునికి సమాజంలో గౌరవం, దేశ భద్రతా, సమతుల్య ఆర్థిక అభివృద్ధి, మోదీ ప్రభుత్వ అభివృద్ధి విధానానికి మూలా స్తంభాలుగా రామ్ మాధవ్ పేర్కొన్నారు.
శక్తివంతమైన నాయకులు తీసుకొన్న నిర్ణయాలు దేశ భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేకూరుస్తాయని ఓఎఫ్ బీజేపీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి ఏనుగుల అన్నారు. అలాంటి శక్తివంతమైన నాయకుల్లో మోదీ ఒకరు అని కొనియాడారు. ఈ సంబరాల్లో ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు కృష్ణ రెడ్డి ఏనుగుల, ఓఎఫ్ బీజేపీ ఉపాధ్యక్షులు అడపా ప్రసాద్, ఓఎఫ్ బీజెపీ వాషింగ్టన్ డీసీ కోఆర్డినేటర్ లక్ష్మి నారాయణ, ఓఎఫ్ బీజేపీ ఒహియో కోఆర్డినేటర్ శ్రీనివాస్ కొంపల్లి, ఓఎఫ్ బీజేపీ మీడియా కో-కన్వీనర్ సమీర్ చంద్ర, ఓఎఫ్ బీజేపీ జాతీయ యువ సహా-కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల, దిగంబర్ ఇస్లాంపురే, ఇతర ఓఎఫ్ బీజేపీ నేతలు, వంశీ యంజాలతో పాటూ అనేక సంఘాలనేతలు, అనేక మంది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రం విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర వహించిన వివిధ సంఘాల నాయకులకు, కార్యకర్తలకు ఓఎఫ్ బీజేపీ ఉపాధ్యక్షులు అడపా ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.




