
రాష్ట్రాలకు ‘మూడు’తోంది సుమా!
‘దేశ రాజ్యాంగం అంటే - ప్రాథమిక శాసనం. అన్ని ప్రభు త్వ విభాగాల ఉనికి, రాజ్యాం గానికి బద్ధమై ఉండాలి. ఈ విభాగాల అధికారాలన్నీ రాజ్యాంగ చట్రం నుంచే సంక్రమిస్తాయి.
‘దేశ రాజ్యాంగం అంటే - ప్రాథమిక శాసనం. అన్ని ప్రభు త్వ విభాగాల ఉనికి, రాజ్యాంగానికి బద్ధమై ఉండాలి. ఈ విభాగాల అధికారాలన్నీ రాజ్యాంగ చట్రం నుంచే సంక్రమిస్తాయి. ఆ చట్రం లోపలనే ఈ విభాగాలన్నీ తమ బాధ్యత లనూ నిర్వహిస్తాయి. అందు వల్ల, కేంద్ర శాసన వేదికైన పార్లమెంటుగానీ, రాష్ట్రాల శాస నసభలు గానీ రాజ్యాంగ చట్రాన్ని అధిగమించి పోగల సర్వసత్తాక ప్రతిపత్తిగల (సావరీన్) స్వతంత్రశక్తులు కావు. అటు భారత యూనియన్, ఇటు రాష్ట్రాల అధికారాల పరి ధులలోని అంశాలకు సంబంధించిన ఏ సవరణ అయినా సరే పార్లమెంటులోని ప్రత్యేక ప్రక్రియ (స్పెషల్ ప్రొసీ జర్) ద్వారా మాత్రమే జరగాలి, ఆ సవరణను దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ధృవీకరించి తీరాలి. అటు యూని యన్ ప్రభుత్వం, ఇటు రాష్ట్రాల శాసనసభలూ చేసే చట్టా లు రాజ్యాంగం నిర్వచించిన వాటి వాటి పరిధులలో ఉన్నాయా, లేక రాజ్యాంగ నిబంధనలను ఆ చట్టాలు ఉల్లంఘించాయా అని పరిశీలించి, ఆ చట్టాలు గనుక రాజ్యాంగ పరిధుల్ని అతిక్రమిస్తే సదరు చట్టాన్ని / చట్టా లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది.’ - రాజ్యాంగ నిపుణుడు పి.ఎం. బక్షీ: (ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, 7వ ఎడిషన్, 2013 ప్రచురణ)
ఇల్లు కాలుతూంటే బొగ్గులేరుకునే బాపతుకు సమ ఉజ్జీలే చాలామంది మన పార్లమెంటు సభ్యులూ, శాసన సభ్యు లూ! తెలుగుజాతిని తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం చాలా కృత్రిమ పద్ధతులను అనుసరిస్తూండగా, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని లెజిస్లేటర్లూ ప్రత్యేక ప్యాకేజీలతో మెజారిటీ ప్రజలను సంతృప్తిపరచడానికి ఎలాంటి వెరపూ లేకుండా ముందుకు సాగటమే ఇందుకు నిదర్శనం. అలాగే ఇప్పటిదాకా రాజ్యాంగంతో, అందులోని ఫెడరల్ స్వభావంతో, సవరణాధికారాలతో, షెడ్యూల్స్‌తో, ఆంధ్ర ప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలలోని విద్యార్థులు, యువజ నులు, వారి ఉద్యోగసద్యోగాల కల్పనకు, ఉద్యోగుల ప్ర మోషన్లకు సంబంధించిన 371(డి) ప్రత్యేక రాజ్యాంగ సవ రణాధికరణతో ఎలాంటి పొత్తూ పొంతనలేకుండా తీర్ప రులుగా వ్యవహరిస్తున్న వారిలో న్యాయవాదులు, లెజిస్లే టర్లు, మేధావులూ కూడా ఉండటం విచారకరం! చివరికి రాజ్యాంగంలోని ‘3వ అధికరణ’ ఫెడరల్ వ్యవస్థ మౌలిక స్వభావాన్ని అనేక సందర్భాలలో స్వాతంత్య్రానంతరం ఊడ్చిపెట్టుకుపోతున్నా ఈ ‘మేతావుల’కు చలనం లేదు.
ఆ అధికరణం ఎందుకు?
ఈ అధికరణను రాజ్యాంగ నిర్ణయసభ 1949లో చొప్పించ డానికి ప్రధాన కారణం - రాజ్యాంగం తుది ముసాయిదా రూపకల్పనలో ఉన్నప్పటికీ ఇండియన్ యూనియన్‌లో చేరడానికి ‘ససేమిరా’ అంటున్న ‘స్వదేశ సంస్థానాల’కు (ప్రిన్‌స్లీ స్టేట్స్) ముగుదాడు వేయడం కష్టసాధ్యంగా ఉన్న రోజులవి. ఆ సమయంలో రాజ్యాంగ నిర్ణయసభ ఈ ‘అధి కరణ-3’ ద్వారా కేంద్ర ప్రభుత్వ / పార్లమెంటు అధికారా లను పటిష్టం చేయాల్సివచ్చింది. తద్వారా సంస్థానాలను దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం యూనియన్‌లో విలీనం చేయక తప్పలేదు. కాని కాంగ్రెస్ ప్రభుత్వాలూ, బీజేపీ ప్రభుత్వం, వాటి సంకీర్ణ మంత్రివర్గాలూ ఈ అధి కరణను ‘వాటం’గా తీసుకుని భాషాప్రయుక్త ప్రాతిపది కపైన, రాష్ట్రాల తొలి పునర్వ్యవస్థీకరణ సంఘం సాను కూల సిఫారసులు ఆధారంగా ఏర్పడిన భాషా రాష్ట్రాలను సహితం తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఓట్లు- సీట్ల వేటలో భాగంగా చీల్చడానికి వాడుకుంటూ వచ్చాయి! అంతేగాదు, రాష్ట్రాల శాసనసభల అభీష్టాలతో, ఓటింగ్‌తో కూడా నిమిత్తం లేకుండా నిరంకుశంగా ‘అధికరణ-3’ను ఈ పాలక పక్షాలు వాడుకుని రాష్ట్రాల ఉనికిని అస్తవ్యస్తం చేయడానికి వెనుకాడటం లేదు.
నిశ్చితాభిప్రాయానికి నీళ్లు
1955కు ముందున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర పతి తన వద్దకు ఆమోదం కోసం ఏ బిల్లునైనా, సవరణ బిల్లునైనా పార్లమెంటు పంపించినప్పుడు సదరు బిల్లు వల్ల ‘అధికరణ-3’ కింద రాష్ట్రాలను, వాటి సరిహద్దులను చీల్చి, విడగొట్టడం వల్ల దెబ్బతినిపోయే రాష్ట్రాల శాసన సభల ‘నిశ్చితాభిప్రాయా’న్ని (‘ఎసర్టైన్డ్’) ఓటింగ్ ద్వారా ఆయన తెలుసుకోవాలని నిబంధన ఉంది. కాని ఆ తర్వా త కాంగ్రెస్ ప్రభుత్వం 1955 డిసెంబర్ 24న బ్రూట్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాన్ని తొల గించి, దాని స్థానంలో శాసనసభకు రాష్ట్రపతి కేవలం ‘రిఫర్’ చేస్తే చాలునని, ఓటింగ్ అవసరం లేదనీ శాసిం చింది! ఇదే తెలుగుజాతి ఉనికికే ప్రమాదకారంగా తయాై రెంది. రాజ్యాంగంలోని 368 అధికరణ రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు సంక్రమింపచేయగా లేనిది, ఫెడరల్ వ్యవస్థలో భాషా రాష్ట్రాల అస్తిత్వాన్ని, ఉనికినీ ‘విభజించి - పాలించే’ దుర్నీతికి చోటు కల్పిస్తున్న ‘అధికరణ-3’ను పార్లమెంటు ఎందుకు సవరించలేదు?
ఆనాడే ప్రశ్నించిన పెద్దలు
1948-49 నాటి రాజ్యాంగ నిర్ణయ సభా చర్చల సంద ర్భంగా రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం అధ్య క్షుడైన డా.అంబేద్కర్ సహితం రాష్ట్రాల ఉనికిని, వాటి సరిహద్దుల్నీ లేదా వాటి పేర్లను చెదరగొట్టి కొత్త రాష్ట్రాల నిర్మాణం తలపెట్టేటప్పుడు ఇబ్బందుల పాలయ్యే సంబం ధిత రాష్ట్రాలతో విధిగా సంప్రతించాలని ముందుగా వాటి అనుమతిని పొందాలనీ (‘కన్సెంట్’) స్పష్టం చేశారు! ఆయనే కాదు, ఆ నాటి సభా చర్చలో పాల్గొన్న ప్రొఫెసర్ కె.టి.షా, సంతానం, హెచ్‌వీ పటాస్కర్ లాంటి ఉద్దం డులు కూడా రాష్ట్ర శాసనసభ అనుమతి తప్పనిసరి అనీ, ఈ విషయం ‘అధికరణ-3’ తొలి పాఠంలోనే ఉందనీ, దురదృష్టవశాత్తు ఆ అంశాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలనీ ఘాటుగా ప్రశ్నించారు! ఆ మాట కొస్తే రాష్ట్రపతి కూడా రాజ్యాంగం ఒకటవ విభాగంలోని (పార్ట్-1) రాష్ట్రాల శాసనసభల ‘నిశ్చితాభిప్రాయాల’ను తెలుసుకున్నారనీ, అలాగే రాజ్యాంగం మూడవ విభాగం లోని (పార్ట్-3) రాష్ట్రాలకు సంబంధిత ఇబ్బందులున్న సందర్భాలలోనూ ‘శాసనసభల అనుమతిని పొందార’నీ పటాస్కర్ వెల్లడించారు! కాని కాంగ్రెస్ ఒత్తిడి వల్ల మూడవ విభాగంలోని రాష్ట్రాల అనుమతిని రాష్ట్రపతి పొంద వలసిన అవసరం లేదంటూ అధికార పూర్వక సవరణను చొప్పించారని కూడా ఆయన వివరించారు. ఫలితంగా ఓటింగ్‌తో నిమిత్తం లేకుండా కేవలం రాష్ట్రాల అభిప్రాయా లను తెలుసుకుని వదిలేయాలన్నదే అధికారిక సవరణ సారాంశమనీ పటాస్కర్ చెప్పారు! కనుకనే, సంబంధిత లెజిస్లేటర్లు అందరూ మూకుమ్మడిగా ఓటు చేయడం ద్వారానే రాష్ట్రాల అక్రమ విభజనను అడ్డుకోగలుగుతారని ఆయన స్పష్టం చేశారు. (1949 అక్టోబర్ 13: రాజ్యాంగ నిర్ణయ సభ చర్చలు: సంపుటి7: పేజీ: 211-212)
కనుమరుగవుతుందనే...
మూడవ అధికరణ కాలక్రమంలో నిర్జీవమైనదిగా (డెడ్ లెటర్) మిగిలిపోవచ్చునని పటాస్కర్ ప్రభృతులు ఆశిం చారు గాని, అది ‘ఉత్తిమాట’ అని అనంతరం కాంగ్రెస్, బీజేపీ పాలక పక్షాలు ఆచరణలో నిరూపించాయి! కాని పటాస్కర్ ప్రసంగం ఆఖర్లో చేసిన వ్యాఖ్య నేటి మన పరిస్థితుల్లో భవిష్యత్ వాణిగా చెప్పుకోక తప్పదు: ‘‘రాబోయే రోజుల్లో ఈ నూతన రాజ్యాంగం కింద, ‘అధి కరణ-3’ ప్రొవిజన్స్ కింద దేశానికి మరిన్ని కష్టాలు ఎదు రవుతాయి’ (‘దేర్ విల్ బి మోర్ డిఫికల్టీస్ అండర్ ది న్యూ కానిస్టిట్యూషన్ అండ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్-3)! అలాగే, రాజ్యాంగంలోని 2, 3, 4 అధికరణలను కేంద్ర పాలకులు పార్లమెంటులో బ్రూట్ మెజారిటీ ‘తెర’ చాటున అనేక సందర్భాల్లో దుర్వినియోగం చేస్తున్న ఉదంతాన్ని సుప్రీంకోర్టు కూడా గతంలో ఉదహరించింది. అధికరణలు (2), (3) గురించి వ్యాఖ్యానిస్తూ సుప్రీం కోర్టు (1993) ఈ ‘అధికరణల కింద పార్లమెంటుకు సంక్ర మించిన అధికారం భారత రాజ్యాంగ సూత్రాలకు లోబడి ఉండాలి, పార్లమెంటు విధించగోరే షరతులు పరస్పరం విరుద్ధంగా ఉండకూడదు, రాజ్యాంగ ప్రక్రియనే పక్కదా రులు పట్టించేదిగా ఉండకూడదు అని చెప్పింది! అంతే గాదు, రాజ్యాంగ ప్రక్రియను పార్లమెంటు అతిక్రమించ కూడదు. ఒక చట్టం రాజ్యాంగం అనుమతించదగిన పరి మితులను దాటి వెడితే ఆ చట్ట సామంజస్యాన్నే ప్రశ్నించ వచ్చునని కూడా సుప్రీం స్పష్టం చేసింది!
‘మూడు’ను సవరించాలి
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 371(డి) రాజ్యాంగ సవరణాధికరణను ‘సవరించడం తేలికే’నని కొందరు ‘మేధావులు’ భ్రమలు కొల్పారు కూడా! అదేమంటే, ఆ అధికరణలోనే వేరుపడే తెలుగు ప్రాంతం పేరును కూడా చేర్చుతూ సవరిస్తే సరి పోతుందని మరికొందరి ఉచిత సలహా! ఇది కుదరదని తెలుసుకున్న తర్వాత, పోనీలే 371(డి) అధికరణను యథాతథంగా ఉంచినా చాలునని రాజీపూర్వక సంతృప్తి! అందువల్ల ‘అధికరణ-3’ను కేంద్రంలోని పాలకపక్షాలు స్వార్థ ప్రయోజనాల కోసం తరచుగా ‘తురుపు’గా ఉప యోగించకుండా ఉండాలంటే, రాష్ట్రాల శాసనసభల ప్రభు త్వాల పరిపూర్ణ అనుమతితో తప్ప ఆ అధికరణను వాడరా దని స్పష్టం చేస్తూ విధిగా సవరించాల్సి ఉంది.
విశ్లేషణ: ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు