అవసాన దశకు చేరిన కాంగ్రెస్‌కు ఆఖరాట మొదలైంది. మరికొన్ని నెలల్లో జరగబోయే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అనదగ్గ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కచోట మినహా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది.
అవసాన దశకు చేరిన కాంగ్రెస్‌కు ఆఖరాట మొదలైంది. మరికొన్ని నెలల్లో జరగబోయే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ అనదగ్గ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కచోట మినహా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కుంభకోణాలు నిత్యకృత్యమై, ప్రత్యర్థులను వేధించడం అలవాటై ప్రజలకు సమర్ధ పాలన అందించడమనే ప్రాథమిక సూత్రాన్ని ఏనాడో మరిచిపోయిన కాంగ్రెస్‌ను ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ గంపగుత్తగా తిరస్కరించారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని సర్వేలు ఒకటికి పదిసార్లు చెప్పాయి.
రాజకీయ నిపుణులు ఎన్నెన్నోసార్లు విశ్లేషించి చెప్పారు. అయినా కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోలేకపోయింది. ఫలితంగా ఆమూల ఈశాన్యంలో మినహా ప్రధాన రాష్ట్రాలన్నిటా దానికి శృంగభంగమైంది. మూడు దఫాలనుంచి పాలిస్తున్న ఢిల్లీలోనూ, క్రితంసారి అధికారంలోకొచ్చిన రాజస్థాన్‌లోనూ ఆ పార్టీని ఓటర్లు చిత్తు చిత్తుగా ఓడించగా... మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో గతకాలపు అవమానాలే మళ్లీ ఎదురయ్యాయి. పాలించాం గనుక బలమైన ప్రభుత్వ వ్యతిరేకత ఎదురైందని దబాయించే అవకాశంలేదు. అలాంటిదేమైనా ఉంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని బీజేపీ ప్రభుత్వాలకూ ఆ పరిస్థితి ఎదురుకావాలి. ఆ రెండుచోట్లా కమలనాథులు వరసగా రెండు పర్యాయాలనుంచి విజయకేతనం ఎగరేస్తున్నారు. మూడోసారి కూడా ఆ పార్టీనే జనం మెచ్చారంటే, మెచ్చి మరిన్ని సీట్లు అదనంగా ఇచ్చారంటే తన వైఫల్యం ఎక్కడుందో కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కావాలి. మూలవిరాట్టులే గుదిబండలయ్యారని తెలుసుకోవాలి.
ఫలితాలు వెలువడ్డ రాష్ట్రాలన్నిటా కాంగ్రెస్‌ను ఖండఖండాలు చేసుకుంటూ ఢిల్లీవైపు అడుగులేసిన బీజేపీకి... అక్కడ వెలువడిన ఫలితాలు తీరని షాక్‌నిచ్చాయి. పుట్టి నిండా ఏడాది కాకుండానే కొత్త కొత్త ఎత్తుగడలతో, విభిన్నమైన ప్రచారశైలితో జనం గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ధాటికి అక్కడి బీజేపీ తట్టుకోలేకపోయింది. చిరుగాలిగా మొదలైన ఆప్ చూస్తుండగానే పెను ప్రభంజనంలా మారడం, తన ఒళ్లో వాలవలసిన అధికారం కాస్తా మరిన్ని అడుగులకు అవతలెక్కడో పడటం... 2014లో దేశాన్ని ఏలాలనుకుంటున్న పార్టీకి పెనుఘాతమే. దేశ రాజధాని నగరంలో పోటీ ఉంటే గింటే తమ మధ్యే తప్ప అన్యులకు అక్కడ చోటులేదని లెక్కలేసుకున్న ప్రధాన పక్షాల రెండింటి అంచనాలనూ ఆప్ తలకిందులు చేసింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 36 స్థానాల అవసరంపడగా, బీజేపీ 31 దగ్గరే ఆగి పోయింది. మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ అయినా అయిదారు సీట్లు సాయంపట్టి ఉంటే బీజేపీ ‘బతుకు జీవుడా’ అనుకునేది. కానీ, ఢిల్లీ ఓటరు కరుణించలేదు. పదిహేనేళ్లనుంచి అధికారం చలాయిస్తున్న కాంగ్రెస్‌కు ఎనిమిదంటే ఎనిమిదే స్థానాలు మిగిల్చి అంటకత్తెరేయగా, ఆప్‌కు 28 స్థానాలతో ఓటర్లు పట్టంగట్టారు.
చూడదల్చుకున్నవారికి ఆప్ దూకుడు ఆదినుంచీ కనిపిస్తూనే ఉంది. పీఠంపై ఉన్నవారిని వేదికలనెక్కి తెగనాడేవారు అసలైన పరీక్షలో అట్టర్‌ఫ్లాప్ అవుతారని ప్రధాన పార్టీలే కాదు...కొందరు విశ్లేషకులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సర్వేల్లో ఆ పార్టీకి పది పదిహేను స్థానాలు మించి ఇవ్వడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. కాంగ్రెస్ అయితే, అధికారంలో ఉన్నాం కదా అని తనకలవాటైన మొరటుతనంతో వ్యవహరించింది. పార్టీకి ఎక్కడెక్కడినుంచి విరాళాలందుతున్నాయో ఏరోజుకా రోజు వెబ్‌సైట్లో పెట్టిన ఆప్‌ను అభినందించాల్సిందిపోయి వేధించుకు తినడానికి మార్గం దొరికిందని కాంగ్రెస్ పెద్దలు చంకలు గుద్దుకున్నారు. తమ చెప్పుచేతల్లో పనిచేసే విభాగాలకు పనిచెప్పారు. ఫలితంగా ఆప్‌కు అభిమానులే కాదు... విరాళాలూ పెరిగాయి. గెలిచే పార్టీకే ఓటేయడం తప్పదనుకున్నవారు సైతం ఆఖరి క్షణంలో మనసు మార్చుకుని ఆప్ వైపు మొగ్గారు.
ఒక కొత్త పార్టీని స్థాపించడం, స్వల్పకాలంలోనే దాన్ని విజయపథంలో నడిపించడం సాధారణ విషయం కాదు. అందుకు అరవింద్ కేజ్రీవాల్‌ను అభినందించాల్సిందే. అభ్యర్థుల ఎంపికనుంచి అందరికీ భాగస్వామ్యం కల్పించడానికి ఆయన చేసిన ప్రయత్నం మెచ్చదగ్గదే. అంతకుమించి ఆ గడ్డపై సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆప్ కాలూనడానికి ప్రాథమికంగా దోహదపడింది. అటు తర్వాత జరిగిన నిర్భయ ఉదంతం సందర్భంగా వెల్లువెత్తిన ప్రజా ఉద్యమం కూడా పాలకులపై ఏవగింపు కలిగించింది. ఆ రెండు ఉద్యమాల్లోనూ సమీకృతులై లాఠీ దెబ్బలను, వాటర్ కేనన్‌లనూ ఎదిరించి పోరాడిన వేలాదిమంది యువతీయువకులు ఆప్ తమదేనని త్రికరణ శుద్ధిగా నమ్మారు.
పార్టీలో పదవుల్నిగానీ, దాన్నుంచి డబ్బుల్నిగానీ ఆశించకుండా వీరంతా రాత్రింబగళ్లు పనిచేశారు. ఆన్‌లైనా, వీధి వీధీనా అనే విచికిత్సకు పోలేదు. ఏది వీలైతే అదిచేశారు. ప్రత్యర్థుల మారీచ ఎత్తుగడల ఆనుపానులను ఎప్పటికప్పుడు పట్టారు. దొంగ ఓటర్ల ఆచూకీని, నిజమైన ఓటర్ల గల్లంతును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. అవతలి పార్టీలను గుక్కతిప్పుకోనీయలేదు. నియోజకవర్గాల వారీ మేనిఫెస్టోల్లో స్థానికుల ఆకాంక్షలకు చోటిచ్చారు. సామాన్యుల గుండె లోలోతుల్లోని అభిప్రాయాలకు గొంతుకయ్యారు.
కాంగ్రెస్‌కు ఇక సమయం మించిపోయింది. అది మారేదీ లేదు... ప్రజలను దాన్ని నమ్మేదీ లేదు. కానీ, బీజేపీ ఈ జయజయధ్వానాల్లోనే జనం చేసిన హెచ్చరికను పోల్చుకోవాలి. బలమైన ప్రత్యామ్నాయం కాగలదని భావించినప్పుడు... కొత్తదైనా మూడో పక్షాన్ని సైతం ఎంచుకోవడానికి వారు వెనకాడరని గుర్తుంచుకోవాలి. తమకు కంచుకోటలనుకున్న రాష్ట్రాలు భద్రంగానే ఉన్నాయనుకున్నా ఇతరేతర ప్రాంతాల్లో కొత్త కొత్త సవాళ్లు ఎదురయ్యే ఆస్కారం లేకపోలేదని గ్రహించాలి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఆకర్షణ ఒకటే సరిపోదని, సర్వామోద విధానాల రూపకల్పన అవసరమూ ఉన్నదని తెలుసుకోవాలి.