
ఆధిపత్యం కోసం ఆరాటం
'రిజర్వేషన్ సౌకర్యాలను పూర్తిగా రద్దు చేయండి. లేదా అందరికీ ఇవ్వండి' ఇదే గుజరాత్ పటేళ్లను వీధుల్లోకి నడిపిస్తోన్న నినాదం.
కొత్త కోణం:
అక్కడి ఆధిపత్య కులాలు గుజరాత్ క్షత్రియ సభగా ఏర్పడి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దానితో ఆ డిమాండ్ వాయిదా పడింది. మళ్లీ 1981లో సామాజిక, విద్యారంగాల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ప్రకటించడంతో అల్లర్లు చెలరేగాయి. దీనికి నాయకత్వం వహించింది ఈ పాటీదార్లే. అంటే పాటీదార్ల మూలాలు రిజర్వేషన్ వ్యతిరేకమైనవి తప్ప అనుకూలమైనవి కాదు. ఇప్పుడు ముసుగు మారిందంతే.
'రిజర్వేషన్ సౌకర్యాలను పూర్తిగా రద్దు చేయండి. లేదా అందరికీ ఇవ్వండి' ఇదే గుజరాత్ పటేళ్లను వీధుల్లోకి నడిపిస్తోన్న నినాదం. పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నాయకుడు హర్దిక్ పటేల్ చేస్తున్న హుంకారం ఇదే. పైకి హుందాగా కనిపిస్తున్నా, నినాదంలోనే లోపం ఉన్నదని క్షణంలో అర్థం అయి పోతుంది. గత నాలుగైదు నెలలుగా గుజరాత్‌లో పటేల్ పేరుతో పిలిచే పాటీ దార్లు చేస్తున్న ఆందోళన ఆగస్టు 25వ తేదీన హింసాత్మకమైంది. దాదాపు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆందోళన రిజర్వేషన్ల డిమాం డ్‌తో జరుగుతున్న ఉద్యమంగా పత్రికలు పేర్కొన్నాయి. ఇక్కడే వివేచనతో ఆలోచించాలి. అప్పుడే ఈ ఆందోళన రిజర్వేషన్ల కోసమా? రిజర్వేషన్లకు వ్యతి రేకంగా జరుగుతోన్నదా నిగ్గుతేలుతుంది. ఏ అంశాలపైన ఆధారపడి రిజర్వే షన్లు అడుగుతున్నారన్నది ఒక విషయమైతే, ఎవరు అడుగుతున్నారన్నది మరో అంశం. అంతకన్నా ముఖ్యమైన విషయం, రిజర్వేషన్లు ఇవ్వడం కంటే రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండడం కూడా ఇందులో ప్రధానాంశమే. తమకు, అంటే పటేళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలనీ, లేకుంటే అసలెవ్వరికీ ఇవ్వకూడదని వారి డిమాండ్. దక్కితే తనకు దక్కాలి. లేదంటే ఎవ్వరికీ దక్కకూడదనే అక్కసుతో జరుగుతున్న ఆందోళనని రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమంగా భావించలేం. అందువల్ల దీనిని ఉద్యమం అనడానికే వీల్లేదు. ఉద్యమం అంటే ప్రజాస్వామ్య దృక్పథం, న్యాయమైన కోరికలే ధ్యేయంగా ఉండాలి. అందుకే ఆందోళన అని వాడుతున్నాను.
అది సామాజికాంశం
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చెప్పినట్టు రిజర్వేషన్ డిమాండ్ ఆర్థిక మైనది ఎంత మాత్రమూ కాదు. ఇది అక్షరాలా సామాజిక అంశం. తరతరాల అణచివేతను, సామాజిక వెనకబాటును, వివక్షను కూకటివేళ్లతో పెకిలించేం దుకు, సమానత్వ సాధనకు కల్పించిన ఒక సౌకర్యం. కింది కులాల అభి వృద్ధికి కొంత చేదోడు మాత్రమే. అయితే గుజరాత్‌లో ఆధిపత్య కులాలైన పటేల్ వంటి సామాజిక వర్గాలు గతంలో చేపట్టిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన, ఆ సందర్భంలో చెలరేగిన హింస తదితర అంశాలను మనం గుర్తుం చుకోవాలి. పటేళ్లుగా పేర్కొనే ఆధిపత్య కులాలు నేడు ఒక నవ యువకుడి చుట్టూ గుమిగూడుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలంటే గుజరాత్‌లో పటేల్ లేదా పాటీదార్ల స్వభావం అర్థం చేసుకోవాలి. 1972లో అప్పటి ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు (ఎస్.ఇ.బి.సి) రిజర్వేషన్లు కల్పించేందుకు జస్టిస్ బక్షి కమిటీని నియమించింది. సామాజిక, విద్యారంగాల్లో వెనుకబడిన కులాలను, తరగతులను గుర్తించి ఎస్సీ, ఎస్టీల లాగానే రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ బక్షి కమిషన్ సిఫారసు చేసింది. అయితే అక్కడి ఆధిపత్య కులాలు గుజరాత్ క్షత్రియ సభగా ఏర్పడి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దానితో ఆ డిమాండ్ వాయిదా పడింది. మళ్లీ 1981 లో సామాజిక, విద్యారంగాల్లో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ప్రకటించ డంతో అల్లర్లు చెలరేగాయి. దీనికి నాయకత్వం వహించింది ఈ పాటీదార్లే. అంటే పాటీదార్ల మూలాలు రిజర్వేషన్ వ్యతిరేకమైనవి తప్ప, అనుకూలమై నవి కాదు. ఇప్పుడు ముసుగు మారిందంతే. ఆ రోజు రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన నగరాలకే కాదు పల్లెలకూ పాకింది. అహ్మదాబాద్, ఖేడా, మెహ సనా జిల్లాల్లో దళిత బస్తీలను తగులబెట్టారు. అనేక మంది దళిత యువకు లను చితకబాదారు. కొన్ని ప్రాంతాల్లో పాటీదార్లు వెనుకబడిన కులాలను కూడా దళితులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారు.
అవన్నీ ఆధిపత్య ధోరణికి అద్దం పట్టేవే!
రెండోసారి 1985లో కూడా ఇటువంటి హింసాత్మక ఆందోళనే చోటుచేసుకు న్నది. అప్పటి వరకు వెనుకబడిన తరగతులకు 10 శాతంగా ఉన్న రిజర్వే షన్లను 28 శాతానికి పెంచారు. అయితే ఆందోళనల తర్వాత ప్రభుత్వం పెం చిన రిజర్వేషన్లను నిలిపివేసింది. అయినా, ఆధిపత్య కులాలు ఆందోళనను విరమించలేదు. ఇది మత ఘర్షణలకు కూడా దారి తీసింది. ఆ కులాలు ముస్లింల మీద దాడులు చేశాయి. అహ్మదాబాద్, వడోదర తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఈ ఘర్షణల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెక్క లు చెబుతున్నాయి. ఈ రెండు రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలకు జనాభా రీత్యా అధికంగా ఉన్న పటేల్ వర్గం నాయకత్వం వహించింది. రిజర్వేషన్లను వ్యతిరేకించే ఆధిపత్య కులాలు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేని దళితులపైన, ముస్లింలపైనా దాడులు జరపడం చూస్తే ఈ ఉద్యమంలో ఇమిడివున్న అగ్రవర్ణ ఆధిపత్య స్వభావం, రిజర్వేషన్లు పొందుతున్న వారి పట్ల అక్కసు, పటేళ్లకు ఉండే స్వాభావికమైన అహంకార ధోరణి స్పష్టమౌ తుంది. ఈ నాలుగు నెలల కాలంలో వీళ్లు నిర్వహించిన ర్యాలీలలో దళిత వ్యతిరేక నినాదాలు చేశారు. అహ్మదాబాద్ పరిసరాల్లో దళితులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఇటువంటి చర్యలతో వారిని రెచ్చగొట్టి హింసను ప్రేరే పించే యత్నాలకు పాల్పడ్డారు. ఆ విషయాన్ని పత్రికలే ప్రచురించాయి. హర్దిక్ పటేల్ వ్యాఖ్యలను, 1981, 1985 రిజర్వేషన్ వ్యతిరేక హింసను అర్థం చేసుకున్నా ఇది రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనే తప్ప, తమ రిజర్వేషన్ కోసం చేసే ప్రయత్నం కాదన్నది సుస్పష్టం.
పటేళ్లది ఉద్యమం ఎందుకైంది?
ఎవరైనా దీనిని రిజర్వేషన్ కోసం పాటీదార్లు చేస్తున్న ఆందోళన అనుకుంటే దానికి హేతుబద్ధత లేదు. రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఆర్థిక వెనుకబాటుతనమో, పేదరికమో కాదు. కేవలం సామాజిక, విద్యావిషయమైన వెనుకబాటు తనమే గీటురాయిగా రాజ్యాంగం పేర్కొంటున్నది. దానిమీద ఆధారపడి ఇటీ వల జాట్‌లకు రిజర్వేషన్లు కల్పిస్తూ, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు నిలిపివేసింది. సామాజిక వెనుకబాటుతనం జాట్‌లకు వర్తించ దన్న జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఉటంకించింది. ఈ నేపథ్యంలో పాటీదార్ల సామాజిక చరిత్రను పరిశీలిస్తే విష యం అర్థమవుతుంది. పాటీదార్లు రాముడి వారసులుగా ప్రకటించుకుం టారు. శ్రీరాముడి కుమారులైన లవకుశుల పేరుతో రెండువర్గాలు ఉన్నాయి. వారే లెవ్ (లవుడు) పటేళ్లు, కడవ (కుశుడు) పటేళ్లు. 1931 లెక్కలను బట్టి గుజరాత్‌లో వీరి జనాభా దాదాపు 15 శాతమని అంచనా. 1931 తరవాత కుల ప్రాతిపదికన జనాభా లెక్కలు జరపలేదు. కనుక అవే లెక్కలను పరిగణ నలోనికి తీసుకోవాల్సి వస్తోంది. పాటీదార్లు గుజరాత్ అంతటా విస్తరించి ఉన్నారు. పాటీదార్ కులమైనప్పటికీ, పటేల్ అని పిలవడానికి కారణం వారు గ్రామ పెద్దలుగా ఉండటమే. గ్రామంలోని భూమి మీద వీరిదే ఆధిపత్యం. గుజరాతీలో పాటి అంటే భూమి, దార్ అంటే యజమాని. అంటే భూస్వామి. జనాభా అధికంగా ఉండడం వల్ల గ్రామంలో వీరి మాటే చెల్లుబాటవుతుంది. భూమి మీద పెత్తనం కలిగిన ఈ కులం వ్యవసాయంలో వచ్చిన లాభాలతో 1970-80 ప్రాంతంలో వ్యాపారం, వాణిజ్యాల మీద దృష్టి మరల్చింది. ఆ వ్యాపార మనస్తత్వంతోనే పరిశ్రమల స్థాపన వైపునకూ మళ్లారు. వస్త్ర పరిశ్ర మ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, ఖరీదైన వజ్రాల వ్యాపారంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు. దాదాపు 6,146 పారిశ్రామిక యూనిట్లు ఈ కులం వారి ఆధిపత్యంలో ఉన్నట్టు వన్స్‌జలియా అనే పారిశ్రామికవేత్త అంగీకరిం చారు. వీరు మొదట ఆఫ్రికాకు, ఆపై ఇంగ్లండ్, అమెరికాలకు వలసవెళ్లారు. అమెరికా వ్యాపార రంగంలో కూడా గొప్పపేరు సంపాదించుకున్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో కూడా వీరి ప్రాబల్యం ఎక్కువే. 182 మంది సభ్యులున్న ప్రస్తుత గుజరాత్ అసెంబ్లీలో వీళ్లు 37 మంది ఉన్నారు. ముఖ్యమంత్రి ఆనందీ బెన్ సహా, ఆరుగురు మంత్రులు ఆ కులానికి చెందినవారు.
అసలు కారణం వర్తమాన సంక్షోభం
అయితే, రిజర్వేషన్లు కావాలని లేదా రద్దు చేయాలనే డిమాండ్‌ను ఇప్పుడే ముందుకు తేవడానికీ, లక్షలాది మంది పటేళ్లు వీధుల్లోకి రావడానికీ గుజరాత్ వర్తమాన సంక్షోభం కారణమని పరిశీలకుల భావన. వ్యవసాయం దెబ్బతి న్నది. వజ్రాల వ్యాపారం, ఇతర పరిశ్రమలు మూతపడుతున్నాయి. దానితో జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న పటేళ్లలోని మధ్యతరగతి, పేదలు అశాం తితో ఉన్నారు. వీరికి పిల్లల చదువులు భారమవుతున్నాయి. విద్యావంతులు కూడా అధిక సంఖ్యలో ఉండడం వల్ల, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తంగా కలిపి ఇస్తున్న 50 శాతం రిజర్వేషన్లు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని వారు భావి స్తున్నారు. ఈ పరిస్థితి ఆసరాగానే తాజా ఆందోళన ఆరంభమైనట్టు కనిపిస్తు న్నది. నిజానికి పటేళ్లు ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు గానీ, రిజర్వేషన్లు గానీ కారణం కాదు. వ్యవసాయ, పారిశ్రామికరంగాల్లో నెలకొన్న సంక్షోభాన్నీ, చిన్న, మధ్యతరహా వ్యవసాయాలు, వ్యాపారాలు, పరిశ్రమలు మనుగడ సాగించలేని స్థితినీ కార్పొరేట్ రంగం తెచ్చి పెట్టింది. పాటీదార్లు పోరాటం చేయదలచుకుంటే దేశాన్ని కబళిస్తున్న కార్పొరేట్ రం గంపైన, దాని గుత్తాధిపత్యంపైన చేయాలి. అంతేకానీ, ఇప్పటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బలహీనంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు చేయడం హేతుబద్ధమైనది కాదు. సమస్య ఒకచోట ఉండగా, పరిష్కారం మరోచోట వెతుక్కోవడం అవివేకమే. అత్యంత జ్ఞానులుగా, వివేకులుగా భావించుకునే ఈ వర్గం ఇంత అవివేకమైన డిమాండ్‌తో ఆందోళనకు దిగడం ఆధిపత్య స్వభావానికి అద్దం పడుతున్నది. తరతరాల అధికారాన్ని, ఆధిప త్యాన్ని మరింత పటిష్టం చేసుకొనేందుకు, గతంలో మాదిరిగానే బలహీన వర్గాల హక్కులను కాలరాసి, అగ్రకుల రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాని ముం దుకు తెచ్చేందుకు జరుగుతున్న కుట్రగానే దీన్ని అర్థం చేసుకోవాలి.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213