ఒంటరితనమే డ్రగ్స్‌కు కారణం | kommineni manasulo maata with yandamuri veerendranath | Sakshi
Sakshi News home page

ఒంటరితనమే డ్రగ్స్‌కు కారణం

Published Wed, Jul 26 2017 1:35 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

ఒంటరితనమే డ్రగ్స్‌కు కారణం - Sakshi

ఒంటరితనమే డ్రగ్స్‌కు కారణం

► కొమ్మినేని శ్రీనివాసరావుతో యండమూరి వీరేంద్రనాథ్‌

సినీరంగం సునాయాసంగా డ్రగ్స్‌కు లోనవుతోందంటే చేతినిండా డబ్బులు, ఒంట రితనం, వెసులుబాటే కారణమని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్‌ పేర్కొన్నారు. నలభై రోజులు కుటుంబాలకు దూరమై ఒంటరితనంతో గడిపే వాతావరణంలోనే అందరూ కలిసి కూర్చుని తినడం, తాగడం షూటింగు లొకేషన్లలో సహజమని ఆ అలవాటే వ్యసనంగా మారుతుందని చెప్పారు.

ఒక చోట సాన్నిహిత్యంతో గడపవలసి వచ్చే చోట ఏ ఒక్కడికి వైరస్‌ ఉన్నా పక్కవారికి వెంటనే పాకిపోతుందని, ఒకసారి తాగండి, తీసుకోండి అన్నప్పుడు ఊ అన్నారంటే అదే అలవాటైపోతుందన్నారు. రాజకీయ వ్యవస్థ పునాదే సరైంది కాదు కాబట్టే మన దేశంలో అవినీతి పెరుగుతూంటుందన్న యండమూరి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

నవలారంగంలో ట్రెండ్‌ సృష్టించిన మీరు నవలా రచనలోకి ఎలా వచ్చారు?
ప్రతి 20 ఏళ్లకీ ట్రెండ్‌ మారుతుంది. తెలుగు నవల పాపులర్‌ అవుతున్న తొలి రోజుల్లో కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్‌ వంటివారు రెండో ప్రపంచ యుద్ధం, సామాన్యుడు, కమ్యూనిస్టు ప్రభుత్వం, అసమర్థుని జీవయాత్ర వంటి సంఘర్షణల నేపథ్యంలో ఒక ట్రెండ్‌ సృష్టించారు. అమ్మా యిలు చదువుకోవడం, ఇంటర్మీడియెట్‌ పాస్‌ కావడం, ఆ తర్వాత పెళ్లి చేసుకునే దశ వచ్చిన సమయంలో కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనా రాణి వంటివారు ఇంకో ట్రెండ్‌ సృష్టించారు. ఒక స్త్రీ తన కలల రాజకుమారుడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండటం.. అదొక పాతికేళ్లు నడిచింది. ఆ తర్వాత ఇంకో విధమైన ట్రెండ్‌.. ఆర్థర్‌ హెయిలీ, ఇర్వింగ్‌ వాలెస్‌ టైప్‌లో సబ్జెక్ట్‌ తీసుకుంటే ఒక పరిశోధన చేసి దానిపై ఏదైనా రాయడం మొదలైంది. ఇప్పుడు నవలలు రాస్తే చదివేవారు ఎవరూ లేరు. దాదాపు 15 ఏళ్లనుంచి నవలా రచన అనే ట్రెండే లేదు.

నవలారంగంలోకి రావడానికి ప్రేరణ ఎవరు?
అమ్మా, నాన్న రెండు కుటుంబాల్లోనుంచి సాహిత్యపరమైన పునాది ఉంది. నేను జీన్స్‌ థియరీని నమ్మను కానీ ఆ ఇంటి వాతావర ణంలో నేను కూడా రాయడం మొదలెట్టాను. ఎందుకు రాశానంటే నాన్నే కారణం. నాకు కొన్ని ఆత్మన్యూనతా లక్షణాలు ఉండేవి. ఈ కాంప్లెక్సులనుంచి బయటపడాలంటే నీ లోపల మనిషితో మాట్లాడరా అని నాన్న చెప్పాడు. ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది. నీలోనూ కళ ఉంటుంది దాన్ని గుర్తించు అని నాన్న అనేసరికి నాలో నాకు రచయిత కనిపించాడు. అలా కథలు రాసే క్రమంలో నాలోని న్యూనతా లక్షణాలు తగ్గిపోయాయి.

క్షుద్ర శక్తుల్ని మీరు నమ్ముతారా?
నేను మొత్తం 70 నవలలు రాశాను. వాటిలో క్షుద్రశక్తిమీద రాసింది మూడే. జనాలకు అలాంటివి ఇంట్రెస్టు కాబట్టి చాలా పాపులర్‌ అయ్యాయి. ఏ నవల రాసినా ఆ నవలలో ఒక ప్రత్యేక సబ్జెక్టు తీసుకునేవాడిని. ఇక తులసీ దళం రాసినప్పుడు బాణామతిపై రాయాలనిపించింది. అందుకు ప్రేరణ నా ఆదర్శ దైవం విశ్వనాథ సత్యనారాయణ. ఆయన బాణామతి అనే నవల రాశారు. అది అంత పాపులర్‌ కాలేదు. ఆ పుస్తకానికి సెంటిమెంట్‌ జోడించి కమర్షియల్‌ ఎలిమెంటుతో బాగా రాయవచ్చేమో అనిపించింది. ఆంధ్రభూమి పత్రికలో ఎనిమిది వారాల తర్వాత ఆ సీరియల్‌ని నిలిపివేయాలనుకున్నాం. మొదట్లో అది సక్సెస్‌ కాలేదు. ఆ పాపకు చేతబడి మొదలైనప్పట్నుంచే హిట్టయింది. తర్వాత సంపాదకుడు, నేను కొనసాగించాం. వాస్తవానికి 26 వారాలు అనుకున్నది 104 వారాల పాటు రాశాను.

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ సంక్షోభం, గొడవ గురించి మీరేమంటారు?
సినీరంగంలో వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఉంటాయి. పైగా సినిమా వాళ్లకు ఒంటరితనం ఎక్కువ. షూటింగు కోసం ఊటీ వంటి ప్రాంతాలకు వెళితే దాదాపు 40 రోజులు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. పెళ్లాం బిడ్డలు ఉండరు. ఆడా, మగా కలిసి కూర్చుని వెళ్లడం, వరండాల్లో కూర్చుని కలిసి డ్రింక్‌ తాగడం.. షూటింగ్‌ లొకేషన్లలో అలవాటు. అందులో ఏ ఒక్కడికి వైరస్‌ ఉన్నా.. పక్కవారికి వెంటనే పాకిపోతుంది. ఒకసారే కదా తాగండి అంటారు. అదే అలవాటైపోతుంది.

రాజకీయ నేతల సైకాలజీని స్టడీ చేస్తుంటారా?
ఇండియాకు క్రికెట్‌ ప్లేయర్‌ కావడం సులభమేమో కానీ రాజకీయ నాయకుడిగా కావడం చాలా కష్టం. రాజకీయ నాయకుడు అవాలంటే మొట్టమొదట లౌక్యం ఉండాలి. జ్ఞాపక శక్తి, ధారణ శక్తి ఉండాలి. మొహం మీద చిరునవ్వు ఉండాలి. తనకన్నా పైవాళ్లను మంచి చేసుకునే నేర్పు ఉండాలి. అన్నింట్లో వెసులుబాటు చేసుకుంటూ పైకి ఎగబాకే తత్వం కూడా ఉండాలి. పైవాణ్ణి నొక్కేసి తాను పైకి వెళ్లి తర్వాత తన కిందివాళ్లను పైకి తీసుకొచ్చే తెలివి కూడా ఉండాలి.

మీ సరస్వతీ విద్యాకేంద్రం గురించి చెబుతారా?
నా ఆస్తి మొత్తం సరస్వతీ కేంద్రానికి రాసి ఇచ్చేశాను. కారణం చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న కూడా అడుక్కుతినేవాడు. వాళ్ల నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో ఈయన వారాలు చేసుకుని బతికాడు. నాన్న పుట్టింది అమలాపురం దగ్గరయితే ఉద్యోగాలు చేసింది రాయలసీమలో. చదువుకోసం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ అంతా తిరిగాను. బీదతనం నుంచే వచ్చాను కాబట్టి సంపాదించిన తర్వాత తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశంతో సరస్వతీ విద్యా పీఠం పెట్టి గిరిజన విద్యార్థులకు ఉచి తంగా విద్య, డొనేషన్లు ఇస్తున్నాను కాబట్టి మా ఇంట్లో మినీ సినిమా ధియేటర్లు, బెంజ్‌ కార్లు వంటివి లేవు.

బాల్యం ఆ అనుభూతుల గురించి చెబుతారా?
నేను చాలా పూర్‌ స్టూడెంటుని. బాగా చదివేవాడిని కాదు. ఆరో క్లాసు, ఏడో క్లాసు అన్నీ ఫెయిలవుతూ వచ్చాను.  అమ్మ వాళ్ల నాన్న డిప్యూటీ తహసీల్దార్‌. నేను ఆయన దగ్గరే పెరిగాను. ఈయనేమో చాలా గారాబం చేసేవాడు. ఇది యువతకు పనికివస్తుందేమో అని చెబుతున్నాను. ఏడో తరగతి ఫెయిలయ్యాక నాన్న వద్దకు వెళ్లాను. అక్కడికెళ్లాకే మొత్తంగా మారిపోయాను. వందల పద్యాలు బట్టీయం వేయించాడు. 23వ లెక్క రివర్స్‌లో చదివించేవాడు. కుటుంబంలో తండ్రి తల్చుకుంటే మనిషి ఎంత మారగలడో చెప్పడానికి నేనే ఉదాహరణ. తాతయ్య వద్ద ఉన్నప్పుడు వరుసగా ఫెయిల్‌ అవుతూ వచ్చిన నేను నాన్న వద్దకు వచ్చాక చార్టర్డ్‌ అకౌటెంట్‌ అయాను. ఆయన వల్లే నాలుగేళ్ల సీఏ కోర్సును మూడేళ్లలో పూర్తి చేశాను. పేదరికం అనేది గొప్పతనానికి అడ్డుకాదు. సెలూన్‌కి కూడా వెళ్లను. ఇప్పటికీ నా హెయిర్‌కట్‌ నేనే చేసుకుంటాను. దాన్నీ మా నాన్నే నేర్పాడు.

భవబంధాలు తెంచుకుని గడిపే పరిస్థితి సాధ్యమా?
ఇప్పుడు నేను చేస్తోంది అదే కదా. అందరూ నా పిల్లలే అన్నట్లు ఉంటున్నా. సరస్వతీ విద్యాపీఠం లక్ష్యమే అది. బీద విద్యార్థుల పట్ల, ప్రపంచం పట్ల ప్రేమ ఉండాలి. భవబంధాలు తెంచుకోవాలి. నా అన్నది మానేసి మన అన్నదాంట్లోకి రావాలి. డబ్బులు అనేక మార్గాల నుంచి వస్తుంటాయి వాటిని ఇచ్చేస్తుంటాను. అందుకే నావద్ద ఇప్పుడు డబ్బు అనేదే లేదు. సినిమా ఫీల్డులో అరుదుగానే పనిచేస్తున్నాను. అలా వచ్చే డబ్బులు కూడా ఉండవు. ఎంతో సౌకర్యంగా ఉన్నాను. ఇంకేమి కావాలి నాకు. ఇలాంటి ఆలోచన వస్తే భవబంధాలు పోతాయి. కాపీనం–పీనాసితనం–పోతుంది.
(యండమూరితో ఇంటర్వ్యూ పూర్తి కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement