యూపీఏకి సైనిక కుట్ర భయం!
డెబ్బయ్ దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్‌మార్షల్ జనరల్ మానెక్‌షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది.
‘భారత సైన్యమంటే పౌర ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించే బాధ్యతాయుతమైన దళం. ఎట్టి పరిస్థితులలోనూ తిరుగుబాటుకు ప్రయత్నించదు....’ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రెండురోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. రక్షణమంత్రి చేసిన ఈ ప్రకటన హఠాత్పరిణామం మాత్రం కాదు. యూపీఏ ప్రభుత్వం, సైనిక దళాల నాటి ప్రధానాధికారి వీకే సింగ్ వాస్తవాలను దాచి పెట్టారంటూ బీజేపీ, ఆమ్‌ఆద్మీ పార్టీ చేస్తున్న విమర్శలతో ఇది అర్థమవుతుంది. కానీ రెండేళ్ల నాటి ఈ అత్యంత వివాదాస్పద ఘటనను ‘ముగిసిన అధ్యాయంగా’ అభివర్ణించి రక్షణమంత్రి ఇప్పుడు కూడా దేశ ప్రజల దృష్టిని మళ్లించాలని అనుకోవడమే వింత. అప్పుడు ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఈ కథనాన్ని రక్షణమంత్రి, నాటి సైనిక దళాల ప్రధానాధికారి కూడా తోసిపుచ్చినా, ఇప్పుడు అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూశాయి. దీనితో మొదట వచ్చే ప్రశ్న- పౌర ప్రభుత్వానికీ, సైన్యానికీ మధ్య అపనమ్మకం పెరుగుతున్నదా?
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశంలో పౌర ప్రభుత్వం నిలకడగా కొనసాగడం భారతీయ సమాజం పరిణతికి నిదర్శనం. మన ఇరుగు పొరుగు దేశాలు ఇందుకు నోచుకోలేక పోవడం, దానితో ఎదురైన దుష్పరిణామాలు ప్రపంచానికి ఎరుకే. అయినా, మన దేశంలో కొన్నిసార్లు పౌర ప్రభుత్వాధినేతలు సైన్యాన్ని శంకించారని చెప్పడానికి దాఖలాలు లేకపోలేదు. ప్రథమ ప్రధాని నెహ్రూ హయాంలోనూ అలాంటిదేదో జరగబోతున్నదన్న అనుమానాలు కలిగాయి. నాటి రక్షణ మంత్రి కృష్ణమీనన్‌కూ, ఆర్మీ చీఫ్ కేఎస్ తిమ్మయ్యకూ మధ్య విభేదాలు ఇందుకు కారణం. పైగా భారత్‌లో సైనిక తిరుగుబాటుకు సీఐఏ తన వంతు ప్రయత్నం చేస్తున్నదని 1960 దశకంలో చైనా కూడా అనుమానించింది. తరువాత, 70 దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్‌మార్షల్ జనరల్ మానెక్‌షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది. ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతున్నాయని అంతా భావిస్తున్నపుడు, ఇష్టంగానో అనిష్టంగానో ఇలాంటి ప్రత్యామ్నాయం గురించిన దృశ్యాలు సమాజం ముందు కదులుతాయి.
2012 జనవరి మధ్యలో దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో రెండు సైనిక యూనిట్ల కదలికలు యూపీఏ ప్రభుత్వంలో ‘అత్యున్నత’ స్థాయిలోని వారిని కలవరానికి గురి చేశాయి. ఈ కదలికల గురించే ఆ సంవత్సరం ఏప్రిల్‌లో ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించగా రక్షణమంత్రి ఆంటోనీ, ‘ఇది శుద్ధ అబద్ధం’ అని కొట్టిపారేశారు. నాటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్, ఇది అనారోగ్యకర బుర్రల్లో నుంచి వచ్చిన వార్తాకథనమని వ్యాఖ్యానించారు. కానీ, ఇటీవలే పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ ఏకే చౌధురి ఈ ఫిబ్రవరి 21న చేసిన ప్రకటన అసలు సంగతి బయట పెట్టింది. రెండేళ్లుగా ఆంటోనీ, వీకే సింగ్ అబద్ధం చెబుతున్న సంగతి వెల్లడయింది.
చౌధురి చెప్పిన వివరాల ప్రకారం, జనవరి పదహారో తేదీన నాటి రక్షణ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ శర్మ తనను (చౌధురిని) పిలిచి ఆ దళాలను వెంటనే వెనక్కి వెళ్లమని ఆదేశించవలసిందిగా కోరారని ఆయన చెప్పారు. రాత్రి పదకొండుగంటల వేళ ఈ చర్చ జరిగింది. తాను ఇప్పుడే ప్రభుత్వ అత్యున్నత అధికార పీఠంపై ఉన్న వారి దగ్గర నుంచి వచ్చానని, వారు దళాల కదలికతో కలవరపడుతున్నారని శశికాంత్ తనకు చెప్పారని చౌధురి పేర్కొన్నారు. చౌధురి 2012లో సైనిక కార్యకలాపాల డెరైక్టర్ జనరల్‌గా (డీజీఎంఓ) పనిచేశారు. దళాల కదలిక, తన జనన సంవత్సర సర్టిఫికెట్ గురించి వీకే సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకే రోజు జరగడంతో ఈ అనుమానాలు కలిగాయని చౌధురి అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం మీద రక్షణ కార్యదర్శి నివేదిక కోరడం, తాను ఇవ్వడం కూడా జరిగిందని చౌధురి వెల్లడించారు.
చౌధురి ప్రకటన చేసిన మరునాడే వైమానిక దళాల రిటైర్డ్ చీఫ్ ఎన్‌ఏకే బ్రౌనే వెల్లడించిన అంశాలు కూడా 2012 నాటి ఘటన నిజమని స్పష్టం చేస్తున్నాయి. రెండు సైనిక యూనిట్లు కదలిక సమయంలోనే ఆగ్రా నుంచి పారా కమాండోస్ కూడా ఢిల్లీ దిశగా కదలిన సంగతిని బ్రౌనే వెల్లడించారు. నిజానికి పారా కమాండోలు 2012 ఫిబ్రవరిలో ఢిల్లీకి తర్ఫీదు కోసం వెళ్లవలసి ఉంది. ఈ దళం ఏ మిత్రదేశమైనా సంకటంలో పడినపుడు అత్యవసరంగా వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. సి-130 విమానాలతో ఈ కమాండోలకు ఇవ్వదలిచిన శిక్షణకు ఇంకా నెల సమయం ఉండగా ముందే ఎందుకు ఢిల్లీ వైపు కదిలాయన్నదే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. కాబట్టే, దేశ భద్రత, సాయుధ దళాల విశ్వసనీయత, ప్రభుత్వ మర్యాద వంటి అంశాలు ముడిపడి ఉన్న ఈ వివాదం గురించిన వాస్తవాలను తక్షణం వెల్లడించాలని రాజకీయ పక్షాలు కోరడం సబబే.
- డాక్టర్ గోపరాజు నారాయణరావు