అధినేతకు అక్షరాల విజ్ఞప్తి | request for nizam sugar factory reopen | Sakshi
Sakshi News home page

అధినేతకు అక్షరాల విజ్ఞప్తి

Published Sun, Jan 17 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

request for nizam sugar factory reopen

కొత్త ఏడాది 2016 కానుకగా కాబోలు నిజాం చక్కెర కర్మాగారం కార్మికులకు ‘లాకౌట్’ బహుమానం ప్రకటించింది యాజమాన్యం. కొత్త రాష్ట్రంలో కార్మిక విధానంగా పరిగణించాలని కాబోలు ఈ సంకేతం! మాంధ్ర పాలనలో ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా వేల కోట్ల ఆస్తులను సుమారు ఎనిమిది కోట్లకే ధారాదత్తం చేశారు. పనిచేసిన మూడు వేల మంది కార్మికులలో స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో, బలవంతపు తొలగింపుతో, రాచి రంపాన పెట్టి మూడు వందల మందికి కుదించి కన్నీళ్ల ఉప్పుటేరుల్ని పారించారు. చేసేదిలేక సుమారు డెబ్బై మంది కార్మికులు బలవంతపు మరణాలు పొందారు. అనారోగ్యాలతో, బెంగలతో కుళ్ళి కుళ్ళి మరణించినవారి ప్రేతాత్మలు నిజామాబాదు జిల్లాలో నడయాడుతున్నాయి.

 లాభాల్లో నడిచే కర్మాగారాన్ని నష్టాల్లోకి నెట్టి ఆ కర్మాగారం కూకటివేళ్ళతో ముక్కలు ముక్కలుగా అమ్ముకు తినాలని ప్రైవేటీకరణ ప్రణాళికల జాతర మొదలైంది. ప్రత్యేక తెలంగాణ  పోరాటంలో కార్మికులందరూ ఉత్సాహంగా పోరాటంలో పాల్గొని తమ వంతు కృషి చేశారు.

 కాని సమస్య ఇంకా జటిలం అవుతోంది. అంతరించే అంచులలో కర్మాగారమే కాదు, కార్మికులే కాదు, తెలంగాణ వాదుల కలలు కూడా కల్లలయ్యే మతలబు ఏదో జరుగుతోంది.
 అనేక మాసాల నుండి ఎంతోమంది నిరాహార దీక్షలు చేస్తున్నా తెలంగాణ  లోకం కిమ్మనకుండా ఉండడం వారిని బాధిస్తోంది. కొందరు ప్రజాతంత్రవాదులు చేస్తున్న ప్రయత్నాలు మరింత ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా కొనసాగవలసి ఉంది.

 సుదీర్ఘ న్యాయ పోరాటంలో తీర్పులు కార్మిక పక్షం ఉన్నా- కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వం దన్ను కనుపిస్తున్నా-  ఉద్యమ కాలంలో కేసీఆర్ గర్జన ఇంకా అందరి చెవుల్లో మారుమోగుతునే ఉంది. రాబోయే తెలంగాణా ప్రభుత్వం చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని మునుపటి వైభవం తెస్తుందని -  మిగిలిన కార్మికుల ప్రాణాలు కాపాడకుండా ఆతరువాత కర్మాగారం స్వాధీనం చేసుకుంటే ఏం లాభం?  22 డిసెంబర్ 2015 నాడు అర్ధరాత్రి రహస్యంగా కంపెనీ ‘లాకౌట్’ ప్రకటించి విభ్రాంతికి గురి చేసింది. ఆసియాకే గర్వకారణంగా ఉన్న తీపి తేనెతుట్టలో పొగలేచింది. అది తెలంగాణ అంతటా కమ్ముతోంది.  ఈ సందర్భంగా- యాగాగ్నికి ఆహుతైన వాటిలో కార్మికుల బతుకులు లేవని తెలిస్తే బాగుండు. యాగ ఫలితం కొంతైనా వెచ్చించి తెలంగాణ  కడుపు చిచ్చుని చల్లార్చగలిగితే మేలు.
 అయ్యా! ప్రియతమ అధినేతా!
 ఎవరి మాటని మీరు పట్టించుకోకండి. వినకండి. మీరు మాట్లాడిన మాటలనే ఓసారి గుర్తు తెచ్చుకోండి! ఒక ఆశ్వాసనకి ఇంతకన్నా మించిన మంచి సమయం మరోటి లేదు! ఒక మీ స్పందన కోసం తెలంగాణ వేచి ఉంది. దేశమే ఊపిరి బిగబట్టి చూస్తున్నది.
 (నేడు నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని దీక్షా శిబిరానికి వెళ్ళి, పీల్చి పిప్పి చేసిన చక్కెర కర్మాగారం కార్మికులని అక్షరాల దన్నుతో పలకరించాలని బయలుదేరిన సందర్భంగా)
 - తెలంగాణ రచయితల వేదిక
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement