యుద్ధానికి మారుపేరు ప్రతీకారం
వెస్ట్‌బ్యాంక్‌లో కిడ్నాప్‌నకు గురై మరణిచించిన ఇజ్రాయెలీ కుర్రాళ్ల ప్రాణాలకు బదులుగా ప్రతీకారానికి ప్రధాని నెతన్యాహూ పిలుపునిచ్చారు. నిరాధారంగా అది ‘హమస్’ పనేనని నిర్ధారించి గాజాపై పూర్తి స్థాయి యుద్ధానికి పిలుపునిచ్చారు.
ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని పాలస్తీనా ప్రజల అంతర్జాతీయ సౌహార్ద్రతా సంవత్సరంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే దేశంలేని ప్రజలుగా దశాబ్దాల తరబడి బతుకుతున్న పాలస్తీనీయుల్లో ఈ ఏడాది మొదటి అర్ధ భాగం ఆశలను రేకెత్తింపజేసింది. ఎంత చిన్నదైనా తమకంటూ ఒక దేశం ఉండాలన్న వారి కలలను సాకారం చేయడానికేనన్నట్టుగా... హమస్, ఫతా అనే రెండు పాలస్తీనా సంస్థల మధ్య ఏప్రిల్‌లో ఐక్యతా ఒప్పందం కుదిరింది.
రెండు ముక్కలుగా దూరంగా విసిరేసినట్టున్న పాలస్తీనా అవశేష భూభాగాలు వెస్ట్‌బ్యాంక్, గాజాలలో వచ్చే ఏడాది ఎన్నికలను నిర్వహిం చడం కోసం... నిరంతరం కలహించే ఆ రెండు సంస్థలు ప్రభుత్వం ఏర్పరచడానికి రంగం సిద్ధమైంది. కానీ పాల స్తీనా సౌహార్ద్రతా సంవత్సరం మొదటి భాగం మొలకెత్తింపజేసిన ఆశలకు ద్వితీయార్ధ భాగం సమాధి కట్టేలా ఉంది.
ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ (ఐఎస్‌ఐఎల్) సృష్టిస్తున్న ఉగ్ర ఉత్పాతంపై ప్రపంచమంతా దృష్టి సారించి ఉండగా... ఇజ్రాయెల్ పాలస్తీనాపై యుద్ధ ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ , పాలస్తీనా అనే రెండు దేశాలు లేనే లేవని, ఉండ జాలవని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నె తన్యాహూ గత నెల 17 నుంచి పదే పదే ప్రకటిస్తున్నారు. జూన్ 1 నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాం బులు కురిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగాల్లో, జెరూసలెంలో పాలస్తీనీయులపై దాడులు, ఆస్తుల విధ్వం సం సాగుతున్నాయి. గాజాపై పూర్తి స్థాయి యుద్ధం తప్పదని నెతన్యాహూ ప్రకటించారు. గాజాను తిరిగి అక్రమించక తప్పదని విదేశాంగ మంత్రి లిబర్‌మాన్ ప్రకటించారు.
ఇదంతా పాలస్తీనీయుల స్వయంకృతాపరాధమేనని ఇజ్రాయెల్ అంటోంది. వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెలీ అక్రమ సెటి ల్మెంట్‌లో 16-19 ఏళ్ల ముగ్గురు కుర్రాళ్లు కిడ్నాప్‌నకు గురయ్యారు. నెతన్యాహూ సహా ఇజ్రాయెల్ నేతలంతా నిరా ధారంగా అది ‘హమస్’ పనేనని నిర్ధారించేశారు. ప్రతీ కారం తప్పదంటూ యూదులను రెచ్చగొట్టారు. గత నెల 30న ముగ్గురు కుర్రాళ్ల శవాలు దొరకడంతో ప్రతీకారం మొ దలైంది. కిడ్నాప్‌తో ఎలాంటి సంబంధమూ లేదని హమస్ ప్రకటించింది. కిడ్నాప్ చేసిన ఇద్దరు హమస్ మిలిటెంట్లను గుర్తించామంటూ ఇజ్రాయెల్ వెస్ట్‌బ్యాంక్‌లోని ఆ ఇద్దరి ఇళ్లను కూలగొట్టింది ఆ ప్రతీకారం చాలలేదు. పాలస్తీనా ‘పశవులందరికీ బుద్ధి చెప్పాల’ని నెతన్యాహూ లికుద్ పార్టీ ప్రతీకారానికి పిలుపునిచ్చింది.
ఆక్రమిత పాలస్తీనా, తూర్పు జెరూసలెం, గాజాలలో ఇంతవరకు తొమ్మిది మంది కుర్రాళ్లను హతమార్చారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిం చే వరకు ఇజ్రాయెల్‌ను కూడా గుర్తించేది లేదనే హమస్ పాలనలోని గాజాపై జరిపిన ముప్పై వైమానిక దాడులతో విధ్వంసం సృష్టించారు. విదేశాంగ మంత్రి సెలవిచ్చినట్టే ముగ్గురు యూదు కుర్రాళ్ల ప్రాణాలకు పాలస్తీనీయులు ‘మూల్యాన్ని’ చెల్లిస్తున్నారు. మసీదులు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి.
కిడ్నాపైన కుర్రాళ్ల కోసం వెతుకులాట సాగుతుండగానే జూన్ 17న నెతన్యాహూ మరో ప్రకటన చేశారు. ఇరాక్‌లోని ఐఎస్‌ఐఎల్ ఉగ్రవాదులతో సంబంధమున్న అబూ బకర్ అల్ బాగ్దాదీ గ్రూపు పాలస్తీనాలో కార్యకలాపాలు సాగిస్తోందని హెచ్చరించారు. ఆ ముప్పును అరికట్టాలంటే జోర్డాన్ నదీ తీరానికి ఇజ్రాయెల్ బలగాల రక్షణను విస్తరించక తప్పదని మంగళవారం సెలవిచ్చారు. వెస్ట్ బ్యాంక్‌ను కబళించేయడమే లక్ష్యమని చెప్పకనే చెప్పారు. అదేమో గానీ హమస్‌తో ఐక్యత కారణంగానే వెస్ట్‌బ్యాంక్‌లో అధికారంలో ఉన్న ఫతాకు ముప్పు వాటిల్లిందంటూ పాల స్తీనా ఐక్యతను విచ్ఛిన్నం చేసే లక్ష్యాన్ని సాధించినట్టే ఉంది.
పాశ్చాత్య మీడియా కళ్లకు ఇయాల్ యిఫ్రాచ్, గిలాద్ షార్, నఫ్తై ఫ్రాంక్తెల్‌ల నూరేళ్ల జీవితాలను చిదిమేసిన ఘా తుకత్వం మాత్రం కనబడి, ఆలీ, మొహ్మద్, ముస్తాఫా, నదీమ్‌లాంటి పాలస్తీనా కుర్రాళ్ల జీవితాలను ప్రతీకారంగా తుంచేయడంలోని ఘాతుకత్వం కనిపించదు. గతంలో హమస్ ఇలాంటి కిడ్నాప్‌లకు పాల్పడిన మాట నిజమే. కానీ ఫతాతో ఐక్యతా కుదిరినప్పటి నుంచి అది హింసాత్మక ఘటనలకు దూరంగా ఉంటోంది.
హమస్‌ను వ్యతిరేకించే ఖతార్‌కు చెందిన ‘అల్ రయా,’ ఒమన్‌కు చెందిన ‘అల్ వతన్’ పత్రికలు ఇదంతా పాలస్తీనాపై యుద్ధానికి ఇజ్రాయెల్ గూఛడార సంస్థ ‘మొసాద్’ రచించిన పకడ్బందీ వ్యూహమని అభిప్రాయపడ్డాయి. ముగ్గురు యూదు పిల్లల హంతకులెవరైనా నరహంతకులే, శిక్షార్హులే. మరి బాధ్యతాయుతమైన దేశాధినేతగా ఉండి బహిరంగంగా సమష్టి ప్రతీకారానికి, యుద్ధానికి రెచ్చగొడుతున్న నెతన్యాహూ...?
పిళ్లా వెంకటేశ్వరరావు