హరిత క్షేత్రాల రక్షణకు సహ అస్త్రం
ప్రకృతి సహజంగా ఏర్పడిన హరిత క్షేత్రాలను విజయనగర రాజులు లక్షల ఎకరాలకు పెంచి కాపాడేవారు. వీటిని విధ్వంసం చేసే వారిని శిక్షించేవారు. మన ప్రభుత్వాలకు వేలాది ఎకరాల భూములను పరిశ్రమలకు అప్పగించడంపైనే ఎక్కువ ఆసక్తి.
సహ చట్టం ఇచ్చిన హక్కు సమాచారం అడగడానికే కాని సమస్యలకు పరిష్కారాలు కోరడానికి కాదు, ప్రశ్నలకు సమాధానాలు సంపాదించడా నికి కాదు అన్నది చాలా వరకు చట్టం చెప్పేమాటే. కాని సమ స్యలేనిదే సమాచారం అడ గరు. ప్రశ్న పుట్టకపోతే ఆర్టీఐ అభ్యర్థన రాదు. ఆర్టీఐ కింద ఏమడిగినా దానికి ఏదో ఒక సమస్య మూలాధారమవుతుందన్నది సామాజిక వాస్తవం.
చాలా సందర్భాలలో రాజ్యాంగ న్యాయస్థానాల తీర్పులకే దిక్కులేదు, ఇక ట్రిబ్యునల్ ఆదేశాలను అడిగే దెవరు? జాతీయ పర్యావరణ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు పాటించారా లేదా అనే వివరాలను కర్ణాటక పర్యావరణ మిత్రుడొకరు ఆర్టీఐ కింద పర్యావరణ మం త్రిత్వశాఖను అడిగారు. సాధారణంగా సమాచారం ఇచ్చే పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ప్రశ్నను మాత్రం పక్కకుబెట్టింది. మొదటి అప్పీలుకు కూడా స్పందన కరువైతే కమిషన్ ముందు రెండో అప్పీలు తప్పలేదు.
కర్ణాటక రాష్ర్టంలోని చిత్రదుర్గ జిల్లా చెల్లకెరె తాలూకాలో అమృత్ మహల్ కావల్స్ ప్రాంతం అద్భు తమైన పచ్చదనాన్ని చిందే జన, జంతు, జల, జీవ కేంద్రం. తూర్పు కనుమలలో ఇదొక పర్యావరణ రక్షక కేంద్రం. ఇక్కడ అనేకానేక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు వేలాది ఎకరాల భూమిని ధారా దత్తం చేస్త్తున్నది కర్ణాటక ప్రభుత్వం. దీంతో సహజ మైన జలవనరులు నానాటికీ క్షీణించి నీటి సంక్షోభం ఏర్పడే దశ వచ్చిందని ఐసీఏఆర్ పరిశోధన తెలిపింది.
కర్ణాటక కాలుష్య నివారణ మండలి చెల్లకెరె అమృత్ మహల్ కావల్స్ భూములలో రకరకాల పరిశ్ర మలు తదితర కార్యక్రమాలను సాగిస్త్తున్న సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా పరి శ్రమల విస్తరణ కార్యక్రమాలను చేపట్టడం కూడదని, వెంటనే అనుమతి కోరుతూ దరఖాస్తులు చేసుకోవాలని మండలి ఆ నోటీసుల్లో ఆదేశించింది.
ఇస్రో, బార్క్, భారతీయ విజ్ఞాన సంస్థ, ఏరోనా టికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, సాజిటార్ వెంచర్స్ లిమిటెడ్ వంటి సంస్థలకు కర్ణాటక ప్రభుత్వం దాదాపు 10 వేల ఎకరాల భూమిని ఇచ్చేసింది. వారు కాలుష్య నియంత్రణ మండలికి తమ పనుల వివరా లను ఇవ్వలేదు. అనుమతులు కోరలేదు కాని పనులు ప్రారంభించారు. 1980 అడవుల రక్షణ చట్టం కింద అనుమతి లేకుండా అటవీ భూములను మరే ఇతర పను లకు కేటాయించే వీల్లేదు. కాని ఈ నిబంధనను పట్టిం చుకునే వారు తక్కువ.
పెద్ద చెట్లు, దట్టమైన అడవులు, పొదలు కాకుండా పచ్చని గడ్డి విస్తారంగా కనిపించే భూములను గ్రాస్ లాండ్స్ అంటారు. అటువంటి భూముల్లో అమృత్ మహల్ కావల్స్ హరిత నేలలు చాలా విశిష్టమైనవని శాస్త్రజ్ఞులు వివరించారు. విజయనగర రాజులు ఈ హరిత క్షేత్రాలను లక్షల ఎకరాలకు పెంచి కాపాడేవారు. వీటిని విధ్వంసం చేసే వారిని కఠినంగా శిక్షించే వారు. మన ప్రభుత్వాలు మాత్రం వేలాది ఎకరాల భూము లను పరిశ్రమలకు అప్పగించడంలో ఆసక్తి చూపుతు న్నారేతప్ప, హరిత క్షేత్రాలుగా ఉండనీయడం లేదు.
ప్రతి నియమాన్ని, చట్టాన్ని ధిక్కరించి, అక్కడ నివ సించే ఆదిమవాసుల హక్కులను పట్టించుకోకుండా పశుపక్ష్యాదులను బతకనీయకుండా, పుష్పవనాలు, తీగలు డొంకలు, పొదలు, నీటివనరులను కాపాడే బదులు హరిస్త్తున్నారని పర్యావరణవాదులు విమర్శిస్తు న్నారు. ఈ హరిత క్షేత్రాలలో అభివృద్ధి వాదులు కోట గోడల వంటి ప్రహరీలు నిర్మించి, నీటి ప్రవాహాలను అడ్డుకోవడమే కాకుండా, వీటిపై ఆధారపడి జీవించే ఆదిమవాసుల బతుకు హక్కులను కూడా హరిస్తు న్నారని వారు ఆరోపించారు.
విదేశాల నుంచి అందమైన పక్షులు ఇక్కడ జీవించ డానికి వలస వచ్చేవి. కాని ఇక్కడ పచ్చదనం కరువై జలవనరులు ఇంకిపోవడంతో, పక్షులు రావడం లేదు. నీటి ఊటలు తగ్గిపోయాయి. పశువులకు మేత కూడా కరువయ్యే పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కల పంటల దిగుబడి తగ్గింది. ఈ జిల్లాలో పదేళ్లలో దాదాపు 101 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
మనుషులు బతకలేక, పశువులు గడ్డి లేక నానా తంటాలు పడడానికి కారణం ఈ పచ్చదనం కరువు కావడమే. మనుషులతోపాటు పూలవనాలు, జలాశ యాలు, భూగర్భజల నిలయాలు కూడా వసివాడి పోతున్నాయి. ఇక్కడ జనజీవనం ఒక నాటి హరిత క్షేత్రాలను వదిలేసి వలస పోయే పరిస్థితులు వచ్చాయి.
ఇటువంటి హరిత క్షేత్రాలు ఎన్నో జాతుల పశువులను పోషిస్తూ, పూలవనాలకు ఆవాసమవుతూ జీవవైవిధ్య కేంద్రాలుగా ఉన్నాయని, కాని ప్రస్త్తుతం ఇవి శరవేగంగా తరిగిపోతున్నాయని, వీటిని రక్షించుకో వలసిన బాధ్యత కర్ణాటక రాష్ర్ట ప్రభుత్వంపైన ఉందని, ఇకనుంచి అమృత్ మహల్ కావల్స్ భూములను పరిశ్రమల కోసం లేదా మరే ఇతర అభివృద్ధి కోసం ఇవ్వకూడదని హైకోర్ట్టు తీర్పు చెప్పింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సవివరమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను అమలు చేశారో లేదో, చేయకపోతే ఎందుకు చేయలేదో చెప్పవలసిన అవసరం ఉందని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది.
(డేవిస్ జార్జి థామస్ వర్సెస్ పర్యావరణ మంత్రిత్వశాఖ కేసులో అక్టోబర్ మూడో వారంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com