వర్సిటీ వైస్ చాన్స్‌లర్లు ఎలా ఉండాలి? | universities vice chancellor will behave in which manner | Sakshi
Sakshi News home page

వర్సిటీ వైస్ చాన్స్‌లర్లు ఎలా ఉండాలి?

Published Sun, Jan 31 2016 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

వర్సిటీ వైస్ చాన్స్‌లర్లు ఎలా ఉండాలి?

వర్సిటీ వైస్ చాన్స్‌లర్లు ఎలా ఉండాలి?

అభిప్రాయం
విశ్వవిద్యాలయాలు అత్యున్నత స్థాయి విద్యా సంస్థలు. చిన్నప్పటి నుండి అనేక రకాల పాఠ్యాంశాలను అభ్యసించిన విద్యా ర్థులు చివరగా ఒక నిర్దిష్టాంశాన్ని ఎన్నుకుని దానిని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి కొండంత ఆశతో విశ్వవిద్యాల యంలోకి అడుగుపెడతారు. విశ్వవిద్యాల యాలు వైస్ చాన్స్‌లర్ల నాయకత్వంలో పని చేస్తుంటాయి. ఇదొక పెద్ద ప్రపంచం. అందుకే విశ్వవిద్యాలయమన్నారు. ఈ ప్రపంచానికి నాయకులు వైస్ చాన్స్‌లర్లు. విశ్వ విద్యాలయ ప్రగతి, గౌరవాలు వీళ్ళు భుజస్కంధాల మీద మోస్తూ ఉండాలి. ఒక్క మాటలో విశ్వవిద్యాలయ రథానికి ఇరుసు వైస్ చాన్స్‌లర్.

తమ పిల్లలు తమకన్నా మించిన జ్ఞానవంతులు, ప్రయో జకులు అవుతారన్న గట్టి నమ్మకంతో వాళ్ళను తల్లిదండ్రులు  విశ్వవిద్యాలయంలోకి పంపిస్తారు. అత్యున్నత విద్య ద్వారా తమ పిల్లలు తమ జీవితం కన్నా మంచి జీవితం పొందాలని ఆశిస్తారు. ఈ నమ్మకాలు, ఈ ఆశలు వమ్ము కాకుండా, విఫలం కాకుండా చూసే బాధ్యత వైస్ చాన్స్‌లర్ల పైన ఉంది. ఇంతటి బాధ్యతగల పదవిలోకి ప్రభుత్వం పంపించే వైస్ చాన్స్‌లర్లు ఎలాంటి వాళ్లై ఉండాలి? విశ్వవిద్యాలయాలు హేతువాదానికి, లౌకికవాదానికి, శాస్త్రీయ దృక్పధానికీ నిలయాలుగా ఉండాలని ప్రథమ భారత ప్రధాని పండిత జవ హర్ లాల్ నెహ్రూ ఆకాంక్షించారు. విద్యా ర్థులు వాటిని జీర్ణించుకుని విద్య ముగించుకుని బయటికెళ్ళిన తరువాత భారతదేశాన్ని ఈ సూత్రాల మీదనే పునర్నిర్మాణంలో చేయడానికి కృషి చేస్తారని ఆయన భావించి ఉంటారు. ఇంతపని జరగాలంటే వైస్ చాన్స్‌లర్లలో ఈ మూడు లక్షణాలు ఉండాలి. వీళ్ళు హేతువాదులు, లౌకిక వాదులైఉండాలి. శాస్త్రీయ దృక్ప థాన్ని అలవరచుకొని విశ్వవిద్యాలయాన్ని నడిపించాలి.

కానీ, ఇవాళ మన విశ్వవిద్యాలయాలు ఇందుకు భిన్నంగా, తలకిందులుగా వేలాడుతున్నాయి. ఈ మూడు సూత్రాలమీద నమ్మకం లేని ఆచార్యులు ‘‘వైస్ చాన్స్‌లర్ పదవి’’ని ‘‘అలంకరి స్తున్నారు’’. నిరక్షరాస్యులలో జీర్ణించుకుపోయిన విశ్వాసాలు, అభి రుచులు, ఆలోచనలు గల విద్యావంతులు వైస్ చాన్స్‌లర్లు అవు తున్నారు. చాన్స్‌లర్ అధ్యక్షుడైతే, వైస్ చాన్స్‌లర్ ఉపాధ్యక్షుడు కావాలి. కానీ చాలామంది వైస్ చాన్స్‌లర్లు తమ కార్యాలయాల దగ్గర ఉపకులపతి అని బోర్డు త గిలించుకుని ఉంటారు. నెహ్రూజీ విశ్వవిద్యాలయాలలో ఉండాలని పేర్కొన్న మూడు అంశాలకు ‘ఉపకులపతి’ వ్యతిరేకమైనది. కుల వ్యవస్థ వల్లే భారతదేశం ఇంకా కురుక్షేత్రంగా ఉంది. కుల, మత భారతదేశం స్థానంలో లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్యవాద భారతదేశ నిర్మాణం లక్ష్యంగా భారత రాజ్యాంగం నిర్దేశించుకున్నది. దీనికి ‘కుల పతులు’ పనికిరారు. రాజ్యాంగం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అను గుణంగా పౌరులను తయారు చేయడం విశ్వవిద్యాలయ బాధ్యత. అక్కడే ‘కులపతులు’ ఉంటే అక్కడ ప్రాణం పోసుకునేది కులాలే. వైస్ చాన్స్‌లర్లు ‘కులపతులు’గా మురిసిపోతుంటే సమాజానికి దిక్కెవరు?

విశ్వవిద్యాలయమంటే కుల, మత, అజ్ఞాన రోగులకు చికిత్స చేసే కేంద్రమని అర్థం. అలాంటి సంస్థకు ‘ఉపకులపతులు’ నాయకులుగా పనికిరారు. ‘కోడలుదిద్దిన కాపురం’ సినిమాలో ‘ఈ దేశంలో పుట్టిన ప్రతి అడ్డగాడిదకు ఒక కులం ఉంటుంది’ అంటారు ఎన్.టి. రామారావు. భారతదేశం కుల సమాజం, మత సమాజం. విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్లను కూడా వీటి ప్రాతి పదిక పైనే నియమిస్తున్నారు. ఒక ‘ఆచార్యుడు’ ైవైస్ చాన్స్‌లర్‌గా నియమితుడైన తరువాత ఆయన/ఆమె అందరి వ్యక్తి కావాలి. తన కులాన్ని, తన మతాన్ని తన ఇంట్లో అటకమీద పెట్టి రావాలి. ‘విశ్వనరుడు’గా విశ్వవిద్యాలయంలోనికి అడుగుపెట్టాలి. అంతే తప్ప తన కులమతాలను తీసుకొచ్చి విశ్వవిద్యాలయంలో దించేస్తే అక్కడ మిగిలిలేది బూడిదే.

ఇప్పుడు వైస్ చాన్స్‌లర్ పదవికి ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు సాంకేతికమైనవే తప్ప తాత్వికమైనవి కావు. అయిదేళ్లో, పదేళ్లో ఆచార్యులుగా అనుభవం ఉండటం. కొన్ని పరిశోధనలు చేయించి ఉండటం, కొన్ని ప్రచురణలు చేసి ఉండటం, ఇలాంటివే ఇప్పుడున్న అర్హతలు, ఇవి అవసరమైనవే. కానీ ఇవే సర్వస్వం కాదు. ఇప్పుడు ఈ అర్హతలు లేని ఆచార్యులు ఉండరు. వీళ్లలో అత్యధికులు ‘ఉపకులపతి’ నామప్రియులే. ఉపాధ్యక్షులు కాదగిన సమర్థులు తక్కువ మందే ఉంటారు. ప్రభుత్వం వీళ్ళను వెతికి పట్టుకోవాలి. ఎక్కువమంది వైస్ చాన్స్‌లర్లు సామాజిక వైజ్ఞానిక, శాస్త్రాలకు చెందిన వాళ్ళే ఉంటారు. వాళ్లు ఆయా శాస్త్రాలలో నిష్ణాతులుగా కూడా ఉంటారు. కానీ తాత్వికతలో, సామాజిక చైతన్యంలో వాళ్ళు మామూలు వాళ్లుగానే ఉంటారు. శాస్త్రాలు చదువుకుంటారు గానీ శాస్త్రీయ దృక్పథం ఉండదు. ఇందువల్ల విశ్వవిద్యాలయాలకు నష్టం తప్ప ప్రయోజనముండదు. కర్మ సిద్ధాంతం, పూర్వ జన్మ సుకృతం వంటివి చెప్పడానికి ఎంఏలు, ఎంఎస్‌లు ఎందుకు? పీహెచ్‌డీలు ఎందుకు? అలాంటి వాళ్ళకు వైస్ ఛాన్స్‌లర్ పదవి ఎందుకు?

కర్మ సిద్ధాంతం శ్రమ దోపిడీ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాం తాన్ని పట్టుకుని వేలాడే వైస్ చాన్స్‌లర్లు ఇక విద్యా సంస్థలను ఎలా ముందుకు తీసుకుపోతారు? ఆధునిక విద్యకు కర్మ సిద్ధాంతానికి సంబంధం లేదు. కర్మ సిద్ధాంతం వ్యాపారుల సిద్ధాంతం, విద్యావంతుల సిద్ధాంతం కాదు, తాత ముత్తాల నాటి విశ్వా సాలను నిర్మూలించి ఆధునిక వైజ్ఞానిక ఆలోచనలను రేకెత్తిం చవలసిన విశ్వవిద్యాలయంలోకి కర్మవాదులు రావడం నష్ట దాయకం. వాళ్ళు శల్యసారధులౌతారు. కర్మ సిద్ధాంతం ప్రచారం చెయ్యడానికి వేరే సంస్థలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వీళ్లకు విశ్వవిద్యాలయాలెందుకు?

విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు వర్తమానంలో ఆలోచించాలి. వర్తమానంలో జీవించాలి మనసా వాచా కర్మణా. విశ్వవిద్యా లయ ఉపాధ్యక్షులు ప్రజాస్వామికవాదులు, మానవీయమూర్తులు కావాలి. నిరంకుశులు, మానవ ముఖం లేని వాళ్ళు ఈ పదవికి పనికిరారు. ఇతరుల అభిప్రాయాలను వినగలిగిన, గౌరవించ దగిన సంస్కారం ఉండాలి. నేను చెప్పిందే శాసనం అనే పిడివాదులు ఈ పదవికి పనికిరారు. భారతదేశం వైరుధ్యాల పుట్ట. వైవిధ్య భరితమైన నేపధ్యాలలో ఉంటారు విద్యార్థులు, ఉపాధ్యా యులు. ఈ వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకుని సమన్వయం చేసుకోగల సంస్కారాన్ని ప్రజాస్వామ్యమిస్తుంది. నిరంకుశత్వం ఇవ్వదు. వైస్ చాన్స్‌లర్ల్లు మానవ ప్రేమికులు కావాలి. ఉద్యోగులను, విద్యార్థులను సానుకూల దృష్ట్టితో అర్థం చేసుకోగలగాలి. పదిమందికి తిండి బెట్టడానికి, వేల మందికి జ్ఞానమివ్వడానికి విశ్వవిద్యాలయం ఉన్నదనే జ్ఞానంగలవాళ్ళే ఈ పదవికి అర్హులు.

విశ్వవిద్యాలయాలు బయటి సమాజానికి వైజ్ఞానిక నాయ కత్వం వహించాలి. ప్రగతిశీలమైన అంశాలను ముందుగా దొరక బుచ్చుకుని సమాజానికి మార్గదర్శకత్వం వహించాలి. ఇలాంటి సంస్థలకు ఆధునిక వేషం వేసుకున్న పదకొండవ శతాబ్దపు ఆలోచనపరులు పనికిరారు. బయటి సమాజంలోని రుగ్మతలను విశ్వవిద్యాలయం తన పరిశోధనల ద్వారా నిర్మూలించాలి. బయటి సమాజంలోని రుగ్మతలను ఒంటబట్టించుకోకూడదు. దేశ పునర్నిర్మాణానికి అవసరమైన పౌరులను తయారు చేసే విశ్వవిద్యాలయానికి ‘‘ఏక రక్త బంధూ!  విశ్వ కుటుంబీ’’ అనే శ్రీశ్రీ భావనల మీద విశ్వాసం గల వాళ్ళే వైస్ చాన్స్‌లర్లు కావడానికి అర్హులు, ఈ భావాలు అలవరచుకున్న వాళ్ళుంటేనే విశ్వవిద్యాలయాలు నిజమైన విద్యాలయాలు అవుతాయి. లేదంటే అవి కులాల కుంపట్లు, మతాల మంటపాలు అవుతాయి. హేతువాదం, లౌకికత్వం, శాస్త్రీయ దృక్పథం గల వాళ్లు మాత్రమే వైస్ చాన్స్‌లర్లుగా ఉండటానికి అర్హులు.
 

 రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి,
 వ్యాసకర్త ఆచార్యులు, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప మొబైల్: 9440222117

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement