పింఛను పేరిట యూపీఏ వంచన
ఓఆర్‌ఓపీ అమలుకు ఆర్థికమంత్రి రూ. 500 కోట్లు కేటాయించారు. ఇదే వివాదానికి కేంద్ర బిందువయింది. ప్రస్తుతం రక్షణ రంగంలో ఉద్యోగుల సంఖ్య 14 లక్షలు. ఆ రంగం నుంచి ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్న వారి సంఖ్య 25 లక్షలు.
లోక్‌సభ గడువు పూర్తయిపోయింది. పార్లమెంటులో యూపీయే ప్రవేశపెట్టిన చాలా బిల్లుల సంగతి చూస్తే, ‘తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండి!’ అన్న తీరులోనే ఉన్నాయి. తన్నుకు చావవలసి వస్తే మాత్రం ఆ బాధ్యత ఎన్‌డీఏదే. యూపీఏకు వచ్చే ఎన్నికలలో అవకాశాలు తక్కువని, ఎన్‌డీఏ ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువని సర్వేలు చెబుతున్నాయి. అందుకే బిల్లుల మీద బిల్లులు ప్రవేశపెట్టి, ఆ కీర్తిని యూపీఏ ఖాతాలో వేసుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ శ్రమించింది. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు సహా, చాలా బిల్లుల మీద ఇలాంటి హడావుడి ముద్ర సుస్పష్టం. అలాంటి బిల్లుల జాబితాలో చేరేదే భద్రతా దళాల కోసం ఉద్దేశించిన ‘ఒకే శ్రేణి, ఒకే పింఛను’.
‘ఒకే శ్రేణి, ఒకే పింఛను’(ఓఆర్‌ఓపీ) పథకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో చేర్చారు. ఇది త్రివిధ దళాల మాజీ ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు సంబంధించినది. ఒకే శ్రేణితో, సేవల కాల పరిమితి ఒకటే అయిన సైనికులు ఉద్యోగ విరమణ చేసిన ట్టయితే వారికి ఒకే రకం పింఛను వర్తింపచేయడం ఈ బిల్లు ఉద్దేశం. ఇంకా సున్నితంగా చెప్పాలంటే, నిర్దిష్ట సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకీ, అదే శ్రేణికి చెంది, మరొక సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన వారికి ఒకే విధమైన పింఛను వర్తింపచేయడం దీని ఉద్దేశం. అంటే 1993లో ఉద్యోగ విరమణ చేసిన ఒక సిపాయికి, వేరే సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన మరో సిపాయీకి కూడా ఒకే స్థాయి పింఛను లభిస్తుంది. భారత మాజీ సైనికోద్యోగుల ఆందోళన సంఘం అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ కడ్యాన్ మాటల్లో చెప్పాలంటే, ‘ఇంతవరకు ఎన్ని వేతన సంఘాలు వచ్చినా, ప్రభుత్వోద్యోగుల వేతనాలు పెంచడమే తప్ప, మాజీ సైనికుల పింఛను గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.’ దీనితో ఎప్పటి నుంచో వారి పింఛను గొర్రె తోక బెత్తెడు రీతిలో ఉండిపోయింది. నిజానికి చాలినంత పింఛను పొందడానికి నిర్దేశించినంత కాలం సైనిక దళాలలో ఉండే ఉద్యోగులు తక్కువే. 1983లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు పింఛను అనేది, ‘నష్ట పరిహారం కాదు, ఉద్యోగంలో ఉండగా చేసిన సేవకు ఇచ్చే పారితోషికం’. ఆ మేరకు ఓఆర్‌ఓపీ పథకాన్ని ప్రవేశపెట్టడం సబబే. దీని ప్రకారం పాత పింఛనుదారులకు కూడా పెరిగిన కొత్త పింఛనును వర్తింపచేస్తారు. 2014-2015 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది.
2014-15 బడ్జెట్‌లో రూ. 2,24,000 కోట్లు రక్షణ కేటాయింపులు చేశారు. ఇది 2013-14 బడ్జెట్‌లో రక్షణ అంచనాల కంటె పది శాతం ఎక్కువ. ఆ బడ్జెట్‌లో చేసిన కేటాయింపు రూ. 2,01,672 కోట్లు. గత బడ్జెట్‌లో రక్షణ రంగ పింఛన్లకు రూ. 45.000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో అది రూ. 50,000 కోట్లకు పెంచవలసి ఉంది. ఓఆర్‌ఓపీ అమలుకు ఆర్థికమంత్రి రూ.500 కోట్లు కేటాయించారు. మరిన్ని నిధులు అవసరమైతే, అవి రక్షణ మంత్రిత్వ శాఖకు జరిగిన కేటాయింపుల నుంచి సేకరించుకోవాలని కూడా ఆర్థికమంత్రి చెప్పేశారు. ఇదే వివాదానికి కేంద్ర బిందువయింది. ప్రస్తుతం రక్షణ రంగంలో ఉద్యోగుల సంఖ్య 14 లక్షలు. ఆ రంగం నుంచి ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్న వారి సంఖ్య 25 లక్షలు.
ఓఆర్‌ఓపీ అమలుకు బీజేపీ సహా అన్ని కాంగ్రెసేతర పక్షాలు సుముఖంగానే ఉన్నాయి. ఈ విధానం కోసం ఐదేళ్లుగా మాజీ సైనికోద్యోగులు పట్టుబడుతున్నారు. యూపీఏ-2 పదవీకాలం మరో పదిహేనురోజులలో ముగుస్తుందనగా ఆదరాబాదరా ఈ పథకం అమలుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి కేవ లం కొద్దిరోజుల ముందు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ సైనికోద్యోగులతో భేటీ కావడంతో ఇది సాధ్యమైంది. అంతకంటె ముందు మాజీ సైనిక దళాల ప్రధాన అధిపతి జనరల్ వీకే సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కలిసి గడచిన సెప్టెంబర్ నాటి రేవారి (హర్యానా) సభలో పాల్గొన్నారు. అప్పుడే ఓఆర్‌ఓపీ అమలులో జరుగుతున్న జాప్యానికి వారు నిరసన వ్యక్తం చేశారు. కాబట్టే రాజకీయ కారణాలే బిల్లును పార్లమెంటుకు వెళ్లేలా చేశాయి. అయితే ఈ పథకానికి రూ. 1,730 కోట్ల నుంచి రూ. 3,000 కోట్లు అవసరమని నిపుణుల అంచనా. కానీ కొద్ది మొత్తం పడేసి మేం ఉద్ధరించామన్న తీరులో కాంగ్రెస్ వ్యవహరించడం మాజీ సైనికులకు సంతోషానికి బదులు ఆగ్రహం తెప్పిస్తున్నది. 25 లక్షల మాజీ సైనికోద్యోగుల ఓట్లు, వారి కుటుంబాల ఓట్ల కోసమే రాహుల్ ఆదరాబాదరా బిల్లుకు బూజు దులిపించారన్న ఆరోపణ వినిపిస్తున్నది ఇందుకే.
-గోపరాజు