
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను చంద్రబాబు నాయుడు అక్రమంగా తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాంబు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సేవామిత్ర యాప్‌లోకి ఆధార్ డేటా ఎలా వచ్చిందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ఇరు రాష్ట్రాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. డేటా చోరీ కేసుపై చంద్రబాబు విచారణకు సిద్ధమని చెప్పగలరా అని సవాల్ చేశారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్‌ని ఎక్కడ దాచారో చెప్పాలని డిమాండ్ చేశారు. అశోక్ విచారణకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రజాధరణ లేదని తెలుసుకున్న చంద్రబాబబు.. ప్రజాస్వామ్యాన్ని దగా చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేప్పేవి నీతులు.. చేసేవన్ని దొంగపనులని ఎద్దేవా చేశారు. బీజేపీ చంకనెక్కింది.. కేసీఆర్ యాగానికి వెళ్లింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏపీ ప్రజలు కప్పం కట్టే పరిస్థితిని వైఎస్ జగన్ రానివ్వరని చెప్పారు